‘సహజీవనం’, ‘స్వలింగ వివాహం’ పై కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు!
ఈ సమయంలో లివ్ ఇన్ రిలేషన్ షిప్ పై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. దాని ఎఫెక్ట్ ను స్పష్టంగా వెల్లడించారు!
By: Tupaki Desk | 18 Dec 2024 4:05 AM GMTప్రస్తుత సమాజంలో లివ్ ఇన్ రిలేషన్స్ షిప్ ట్రెండ్ ఎక్కువగానే కొనసాగుతుందని అంటున్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు ఎక్కువగా యూరప్ దేశాలకే పరిమితమైనట్లు కనిపించిన ఈ ట్రెండ్.. భారత్ లాంటి దేశాల్లో కూడా వ్యాపించడం, విస్తరిస్తుండం గమనార్హం. దీనిపై విమర్శలు గుప్పించేవారు గుప్పిస్తుంటే.. సమర్ధించేవారు సమర్ధిస్తూనే ఉన్నారు.
పైగా.. పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడటాన్ని అప్ డేట్ అవ్వడం అని.. భారతదేశ మూలలను గుర్తుపెట్టుకుని, సంప్రదాయాలకు విలువ ఇస్తూ నడుచుకోవడాన్ని వెనుకబడిపోయినట్లు చెబుతున్నారనే చర్చ నడుస్తుంది. ఈ సమయంలో లివ్ ఇన్ రిలేషన్ షిప్ పై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. దాని ఎఫెక్ట్ ను స్పష్టంగా వెల్లడించారు!
అవును... ఏ విషయంపై అయినా ఉన్నంతలో సూటిగా మాట్లాడటానికి ప్రయత్నిస్తారనే పేరున్న కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తాజాగా నేటి సమాజానికి.. ప్రధానంగా యువతకు సంబంధించిన కొన్ని కీలక అంశాలపై స్పందించారు. ఇందులో భాగంగా... లివ్ ఇన్ రిలేషన్ షిప్, స్వలింగ వివాహాలు వంటి అంశాలపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
ఓ యూట్యూబ్ పాడ్ కాస్ట్ లో లివ్ ఇన్ రిలేషన్ షిప్ పై తన అభిప్రాయాలను అడిగినప్పుడు.. స్పష్టమైన సమాధానం ఇచ్చారు గడ్కరీ. ఈ సందర్భంగా... తాను ఒకసారి లండన్ లో బ్రిటిష్ పార్లమెంట్ ను సందర్శించినప్పుడు.. వారి ప్రధాన మంత్రి, విదేశాంగ మంత్రి తననూ “మీ దేశంలోని ప్రధాన సమస్య ఏమిటి” అని అడిగారని చెప్పారు గడ్కరీ.
దీనికి సమాధానంగా... తమ దేశంలో ఉన్న ప్రధాన సమస్యలు.. పేదరికం, ఆకలి అని చెప్పినట్లు తెలిపారు. ఇదే సమయంలో... "మీ దేశంలో ఉన్న అతి పెద్ద సమస్య ఏమిటి?" అని వారిని ఎదురు అడిగితే... ఇక్కడ ప్రజలు వివాహం చేసుకోవడానికి ఆసక్తి చూపడం లేదు అని చెప్పారని తెలిపారు.
ఈ సందర్భంగా ఈ తరహా శైలిపై ఘాటుగా స్పందించిన ఆయన... ఈ ప్రపంచంలో పిల్లలను పెంచడం అనేది బాధ్యతగా తీసుకోవడంతో కూడుకున్నదని.. అందువల్ల పిల్లల సంక్షేమం సురక్షితంగా ఉండేలా చూసుకోవడానికి వివాహం అవసరమని గడ్కరీ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే.. లివ్ ఇన్ రిలేషన్ షిప్ సరైంది కాదు, సమాజాన్ని నాశనం చేస్తుందని నొక్కి చెప్పారు.
ఇదే సమయంలో స్వలింగ వివాహాల అంశాన్ని ప్రస్తావించిన గడ్కరీ... ఇది సామాజిక నిర్మాణాన్నే నాశనం చేస్తుందని అన్నారు!