Begin typing your search above and press return to search.

అలా జరిగితే.. చెన్నై నుంచి బెంగళూరుకు రెండు గంటల్లోనే ప్రయాణం!

తాజాగా అశోక్‌ లేలాండ్‌ 75వ వార్షికోత్సవ వేడుకల్లో కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

By:  Tupaki Desk   |   8 Sep 2023 6:44 AM GMT
అలా జరిగితే.. చెన్నై నుంచి బెంగళూరుకు రెండు గంటల్లోనే ప్రయాణం!
X

కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బెంగళూరు – చెన్నై ఎక్స్‌ప్రెస్‌ హైవేను 2023 చివరిలో లేదా 2024 జనవరి నాటికి ప్రారంభిస్తామన్నారు. దీంతో రెండు మెట్రోపాలిటన్‌ నగరాల మధ్య ప్రయాణం కేవలం రెండు గంటలపాటు మాత్రమే ఉంటుందని తెలిపారు.

తాజాగా అశోక్‌ లేలాండ్‌ 75వ వార్షికోత్సవ వేడుకల్లో కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. చెన్నైలో జాతీయ రహదారుల ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించానని వెల్లడించారు. బెంగళూరు – చెన్నై ఎక్స్‌ప్రెస్‌ హైవే ఈ ఏడాది చివరిలో లేదా వచ్చే ఏడాది జనవరి నాటికి ప్రారంభిస్తామన్నారు. ఈ ప్రాంతాల్లో లగ్జరీ బస్సులు, స్లీపర్‌ కోచ్‌ లను ప్రారంభించవచ్చని తెలిపారు.

ఎన్డీయే ప్రభుత్వం హయాంలో వివిధ ప్రాజెక్టుల ద్వారా దేశ రాజధాని ఢిల్లీ నుంచి చెన్నై, సూరత్, నాసిక్, అహ్మద్‌ నగర్, కర్నూలు, కన్యాకుమారి, తిరువనంతపురం, కొచ్చి, బెంగళూరు, హైదరాబాద్‌ లను కలుపుతున్నామని చెప్పారు.

అలాగే దేశ రాజధాని ఢిల్లీ, రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌ మధ్య ఎలక్ట్రిక్‌ కేబుల్‌ హైవేను నిర్మించే ప్రక్రియ ఉందని గడ్కరీ తెలిపారు. బయో ఇంధనాలతో నడిచేవాటితోపాటు ఈ– వాహనాలు వంటివాటిని పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయాలని అశోక్‌ లేలాండ్, ఇతర వాహన తయారీ కంపెనీలను ఆయన కోరారు.

కాగా బెంగళూరు – చెన్నై ఎక్స్‌ప్రెస్‌ వే బెంగళూరు శివార్లలోని హోస్కోట్‌ నుంచి ప్రారంభమై తమిళనాడులోని కాంచీపురం జిల్లాలో ఉన్న పెరంబుదూర్‌ వరకు ఉంటుంది. ఈ హైవే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలమీదుగా వెళ్తుంది.

గతేడాది మేలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఎక్స్‌ప్రెస్‌ వేకు శంకుస్థాపన చేశారు. దీని పొడవు 262 కిలో మీటర్లు. రూ. 14,870 కోట్లకుపైగా వ్యయంతో దీనిని నిర్మిస్తున్నారు.

ఈ హైవే పూర్తి అయితే కేవలం రెండు గంటల్లోనే బెంగళూరు నుంచి చెన్నైకు చెన్నై నుంచి బెంగళూరుకు వెళ్లొచ్చని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ రెండు నగరాల మధ్య ప్రయాణానికి ఐదు గంటల నుంచి ఆరు గంటల సమయం పడుతుంది.