'టోల్'కు నెలవారీ పాసులు..గడ్కరీ నోట కీలక వ్యాఖ్యలు
టోల్ వసూలుకు ప్రైవేటు వాహనాలకు నెలవారీ లేదంటే ఏడాది పాటు చెల్లుబాటు అయ్యే పాసుల్ని తీసుకురావాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉందన్నారు.
By: Tupaki Desk | 16 Jan 2025 4:16 AM GMTనేషనల్ హైవేల మీదకు వాహనాలు వెళ్లినంతనే.. కాసింత దూరం నుంచే మొదలయ్యే టోల్ ఛార్జీల మోత అంతకంతకూ ఎక్కువ అవుతున్న సంగతి తెలిసిందే. అప్పుడప్పుడు ప్రయాణాలు పెట్టుకునే వారికి ఓకే కానీ.. అందుకు భిన్నంగా నిత్యం ఆ రోడ్ల మీద ప్రయాణించాల్సి వచ్చే వారికి మాత్రం.. ఆ ఖర్చులు చుక్కలు చూపిస్తూ ఉంటాయి. ఇలాంటి వేళ.. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నోటి నుంచి కీలక వ్యాఖ్యలు వచ్చాయి. టోల్ వసూలుకు ప్రైవేటు వాహనాలకు నెలవారీ లేదంటే ఏడాది పాటు చెల్లుబాటు అయ్యే పాసుల్ని తీసుకురావాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉందన్నారు.
టోల్ వసూళ్లలో ప్రైవేటు వాహనాల వాటా 26 శాతం వరకు ఉందని.. టోల్ తగ్గించేందుకు ఎదురవుతున్న అడ్డంకులన్న అంశంపై జరిగిన కార్యక్రమానికి నితిన్ గడ్కరీ హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామస్థుల రాకపోకలకు అంతరాయం కలగకుండా టోల్ బూత్ లను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. టోల్ వసూళ్లలో 74 శాతం వాణిజ్య.. సరుకు రవాణా వాహనాల నుంచి వస్తున్నాయన్న గడ్కరీ.. ప్రైవేటు వాహనాలకు నెలవారీ పాసులు.. లేదంటే ఏడాదికి చెల్లుబాటు అయ్యేలా పాసులు తేవాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెప్పారు. అంతేకాదు.. మరో ఆసక్తికర అంశాన్ని వెల్లడించారు.
ఫాస్టాగ్ ను కంటిన్యూ చేస్తూనే.. అడ్డంకులు తక్కువగా ఉండే నేవిగేషన్ శాటిలైట్ సిస్టమ్ ఆధారిత టోల్ వసూలు వ్యవస్థను అమలు చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు గడ్కరీ వెల్లడించారు. ప్రస్తుతం అమల్లో ఉన్న టోల్ విధానంతో పోలిస్తే జీఎన్ఎస్ఎస్ ఉత్తమమైనదిగా పేర్కొన్నారు. ఈ కొత్త టెక్నాలజీ ఆధారిత టోల్ వ్యవస్థకు సంబంధించి బెంగళూరు - మైసూర్ ఎన్ హెచ్ 275తో పాటు హర్యానాలోని పానిపట్ - హిసార్ ఎన్ హెచ్ 709 మధ్య ప్రాథమిక అధ్యయనాన్ని చేస్తున్నట్లుగా గతంలోనే గడ్కరీ వెల్లడించారు. వీలైనంత త్వరగా ఈ ప్రతిపాదనలు వాస్తవరూపం దాల్చాలని కోరుకుందాం.