Begin typing your search above and press return to search.

ఆ 20 మందిలో ముగ్గురు కేంద్ర మంత్రులు?

సభకు గైర్హాజరైన వారిలో కేంద్ర మంత్రులు నితిన్ గడ్కారీ, గిరిరాజ్ సింగ్, జ్యోతిరాదిత్య సింధియా, సీఆర్ పాటిల్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

By:  Tupaki Desk   |   18 Dec 2024 12:45 PM GMT
ఆ 20 మందిలో ముగ్గురు కేంద్ర మంత్రులు?
X

జమిలి బిల్లు ప్రవేశపెట్టే సమయంలో పార్లమెంట్ సమావేశానికి గైర్హాజరైన 20 మంది ఎంపీలకు బీజేపీ నోటీసులిచ్చింది. ఇందులో ముగ్గురు కేంద్ర మంత్రులు ఉన్నారని సమాచారం.

వన్ నేషన్ - వన్ ఎలక్షన్ బిల్లు ప్రవేశపెట్టిన సమయంలో లోక్ సభ సమావేశానికి గైర్హాజరైన బీజేపీ సభ్యులపై హైకమాండ్ సీరియస్ అవుతోంది. పార్టీ విప్ ధిక్కరించిన 20 మంది ఎంపీలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఇందులో ముగ్గురు కేంద్రమంత్రులు ఉన్నట్లు చెబుతున్నారు. పార్టీ విప్ ధిక్కారించడాన్ని సీరియస్ గా తీసుకున్న కేంద్ర పెద్దలు సభకు డుమ్మాకొట్టిన ఎంపీలపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనే చర్చ ఉత్కంఠ రేపుతోంది.

పార్లమెంట్ నియమావళి ప్రకారం విప్ ధిక్కారానికి అనర్హత వేటు పడే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం గైర్హాజరైన 20 మందిపై అంతటి సీరియస్ యాక్షన్ తీసుకునే అవకాశం లేకపోయినా, పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించిన నేతలపై కఠిన చర్యలు ఉంటాయనే సందేశం పంపడానికే 20 మంది ఎంపీలకు నోటీసులు ఇచ్చినట్లు చెబుతున్నారు.

కీలకమైన బిల్లు ప్రవేశపెడుతున్నందున సభలో సభ్యులు అంతా అందుబాటులో ఉండాలని సోమవారమే తన పార్టీ సభ్యులకు విప్ జారీ చేసింది బీజేపీ హైకమాండ్. సభలో బీజేపీ నేత్రుత్వంలోని ఎన్డీఏ కూటమికి 292 మంది సభ్యుల బలం ఉంది. ఇందులో బీజేపీకి సొంతంగా 240 మంది సభ్యులు ఉన్నారు. మంగళవారం జరిగిన జమిలి ఓటింగ్ కు ప్రభుత్వానికి అనుకూలంగా 269 మంది ఓటేశారు. అంటే ఎన్డీఏ వాస్తవ బలం కన్నా 23 ఓట్లు తక్కువ వచ్చాయి. ఇందులో బీజేపీ సభ్యులే 20 మంది ఉన్నట్లు చెబుతున్నారు. సభకు గైర్హాజరైన వారిలో కేంద్ర మంత్రులు నితిన్ గడ్కారీ, గిరిరాజ్ సింగ్, జ్యోతిరాదిత్య సింధియా, సీఆర్ పాటిల్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో సీఆర్ పాటిల్ తన సొంత రాష్ట్రం రాజస్థాన్లో ప్రధాని పర్యటన నేపథ్యంలో ముందస్తు అనుమతితో సభకు రాలేదు. మిగిలిన ముగ్గురు కేంద్ర మంత్రులు గైర్హాజరుకు తగిన కారణం చెప్పాలని నోటీసులిచ్చింది హైకమాండ్.

ఇక మిగిలిన సభ్యుల్లో శంతను ఠాకూర్, జగదాంబికా పాల్, బీవై రాఘవేంద్ర, విజయ్ బాఘేల్, ఉదయరాజే భోంసాలే, జగన్నాథ్ సర్కార్, జయంత్ కుమార్ రాయ్, వి.సోమన్న, చింతామణి మహారాజ్ సభకు రాలేదని చెబుతున్నారు.

వీరంతా ఉద్దేశపూర్వకంగా సభకు గైర్హాజరయ్యారా? లేక ముందస్తు కార్యక్రమాల వల్ల రాలేకపోయారా? అన్న విషయంపై బీజేపీ హైకమాండ్ ఆరా తీస్తోంది. వాస్తవానికి బీజేపీలో క్రమశిక్షణ చాలా ఎక్కువ. సభకు గైర్హాజరైన 20 మందిలో జ్యోతిరాదిత్య మినహా మిగిలిన వారు సంఘ్ పరివార్ నేపథ్యం ఉన్నవారే కావడం గమనార్హం. కానీ, కీలకమైన బిల్లు విషయంలో సభ్యుల నిర్లక్ష్య వైఖరిపై ప్రభుత్వం ఆగ్రహంగా ఉందని తాజా నోటీసులతో వెల్లడైంది. నోటీసులకు వివరణ తీసుకుని అంతటితో వదిలేస్తారా? లేక ఇంకేమైనా చర్యలకు ఉపక్రమిస్తారా? అనేది రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.