‘మతిస్థిమితం తప్పి ఉంటే’... సీఎం వెకిలి చేష్టలపై విపక్షాలు ఫైర్!
జాతీయ గీతం ఆలపించే సమయంలో ఎంత క్రమశిక్షణగా ఉండాలనే విషయం స్కూలు పిల్లలకు కూడా తెలుస్తుంది! అయితే..
By: Tupaki Desk | 21 March 2025 1:46 PM ISTఇటీవల బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన విపరీత ప్రవర్తనతో వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు! ఈ క్రమంలో తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఈ సమయంలో సీఎం నితీష్ పై అటు అసెంబ్లీలోనూ, ఇటు బయటా విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. మతిస్థితిమితం తప్పిందా అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.
అవును... జాతీయ గీతం ఆలపించే సమయంలో ఎంత క్రమశిక్షణగా ఉండాలనే విషయం స్కూలు పిల్లలకు కూడా తెలుస్తుంది! అయితే.. రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యి ఉండి కూడా జాతీయ గీతం ఆలపిస్తున్న సమయంలో వెకిలిగా ప్రవర్తించారు నితీష్ కుమార్ అనే విమర్శలు ఇప్పుడు ఆయనను విపరీతంగా చుట్టుముడుతున్నాయి. దీనిపై విపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి.
తాజాగా ముఖ్యమంత్రి నితీష్ కుమార్ బీహార్ తో తొలిసారిగా జరుగుతున్న సెపక్టక్రా ప్రపంచ కప్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఆ సమయంలో జాతీయ గీతం ఆలపిస్తుండగా.. ఆయన ఓ అధికారి భుజం మీద తట్టి, అతనితో సంభాషించే ప్రయత్నం చేశారు! ఇదే సమయంలో.. గీతం ఆలపిస్తుండగానే నవ్వుతూ, ప్రేక్షకులకు నమస్కారం చేస్తూ కనిపించారు. దీనిపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇందులో భాగంగా... నితీష్ కుమార్ జాతీయ గీతాన్ని అగౌరవపరిచిన తీరు తనను ఎంతో తీవ్రంగా సిగ్గుపడేలా చేసిందని.. నితీష్ కుమార్ చర్యలతో ప్రతీ బీహారీని సిగ్గుతో తల దించుకునేలా చేశారు.. దేశ చరిత్రలో ఓ సిట్టింగ్ సీఎం జాతీయ గీతాన్ని అగౌరవపరచడం ఇదే మొదటిసారి కావొచ్చు అని తేజస్వీ యాదవ్ మండిపడ్డారు.
ఇదే సమయంలో... నితీష్ కు మతిస్థిమితం తప్పి ఉంటే.. ఆయన సీఎం కుర్చీ నుంచి దిగిపోయి, ఆయన కుమారుడిని సీఎంగా చేయాలని.. ఆయన అసెంబ్లీకి వచ్చి బహిరంగ క్షమాపణ చెప్పాలని బీహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా 'తోలుబొమ్మ సీఎం రాజీనామా చేయాలి' అంటూ ఆర్జేడీ సభ్యులు అసెంబ్లీలో నిరసన తెలిపారు.
ఇదే క్రమంలో... జాతీయ గీతం ఆలపించే సమయంలో బీహార్ సీఎం నితీష్ కుమార్ మానసికంగా, శారీరకంగా బాగా కనిపించలేదని.. ఆయన మానసిక పరిస్థితి సరిగ్గానే ఉందని మీరు భావించారా అని తాను ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా లను అడగాలనుకుంటున్నట్లు రాష్ట్రీయ జనతాదళ్ ఎంపీ మీసా భారతి వ్యాఖ్యానించారు.