Begin typing your search above and press return to search.

ట్రెండింగ్... రియల్ ఎస్టేట్ ధరలను గాలి, నీటి నాణ్యత నిర్ణయిస్తే..?

ఈ పరిస్థితుల్లో కూడా ఢిల్లీ.. దేశ రాజధానిగా కొనసాగాలా అనే చర్చ సైతం తెరపైకి వచ్చింది. ఈ సమయంలో ఇంట్రస్టింగ్ టాపిక్ లేవనెత్తారు జెరోధా సీఈఓ నితిన్ కామత్.

By:  Tupaki Desk   |   25 Nov 2024 5:30 PM GMT
ట్రెండింగ్... రియల్  ఎస్టేట్  ధరలను గాలి, నీటి నాణ్యత నిర్ణయిస్తే..?
X

భారతదేశంలోని ప్రధాన నగరాల్లో వాయు కాలుష్యం మహమ్మారి పెను సమస్యగా మారిన సంగతి తెలిసిందే. ఇక గత కొన్ని రోజులుగా దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ పరిస్థితుల్లో కూడా ఢిల్లీ.. దేశ రాజధానిగా కొనసాగాలా అనే చర్చ సైతం తెరపైకి వచ్చింది. ఈ సమయంలో ఇంట్రస్టింగ్ టాపిక్ లేవనెత్తారు జెరోధా సీఈఓ నితిన్ కామత్.

అవును... గాలి, నీటి నాణ్యతను పర్యావరణ పరిస్థితులతో ఆస్తి ధరలను అనుసంధానించడం ద్వారా... ఢిల్లీ, బెంగళూరు వంటి నగరాల్లో అధ్వాన్నంగా ఉన్న గాలి నాణ్యత సమస్యను పరిష్కరించవచ్చనే ఓ కొత్త ఆలోచనను ప్రతిపాదించారు. ఆ ప్రాంతాల్లోని గాలి, నీటి నాణ్యత ఆధారంగా ప్రాపర్టీ ధరలను తగ్గించవచ్చని ఆయన ఈ సందర్భంగా సూచించారు.

ఈ విధానం.. ఇంటి యజమానులు, కమ్యునిటీలు వారి స్థానిక వాతావరణాన్ని మెరుగుపరచడానికి చురుకుగా పనిచేయడానికి ప్రోత్సహిస్తుందని.. ఇది మెరుగైన పట్టణ ప్రణాళికకు ఒక కీలక ఆలోచన అని అంటున్నారు. తాజాగా ఎక్స్ లో ఓ పోస్ట్ పెట్టిన కాంత్... కాలుష్యం యొక్క తీవ్రమైన సామాజిక, ఆర్థిక ప్రభావాలను హైలెట్ చేశారు.

ఈ సందర్భంగా... భూమిని కొనుగోలు చేసే ఎవరైనా గాలి, నీటి నాణ్యతను ఆస్తిగా భావించరు.. కానీ.. గాలి, నీటి నాణ్యత అనేది ఆస్తి రేటును నిర్ణయిస్తుందని తెలిపారు. తాను బెంగళూరులోని జేపీ నగర్ లో ఆస్తిని కలిగి ఉండగా.. ఇతర లే అవుట్ ల కంటే మంచి వాతావరణంలో ఇది ఉందని పేర్కొన్నారు.

ప్రధానంగా దేశ రాజధాని అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నప్పటికీ.. అక్కడి వాతావరణం చాలా దుర్భర స్థితిలో ఉందని.. ఇక్కడ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 412 కంటే ఎక్కువ ఉందని.. దీన్ని బట్టి చూస్తే ఢిల్లీలో వాయు కాలుష్యం ఏస్థాయిలో ఉందో అర్ధమవుతోందని అన్నారు. ముంబై, చెన్నై, కోల్ కతా, బెంగళూరులో కూడా కాలుష్యం తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోందని పేర్కొన్నారు!

ఇలా కామత్ చేసిన సూచన ఇంటర్నెట్ లో వైరల్ మారింది.. ఓ ఆసక్తికర చర్చకు దారి తీసింది. ఇందులో భాగంగా... కోట్లు ఖర్చు పెట్టి విలాసవంతమైన ఇళ్లు కొంటున్నామని అనుకుంటున్నారే తప్ప.. అంతకంటే విలువైన వాటి (గాలి, నీరు) నాణ్యతను పరిగణలోకి తీసుకోలేకపోతున్నారని నెటిజన్లు స్పందించారు.