ఇండియాలో ఉండనంటున్న నితీష్....మోడీ వ్యూహమేనా..?
ఈ కూటమికి ఇండియా అన్న పేరు పెట్టడం పట్ల నితీష్ అసంతృప్తిగా ఉన్నారని అంటున్నారు.
By: Tupaki Desk | 31 July 2023 3:39 AM GMTఆయన వయసు ఏడున్నర పదులు. రాజకీయ అనుభవం అక్షరాలా అర్ధ శతాబ్దం పై మాటే. ఆయనే బీహార్ సీఎం నితీష్ కుమార్. ఆయన 1977లో జయప్రకాష్ నారాయణ్ ఉద్యమంతో ప్రభావంతో రాజకీయ అరంగేట్రం చేసి చట్ట సభల కు వచ్చారు. ఆ లెక్కన చూస్తే నితీష్ సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ కిందనే లెక్క. ఆయన బీహార్ సీఎం గా దాదాపుగా రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్నారు. అత్యధిక కాలం బీహార్ ని పాలించిన చరిత్ర ఉంది.
కేంద్ర మంత్రిగా అనేక పదవులు చేపట్టారు. బీహార్ లో జేడీయూ ని నడిపిస్తూ పొత్తుల తో ఎత్తుల తో సీఎం పదవి ని కాపాడుకుంటూ వస్తున్న నితీష్ ఆ మధ్య దాకా ఎన్డీయేలో ఉన్నారు. ఇపుడు ఆయన విపక్ష కూటమి లో కీలకంగా మారారు. విపక్షాల మధ్య సఖ్యత ను తీసుకుని రావడంతో విజయం సాధించిన నితీష్ కుమార్ తొలి మీటింగ్ ని పాట్నాలోనే నిర్వహించి శభాష్ అనిపించుకున్నారు.
ఇక ఈ కూటమికి ఇండియా అన్న పేరు పెట్టడం పట్ల నితీష్ అసంతృప్తిగా ఉన్నారని అంటున్నారు. అదే టైం లో నితీష్ కి విపక్ష కూటం లో నేతల పోకడల పట్ల కూడా తీవ్ర అసంతృప్తి ఉందని అంటున్నారు. కాంగ్రెస్ ఒక వైపున ప్రాంతీయ పార్టీల బడా రాజకీయం మరో వైపున ఉన్నాయి. ఇంకో వైపు చూస్తే ఎవరికి వారే పెద్దలు. ఒకరితో ఒకరికి పొసగని తత్వం, ఆభిజాత్యం ఇలా చాలానే విపక్ష కూటమి లో ఉన్నాయని ప్రచారం సాగుతోంది.
ఇక బీహార్ లో లాలూ యాదవ్ ఫుల్ యాక్టివ్ అయ్యారు. ఆయన ఆరోగ్యం మెరుగు పడడంతో ఆయన బీహార్ పొలిటికల్ సీఎన్ మీద తానే ముందుకు వస్తున్నారు. ఇది నితీష్ ఊహించని పరిణామం గా చెబుతున్నారు. ఇంకో వైపు చూస్తే ప్రధాని పదవి ని నితీష్ కుమార్ ఆశిస్తున్నారు. ఆయన ఎన్డీయే నుంచి వేరు పడి విపక్షం వైపునకు వచ్చేసరికి అంతా కకావికలుగా ఉంది.
ఎక్కే గుమ్మం దిగే గుమ్మంగా తిరిగి అందరినీ కలుపుకుని పోయిన నితీష్ ఇపుడు విపక్ష కూటమికి ఒక షేపూనూ రూపునూ తెచ్చారు. అయితే ఆయనకు ఫలితం దక్కుతుందా అంటే డౌట్ అని అంటున్నారు. ఆయనకు బీహార్ లోనే సొంత వారే ప్రత్యర్ధులుగా మారే సీన్ ఉందని అంటున్నారు. ఈ దఫాతో ఆయనకు బీహార్ లో సీఎం కుర్చీ కూడా లేకుండా పోతుంది అని అంటున్నారు. బీహార్ లో పెద్ద పార్టీగా ఉన్న ఆర్జేడీ ఈసారి సీఎం సీటు మీద గురి పెట్టింది అని అంటున్నారు. అలా లాలూ తనయుడు తేజస్వి యాదవ్ సీఎం అవుతారు. మరి నితీష్ కి అటు ప్రధాని లేక ఇటు ఉన్న సీటు డౌట్ లో పడితే ఏమి చేస్తారు అన్నదే చర్చగా ఉంది.
అందుకే ఆయన మరోసారి ఎన్డీయే కూటమి వైపు జంప్ చేస్తారు అని ప్రచారం ఊపందుకుంది. కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలే తన బీహార్ పర్యటనలో సంచలన కామెంట్స్ నితీష్ కుమార్ గురించి చేశారు. నితీష్ తన వాడే అని చెప్పుకొచారు ఆయన ఏక్షణం అయినా ఎన్డీయే కూటమి లో చేరుతారు అని నిబ్బరంగా చెప్పారు. అదే ఇపుడు జాతీయ స్థాయి లో హాట్ హాట్ న్యూస్ గా ఉంటే ఆయన కామెంట్స్ ని అదే బీహార్ కి చెందిన బీజేపీ నేత, జార్ఖాండ్ మాజీ ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ మాట్లాడుతూ నితిష్ కుమార్ మొదట్నించీ ఎన్డీయే భాగస్వామిగా ఉన్నారు అని చెప్పుకొచ్చారు.
ఇక నితీష్ కుమార్ తన అసంతృప్తి విషయం కూడా కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలేతో మాట్లాడి ఉండవచ్చు. ఏదో విషయం చెప్పి ఉండవచ్చు అని రఘుబర్ దాస్ అంటున్నారు. నితీష్ ఏ రోజు అయినా ఎన్డీయేతో జట్టు కడతారు అని అంటున్నారు. అలా జరగవచ్చు కూడా. అదేమీ వింత కాదు, నితీష్ శైలి, బీహార్ రాజకీయం చూస్తే అది జరిగిన ఆశ్చర్యంలేదు అని అంటున్నారు. చూడాలి మరి నితీష్ కనుక ఎన్డీయే లోకి వెళ్తే మాత్రం ఇండియా కూటమికి అతి పెద్ద దెబ్బ పడినట్లే అంటున్నారు. మోడీ అలా తనదైన వ్యూహాన్ని రచిస్తున్నారా అన్నదే చూడాల్సి ఉంది.