Begin typing your search above and press return to search.

నితీష్ దూరంగా... బాబు దగ్గరగా !

వేల కోట్లు బడ్జెట్ లో పెట్టినా నితీష్ అలక మాత్రం వీడడం లేదు. ఆయన ప్రత్యేక హోదా డిమాండ్ ని ఎత్తుకున్నారు.

By:  Tupaki Desk   |   30 July 2024 3:51 AM GMT
నితీష్ దూరంగా... బాబు దగ్గరగా !
X

వేల కోట్లు బడ్జెట్ లో పెట్టినా నితీష్ అలక మాత్రం వీడడం లేదు. ఆయన ప్రత్యేక హోదా డిమాండ్ ని ఎత్తుకున్నారు. బీహార్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆ డిమాండ్ తోనే తిరిగి అధికారం పొందగలమని ఆయన ఆలోచిస్తున్నారు. అయితే ప్రత్యేక హోదా అన్నది బీహార్ కి ఇవ్వడం సాధ్యపడదని కేంద్ర మంత్రి ఒకరు తేల్చి చెప్పేశారు. ప్రత్యేక హోదా దక్కాలంటే దానికి తగిన ప్రమాణాలు సరిపోవాలని కూడా స్పష్తం చేసారు.

ఆ తరువాత కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో బీహార్ కి పెద్ద పీట వేశారు. ఏకంగా 26 వేల కోట్ల నిధులను కేటాయిస్తూ సంచలన నిర్ణయమే కేంద్రం తీసుకుంది. ఈ నేపధ్యంలో బీహార్ ఏపీలకే కేంద్ర బడ్జెట్ అని నిందలు కూడా ఎన్డీయే సర్కార్ మోసింది.

ఇంత చేసినా నితీష్ కుమార్ మాత్రం ఎన్డీయేను టెన్షన్ పెడుతూనే ఉన్నారు. నీతి ఆయోగ్ సమావేశానికి ఇండియా కూటమికి చెందిన ముఖ్యమంత్రులు హాజరు కాలేదు. కేంద్రం బడ్జెట్ లో వివక్ష చూపించింది అని వారు నిరసనగా ఈ మీటింగ్ కి రాలేదు. కానీ బీహార్ కి ఎక్కువ నిధులు కేంద్రం ఇచ్చిందని విపక్షాలు ఆరోపిస్తున్న వేళ నితీష్ కుమార్ రాకపోవడం మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

నిజానికి ఎన్డీయేకి చెరో కొమ్ము కాస్తున్న చంద్రబాబు నితీష్ కుమార్ ఈ భేటీకి వచ్చి ఉంటే కళ కట్టెది. విపక్షాలు పెడుతున్న డౌట్లు చెబుతున్న జోస్యాలు వమ్ము అని తేలిపోయేది. కానీ నితీష్ ఈ భేటీకి గైర్ హాజర్ కావడం ద్వారా ఎన్డీయే సర్కార్ పెద్దలకు బెంగ మిగిల్చారు. అంతే కాదు ప్రతిపక్షాలు అంటున్నట్లుగా కేంద్ర ప్రభుత్వం మనుగడ మీద సందేహాలు కంటిన్యూ అయ్యే విధంగా ఆయన చేయగలిగారు.

ఇంతకీ నితీష్ ఎందుకు గైర్ హాజరు అయ్యారు అన్నదే జాతీయ స్థాయిలో చర్చగా ఉంది. అదే టైం లో బీహార్ కంటే తక్కువ నిధులు దక్కినా ఏపీ సీఎం చంద్రబాబు మాత్రం మోడీ పక్కన కూర్చుని మరీ నీతి ఆయోగ్ మీటింగు కి కొత్త వెలుగులు ఇచ్చారు. బలమైన మిత్రపక్షంగా ఎన్డీయేకు అండంగా ఉంటామన్న సందేశాన్ని బాబు అలా పంపించగలిగారు అని అంటున్నారు.

అదే విధంగా బీజేపీ అగ్ర నాయకత్వానికి ఆయన ఎంతో రిలీఫ్ ని ఇచ్చారని కూడా అంటున్నారు. నితీష్ కుమార్ ఎన్డీయేకు దూరం అవుతారని ప్రచారంలో ఉన్నా బీజేపీకి ఇబ్బందే కానీ దాని కంటే ఎక్కువ ఇబ్బంది బాబు దూరం అయితేనే అని అంటున్నారు. చంద్రబాబు జాతీయ స్థాయిలో తనకు ఉన్న పరిచయాలను కనుక వాడితే మాత్రం ఈ క్లిష్ట సమయంలో కేంద్రంలో ఎన్నో సంచలనాలే నమోదు అవుతాయని అంటున్నారు.

కానీ చంద్రబాబు చూపు అంతా ఏపీ మీదనే ఉంది. ఆయన అయిదేళ్ల పాటు ఏపీలో సజావుగా పాలన చేయాలని చూస్తున్నారు. దానికి తగినట్లుగా కేంద్ర సాయాన్ని ఆయన కోరుకుంటున్నారు. తాజాగా నీతి ఆయోగ్ మీటింగ్ ని చూసిన తరువాత బీజేపీ పెద్దలకు కూడా అసలైన మిత్రుడిగా చంద్రబాబు కనిపించి ఉంటారని అంటున్నారు. అది రానున్న కాలంలో బాబుకు ఎన్డీయేలో విలువ పెంచుతుందని, తద్వారా ఏపీకి కూడా మేలు జరుగుతుందని అంటున్నారు. మొత్తానికి నితీష్ టెన్షన్ మాత్రం బీజేపీకి తప్పేట్లు లేదు అని అంటున్నారు.