భారత్ లో పేదరికంపై "నీతి ఆయోగ్" ఆసక్తికర వ్యాఖ్యలు!
ఈ సర్వేలో జనాభాను 20 రకాలుగా వర్గీకరించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా పెరిగిన నెలవారీ సగటు ఖర్చు వివరాలు వెల్లడించారు.
By: Tupaki Desk | 26 Feb 2024 3:30 PM GMTభారతదేశంలో అతిప్రధాన సమస్యల్లో ఒకటి పేదరికం! వాస్తవానికి ఒకప్పుడు భారతదేశానికి ఉన్న ప్రధాన సమస్యల్లో జనాభా ప్రధానంగా ఉండేది! అయితే... ఇప్పుడు స్వాతంత్రం వచ్చి ఇంతకాలం అయినా పేదరికం మాత్రం రూపుమాపలేకపోతున్నారు! అయితే ఈ విషయంపై తాజాగా నీతీ ఆయోగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇందులో భాగంగా... భారతదేశంలో పేదరికం స్థాయి 5శాతం దిగువకు పడిపోయిందని వెల్లడించింది.
అవును... భారతదేశంలో పేదరికం స్థాయి 5 శాతానికి దిగువకు పడిపోయిందని.. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రజల ఆదాయం పెరిగిందని.. 2022-23 సమయలో చేపట్టిన గృహ వినియోగ వ్యయ సర్వే (హెచ్.సీ.ఈ.ఎస్) ను ఉంటంకిస్తూ నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణం వెల్లడించారు. ఈ సర్వేలో జనాభాను 20 రకాలుగా వర్గీకరించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా పెరిగిన నెలవారీ సగటు ఖర్చు వివరాలు వెల్లడించారు.
ఇందులో భాగంగా... పట్టణాలు, గ్రామాల్లో ప్రజల ఆదాయం పెరిగిందని నీతి ఆయోగ్ చేపట్టిన సర్వే ఫలితాలు చెబుతున్నాయి. ఇందులో భాగంగా... 2011-12 తో పోలిస్తే గ్రామాల్లో నెలవారీ ఖర్చులు సుమారు 40.42శాతం పెరిగి ఆ మొత్తం 2,008 రూపాయలు కాగా... పట్టణ ప్రాంతంలో నెలవారీ యావరేజ్ ఖర్చు 33.5 శాతం పెరిగి 3,510 రూపాయలుగా పెరిగిందని స్పష్టం చేసింది.
ఇదే సమయంలో తాజా సర్వే డేటా ప్రకారం... దేశంలో పేదరికం 5 శాతం లేదా అంతకంటే కూడా తగ్గే అవకాశం ఉందని సుబ్రహ్మణ్యం తెలిపారు. ప్రజలు ఆహారంపై పెడుతున్న ఖర్చు విధానాల్లో కూడా మార్పులను ఈ సర్వే గుర్తించిందని వెల్లడించారు. ఇందులో భాగంగా ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లోని కుటుంబాలు మొత్తం వ్యయంలో సుమారు 50శాతం కంటే తక్కువగా ఆహారం కోసం కేటాయించినట్లు సర్వేలో తేలిందని తెలిపారు.
ఇదే క్రమంలో... 2004 - 05 మధ్యకాలంలో గ్రామిణ ప్రాంతాల్లోని ప్రజలు, పట్టణ ప్రాంతాల్లోని ప్రజలు చేసే ఖర్చుల్లో వ్యత్యాసం ఏకంగ 91శాతం గా ఉండేదని చెప్పిన ఆయన... ఇప్పుడు ఆ వ్యత్యాసం 71శాతానికి తగ్గిపోయిందని సర్వే వెల్లడించిందని తెలిపారు. కచ్చితంగా ఇది మారుతున్న అసమానతల తగ్గుదలను సూచిస్తుందని సర్వే తెలిపింది.
ఈ క్రమంలో... కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలైన ఆయుష్మాన్ భారత్, ఉచిత విద్య వంటి ప్రయోజనాలను సర్వేలో చేర్చలేదని చెప్పిన సుబ్రహ్మణ్యం... ఈ నివేదిక తెలిపిన వివరాల మేరకు భారత్ లో పేదరికం దాదాపు అదృశ్యమైందని చెప్పడం గమనార్హం!