Begin typing your search above and press return to search.

బీజేపీకి నితీష్ గండం ?

భారతీయ జనతా పార్టీకి బీహార్ అసెంబ్లీ ఎన్నికలు క్యాట్ క్యాట్ వాక్ అయితే కానే కావు అని అంటున్నారు.

By:  Tupaki Desk   |   21 March 2025 8:30 AM IST
బీజేపీకి నితీష్ గండం ?
X

భారతీయ జనతా పార్టీకి బీహార్ అసెంబ్లీ ఎన్నికలు క్యాట్ క్యాట్ వాక్ అయితే కానే కావు అని అంటున్నారు. ఎందుకంటే అక్కడ ఎన్డీయే కూటమిలో ఉంటూ ముఖ్యమంత్రి పదవి నిర్వహిస్తున్న నితీష్ కుమార్ వరంగా కంటే భారంగా మారుతున్నారని అంటున్నారు. 2020 ఎన్నికల్లో నితీష్ క్లీన్ ఇమేజ్ మోడీ షాల వ్యూహాలు ఫలించి ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చింది.

అయితే ఈ అయిదేళ్ళలో ఎన్ని పిల్లి మొగ్గలు వేయాలో అన్నీ వేసి నితీష్ రాజకీయంగా పలుచన అయ్యారు. ఆయన ఇమేజ్ కూడా బాగా దెబ్బ తింది. ఇపుడు దానికి తగినట్లుగా ఆయన సుదీర్ఘమైన పాలన పట్ల జనాల్లో వ్యతిరేకత ఉంది. యాంటీ ఇంకెంబెన్సీ ఉంది. ప్రతిపక్షం అక్కడ బలంగా ఉంది.

ఆర్జేడీ అంతకంతకు విస్తరిస్తోంది. లాలూ కుమారుడు తేజస్వి యాదవ్ కి అంతకంతకు ఆదరణ పెరుగుతోంది. బీజేపీలో చూస్తే సీఎం క్యాండిడేట్ ఎవరు అన్నది ఇప్పటిదాకా తేలని విషయం ఒకటైతే జేడీయూ నుంచి నితీష్ కుమార్ ఫేస్ తో ఎన్నికలకు వెళ్తే ఈసారి బెడిసి కొడుతుందా అన్న కంగారు కూడా ఉంది అని అంటున్నారు.

ఎందుకంటే నితీష్ కుమార్ ఇటీవల కాలంలో విపక్షాల విమర్శలకు దొరుకుతున్నారు. ఆయన తాజాగా జాతీయ గీతాలాపన సమయంలో చేసిన చేష్టలు కూడా మీడియా ముఖంగా జనంలో చర్చకు వస్తున్నాయి. నితీష్ మానసిక స్థితి బాగా లేదని ఇంతకాలం విపక్షాలు అంటూంటే జనాలు పెద్దగా పట్టించుకోలేదు కానీ జాతీయ గీతాలాపన వేళ ఆయన చేసిన చేష్టలు చూసిన వారు ముక్కున వేలేసుకుంటున్నారు. ఏదో తేడా ఉందని అంటున్నారు.

ఇక నితీష్ ని ముందు పెట్టి ఈయనే మా సీఎం క్యాండిడేట్ అని చెప్పుకుని ఎన్డీయే ఈ ఎన్నికల్లో జనం ముందుకు వస్తే అది భారమే తప్ప ఒరిగేది ఉండదని అంటున్నారు. అలా కాకుడా సీఎం ఎవరో చెప్పకుండా ఎన్నికలకు వెళ్ళినా కూడా అది ఇబ్బంది మరింతగా పెంచుతుంది. పైగా జేడీయూ ఆ విషయంలో ఎంతవరకూ అంగీకరిస్తుందో తెలియదు. ఇక నితీష్ కు ఏకైక కుమారుడు ఉన్నారు. ఆయన వారసుడిని ఏనాడూ రాజకీయాల్లోకి తేలేదు.

కానీ జేడీయూ నేతలు మాత్రం నితీష్ కాకపోతే ఆయన కుమారుడు అయినా పార్టీకి సారధిగా ఉండాలని ఆయనే కాబోయే సీఎం అని అంటున్నట్లుగా ప్రచారం సాగుతోంది. ఇక నితీష్ ని ఈసారికి సెలవిచ్చి బీజేపీ ముఖ్యమంత్రిని చేద్దామని ఎన్డీయే పెద్దల ఆలోచన ఉంది. కానీ ఇపుడు నితీష్ వారసుడు అంటూ వస్తే బీజేపీ ఆశలు నెరవేరవు. ఇక కమలనాధులు ఈ పరిణామానికి అంగీకరిస్తారా అన్నది కూడా చూడాలని అంటున్నారు.

నితీష్ విషయం అయితే కమలంలో కలవరం రేపుతోంది. ఆయన మానసికంగా అలసిపోయారు అని జనసురాజ్ నేత ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ చాలా కాలం క్రితమే చెప్పారు. ఇపుడు చూస్తే విపక్షాలు అదే అంటున్నాయి. జనంలో కూడా ఈ విషయం చర్చగా ఉంది. మరో ఆరు నెలలలో ఎన్నికలు పెట్టుకుని బీజేపీ బీహార్ లో ఏ వ్యూహం అనుసరిస్తుంది అన్నది అయితే అంతుపట్టడం లేదు.

లోక్ సభ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు గెలుచుకున్న ఎండీయే కూటమి అసెంబ్లీ ఎన్నికలలో మాత్రం ఎలా ముందుకు వెళ్తుందో విజయం ఎలా అందుకుంటుందో చూడాల్సి ఉంది. నితీష్ లేని ఎన్డీయేని ఊహించలేరు. అలాగే నితీష్ ని వెంటబెట్టుకుని ఎన్నికల గోదాలోకి దిగలేరు. ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్లుగా బీహార్ లో బీజేపీ పరిస్థ్తి మారుతోందా అన్నదే ఇపుడు చర్చగా ఉంది. మరి బీజేపీ ఏ స్ట్రాటజీ అనుసరిస్తుంది అన్నదే ఆసక్తికరంగా ఉంది.