Begin typing your search above and press return to search.

పత్రికలకు కొత్త పని పెట్టిన కేంద్ర మంత్రి గడ్కరీ

మోడీ సర్కారులోని మంత్రుల్లో కాస్త ఓపెన్ గా మాట్లాడే ఏకైక కేంద్ర మంత్రిగా నితిన్ గడ్కరీగా చెప్పాలి.

By:  Tupaki Desk   |   3 Oct 2024 4:36 AM GMT
పత్రికలకు కొత్త పని పెట్టిన కేంద్ర మంత్రి గడ్కరీ
X

మోడీ సర్కారులోని మంత్రుల్లో కాస్త ఓపెన్ గా మాట్లాడే ఏకైక కేంద్ర మంత్రిగా నితిన్ గడ్కరీగా చెప్పాలి. మిగిలిన వారంతా అవసరమైన అంశాల్లోనూ.. ఎంపిక చేసిన అంశాల పైనే మాట్లాడతారు తప్పించి.. అంతకు మించి ఒక మాట ఎక్కువ మాట్లాడేందుకు ఇష్టపడరు. అందుకు భిన్నంగా తనకు తోచిన అంశాన్ని తోచిన రీతిలో మాట్లాడే ఏకైక కేంద్ర మంత్రిగా నితిన్ గడ్కరీని చెప్పాలి. రాజకీయాలతో పాటు సామాజిక అంశాల్ని కూడా ఆయన తన మాటల్లో ప్రస్తావిస్తూ ఉంటారు.

గాంధీ జయంతి సందర్భంగా నాగపూర్ లో ఏర్పాటు చేసి భారత అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాకు.. అందునా ప్రింట్ మీడియాకు కొత్త టాస్కును ఇచ్చారు. రోడ్ల మీద ఉమ్మేసే వారి ఫోటోల్ని ప్రచురించాలని కోరారు. పాన్ మసాలా నమిలి రోడ్లపై ఉమ్మి వేసిన వారి ఫోటోలను పబ్లిష్ చేయటం ద్వారా వారి తీరులో మార్పురావాలన్న తన ఆలోచనను షేర్ చేసుకున్నారు. ఇదే సందర్భంగా దేశ ప్రజలకున్న ఒక సిత్రమైన అలవాటును చెప్పుకొచ్చారు.

భారతదేశంలో చాక్లెట్ కవర్ ను రోడ్ల మీదే పడేసే పౌరులు.. విదేశాల్లో మాత్రం జేబుల్లో పెట్టుకొని తిరుగుతారన్నారు. చాక్లెట్ తిన్న తర్వాత కవర్ ను కారులో నుంచి బయటకు విసిరే అలవాటు గతంలో తనకూ ఉండేదన్న గడ్కరీ.. ఇప్పుడు మాత్రం చాక్లెట్ తింటే ఆ కవర్ ను జేబులో పెట్టుకొని ఇంటికి వచ్చి చెత్తబుట్టలో వేస్తున్న విషయాన్ని వెల్లడించారు. మహాత్మా గాంధీ జయంతి వేళ పరిశుభ్రతను పాటిస్తూ.. పర్యావరణ సంరక్షణకు పాటుపడాలంటూ పిలుపునిచ్చారు.

ప్రజలు చాలా తెలివైనోళ్లుగా అభివర్ణించిన గడ్కరీ.. దేశంలో చాక్లెట్ కవర్లను రోడ్ల మీద పడేసే ప్రజలు.. అదే విదేశాలకు వెళ్లినప్పుడు మాత్రం అందుకు భిన్నంగా ప్రవర్తిస్తారన్నారు. మరి.. గడ్కరీ మాష్టారు చెప్పినట్లుగా పాన్ మసాలా నమిలి రోడ్ల మీద ఉమ్మిసే ఫోటోల్ని పత్రికల్లో ప్రచురిస్తారా? ఇప్పటికే పేజీలు తగ్గి బక్కిచిక్కిని పేపర్ లో గడ్కరీ చెప్పినట్లుగా ఫోటోలు వేయాలంటే ఎదురయ్యే స్థలభావం సంగతేమిటో?