Begin typing your search above and press return to search.

బీజేపీలో గడ్కరీకి పెరుగుతున్న క్రేజు ?

నితిన్ గడ్కరీ సౌమ్యుడుగా కనిపిస్తారు. కానీ అదే సమయంలో తాను అనుకున్న నిర్ణయాల పట్ల నిబద్ధతతో ఉంటారు

By:  Tupaki Desk   |   14 July 2024 4:30 PM GMT
బీజేపీలో గడ్కరీకి పెరుగుతున్న క్రేజు ?
X

నితిన్ గడ్కరీ సౌమ్యుడుగా కనిపిస్తారు. కానీ అదే సమయంలో తాను అనుకున్న నిర్ణయాల పట్ల నిబద్ధతతో ఉంటారు. అమలు విషయంలో రాజీ పడరు. కొన్ని సందర్భాలలో కఠినంగా కూడా ఉంటారు. నితిన్ గడ్కరీది రాష్ట్రీయ స్వయం సంఘ్ నేపధ్యం. ఆయన నివాసం కూడా నాగపూర్ లోని ఆరెస్సెస్ ప్రధాన ఆఫీస్ పక్కనే కావడం విశేషం.

ఆరెస్సెస్ మెచ్చే అతి కొద్ది మంది నాయకులలో నితిన్ గడ్కరీ ఒకరు. ఆయనకు పరిపాలనా దక్షుడిగా పేరుంది. ఆయన తొలిసారి మహారాష్ట్రలో శివసేన బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో అయిదేళ్ల పాటు మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో గడ్కరీ ముఖ్యంగా ముంబాయి-పూనా ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణం చేసి జనంలో మంచి పేరు తెచ్చుకున్నారు.

ఆయన బీజేపీకి జాతీయ స్థాయి అధ్యక్షుడిగా చాలా కాలం పనిచేశారు. ఆయనకు ఆరెస్సెస్ అండ ఉంది. గత పదేళ్ళుగా ఆయన కేంద్రంలో మంత్రిగా పనిచేస్తున్నారు. ఇదిలా ఉంటే 2024 ఎన్నికల్లో బీజేపీ సొంతంగా మెజారిటీ సాధించలేక మిత్రులతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కానీ మోడీ అమిత్ షాల నాయకత్వం గతంలో సాధించిన విజయాలు ఇపుడు కొనసాగడం లేదు. పైగా నరేంద్ర మోడీ గ్రాఫ్ తగ్గుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.

ఇక చూస్తే కేంద్ర ప్రభుత్వం అయిదేళ్ళూ పనిచేయదని విపక్షాలు జోస్యం చెబుతున్నాయి. అనేక కీలక పరిణామాలు కూడా సంభవించవచ్చు అని అంటున్నారు. ఈ ఏడాది చివరిలో జరిగే మహారాష్ట్ర ఎన్నికల నుంచి ఎన్డీయే ప్రభుత్వానికి వత్తిడి పెరుగుతుందని అంటున్నారు.

లోక్ సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో తక్కువ సీట్లనే ఎన్డీయే కూటమి గెలుచుకుంది. అదే రిపీట్ అయితే మహారాష్ట్ర ఉద్ధవ్ థాక్రే నాయకత్వంలోని శివసేన, శరద్ పవార్ నాయకత్వంలోని ఎన్సీపీ ప్లస్ కాంగ్రెస్ కూటమి పరం అయినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు ఇవన్నీ పక్కన పెడితే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఎలాగైనా కొనసాగించాలన్నది ఆరెస్సెస్ ఆలోచనలుగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ పరిణామాల నేపధ్యం చూసినపుడు నితీన్ గడ్కరీకి క్రేజ్ సొంత పార్టీలోనే పెరుగుతోంది అని అంటున్నారు. 2029 ఎన్నికల నాటికైనా నితిన్ గడ్కరీ ప్రధాని రేసులో తప్పకుండా ఉంటారని అంటున్నారు. బీజేపీలో నాయకులకు కొదవ లేదు. మోడీ వారసులు ఎవరు అని ఒక లిస్ట్ చూస్తే అమిత్ షా యూపీ సీఎం ఆదిత్యనాథ్ యోగీ నితిన్ గడ్కరీ రాజ్ నాధ్ సింగ్ వంటి వారు కనిపిస్తారు. వీరిలో గడ్కరీకే ఆరెస్సెస్ మొగ్గు ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. ఏది ఏమైనా ఈ అయిదేళ్ళూ మోడీ అమిత్ షాలు ప్రభుత్వాన్ని నడపడం అన్నది కత్తి మీద సామే అని అంటున్నారు.