ఆకలి విలువ అప్పుడే తెలిసింది
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటించిన తాజా చిత్రం రాబిన్‌హుడ్ మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 22 March 2025 10:29 AM ISTటాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటించిన తాజా చిత్రం రాబిన్‌హుడ్ మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. సినిమా ప్రమోషన్స్ లో యాక్టివ్ గా పాల్గొంటున్న నితిన్, ఎవరు ఇంటర్వ్యూ అడిగినా టైమ్ అడ్జస్ట్ చేసుకుని కాదనకుండా ఇచ్చేస్తున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నితిన్ తన గత సినిమాల అనుభవాన్ని పంచుకున్నాడు.
ఇంటర్వ్యూలో భాగంగా మూడు ఫోటోలోను చూపించి ఆ ఫోటోల గురించి చెప్పమని అడగ్గా నితిన్ ఆ రోజులను గుర్తు చేసుకున్నాడు. అందులో మొదటి ఫోటో నితిన్ చిత్రం మ్యాగజైన్ పై వచ్చిన కవర్ ఫోటో. ఆ ఫోటో వచ్చినప్పుడు తను చాలా చిన్న వాడినని, ఏమీ తెలియదని, ఏదో మన ఫోటో కూడా వచ్చిందిలే అనుకున్నానని తెలిపాడు.
ఇక రెండో ఫోటో జయం సినిమాలోని ప్రియతమా సాంగ్ లోని స్టిల్. ఆ ఫోటో గురించి మాట్లాడుతూ ఆ పాట షూటింగ్ సారధి స్టూడియోలో వేసిన స్పెషల్ సెట్ లో జరిగిందని, అదే తన ఫస్ట్ సెట్ సాంగ్ అని, సాంగ్ షూట్ వారం రోజుల పాటూ జరగ్గా, అన్ని రోజులు తాను పొద్దున్నే కేవలం ఒక్క ఇడ్లీ మాత్రమే తినేవాడినని, మొత్తం రోప్ సాంగ్ కాబట్టి ఏం తిన్నా తాగినా వాంతి అవుతుందేమోననే భయంతో ఆ వారం రోజులు ఏం తినలేదని నితిన్ చెప్పాడు.
మూడో ఫోటో నితిన్ 8 ప్యాక్ చేసిన ఫోటో. ఆ 8 ప్యాక్ కోసం చాలా కష్టపడ్డానని, మొదట్లో తాను చాలా సన్నగా ఉండేవాడినని, అలా ఉంటే 8 ప్యాక్ చేయడం కష్టమని, దాని కోసం ముందుగా కండలు పెంచి ఆ తర్వాత దాన్ని 8 ప్యాక్ చేశానని చెప్పాడు నితిన్. ఆ టైమ్ లో కూడా అసలు ఫుడ్ ఏమీ తీసుకోలేదని, ఒక ఆరెంజ్ తీసుకుని దాన్ని జస్ట్ నోట్లో పెట్టుకుంటే వచ్చే జ్యూస్ తోనే ఎన్నో గంటల పాటూ సరిపెట్టుకునే వాడినని, ఆకలి విలువ అప్పుడే తెలిసిందని తాను పడిన కష్టాన్ని వివరంచాడు నితిన్.
ఇక రాబిన్‌హుడ్ విషయానికొస్తే వెంకీ కుడుముల ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఆల్రెడీ వీరిద్దరి కలయికలో భీష్మ సినిమా వచ్చి సూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు రెండోసారి వీరి కాంబోలో సినిమా రానుండటంతో రాబిన్‌హుడ్ పై భారీ అంచనాలున్నాయి. శ్రీలీల హీరోయిన్ గా రూపొందిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించింది.