ఒక సీఎం.. 4 ఏళ్లలో 3 సార్లు ప్రమాణం.. ఇదేమి ''నీతీ''శ్?
మళ్లీ ఇప్పుడు అదే బాటలో వెళ్తున్నారు. నాలుగేళ్లలో మూడోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అది కూడా వేర్వేరు కూటముల తరఫున
By: Tupaki Desk | 26 Jan 2024 2:30 PM GMTదేశంలోనే సీనియర్ నేత ఆయన.. సుదీర్ఘ కాలం సీఎంగా పనిచేసినవారిలో ఒకరు కూడా.. అయితే గియితే వచ్చే లోక్ సభ ఎన్నికల తర్వాత ప్రధాని అభ్యర్థిగానూ రేసులో ఉండేవారు.. 20కి పైగా ప్రతిపక్షాలతో కూడిన కూటమికి నాయకుడూ అయ్యేవారు. కానీ, ఆయన రాజకీయం వేరు. ఫలానా పార్టీతోనే జట్టు కట్టాలని ఏమీ లేదు.. ఇప్పటికే పలుసార్లు ప్లేటు ఫిరాయించిన ఘనత ఆయన సొంతం. మళ్లీ ఇప్పుడు అదే బాటలో వెళ్తున్నారు. నాలుగేళ్లలో మూడోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అది కూడా వేర్వేరు కూటముల తరఫున.
బిహార్ ఆయన సొంత రాజ్యమా?
బిహార్ సీఎం నీతీశ్ కుమార్ మరోసారి యూ టర్న్ తీసుకుంటున్నారు. బీజేపీకి ఝలక్ ఇచ్చి ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో కలిసి రెండున్నరేళ్ల కిందట ప్రభుత్వాన్ని నెలకొల్పిన ఆయన ఇప్పుడు మళ్లీ పాత పొత్తుతో ముందుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. బీజేపీతో చేతులు కలిపి బిహార్ లో కొత్తగా ప్రభుత్వం ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవన్నీ ఓ కొలిక్కి వచ్చినట్లు సమాచారం. కాగా, బిహార్ కు 2005 నుంచి మధ్యలో కొంత కాలం తప్ప దాదాపు 18 ఏళ్లుగా నీతీశ్ కుమార్ సీఎంగా ఉన్నారు. లాలూ, రబ్రీదేవి పాలనతో విసిగిపోయిన అక్కడి ప్రజలు నీతీశ్ లో దార్శనికుడిని చూశారు. అయితే, కొంతకాలంగా ఆయన అనుసరిస్తున్న విధానాలు మాత్రం అత్యంత చర్చనీయాంశం అవుతున్నాయి.
ఇండియా కూటమికి జెల్లకొట్టి
కేంద్రంలోని బీజేపీ సర్కారును దించేందుకు ప్రతిపక్షాలు ఇండియా కూటమిగా ఏర్పడడంలో నీతీశ్ దే ప్రధాన పాత్ర. అయితే, ఇప్పుడు ఆయనే అదే కూటమికి జెల్లకొట్టి బీజేపీకి జై కొడుతుండడం గమనార్హం. దీనికి ప్రధాన కారణం ఏమిటనేది ఆయన నోరు విప్పితే కానీ తెలియదు. కాగా, 2000 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో
ఆర్జేడీ 79, కాంగ్రెస్ 19, వామపక్షాలు 16 సీట్లు గెలిచాయి. బీజేపీ 74, జేడీయూ 43 చోట్ల విజయం సాధించాయి. మొత్తం 243 మంది సభ్యుల అసెంబ్లీలో మెజారిటీ మార్కు 122. ప్రస్తుతం మహా ఘట్ బంధన్ (ఆర్జేడీ, జేడీయూ, వామపక్షాలు) సర్కారు బలం 159. జేడీయూ తప్పుకొంటే ఆర్జేడీ (75), కాంగ్రెస్ (19), వామపక్షాల (16)తో ఈ బలం 114కు పడిపోతుంది. మెజారిటీకి మరో 8 మంది ఎమ్మెల్యేలు అవసరమవుతారు. మాజీ సీఎం మాంఝీ సారథ్యంలోని హెచ్‌ఏఎం (4), మజ్లిస్ (1), స్వతంత్ర ఎమ్మెల్యే (1) మద్దతు కూడగట్టినా 120కే చేరుతుంది. ఈ నేపథ్యంలో మాంఝీ తదితరులతో పాటు జేడీ(యూ) అసంతృప్త ఎమ్మెల్యేలతో ఆర్జేడీ చీఫ్ లాలు మంతనాలు జరుపుతున్నారు. అదే బీజేపీ, జేడీ(యూ) కలిస్తే 123 మంది ఎమ్మెల్యేలతో మెజారిటీ మార్కును అలవోకగా దాటేస్తాయి. తద్వారా తానే సీఎంగా కొనసాగాలని నితీశ్ భావిస్తున్నట్టు సమాచారం.
బీజేపీ సైతం తలొంచింది..
అసెంబ్లీలో 74 స్థానాలు నెగ్గిన బీజేపీ.. నీతీశ్ కోసం మరోసారి తలొంచుతోంది. 2000లోనూ ఇలానే 43 సీట్లున్న నీతీశ్ కు సీఎం అయ్యే అవకాశం ఇచ్చింది. ఇప్పుడు తొలుత సుముఖంగా లేదని కథనాలు వచ్చినా.. చివరకు నీతీశ్ నాయకత్వానికి అంగీకారం తెలిపిందని సమాచారం. ఈ క్రమంలోనే ఆదివారం ఆయన మరోసారి సీఎంగా ప్రమాణం చేయనున్నట్లు కథనాలు వస్తున్నాయి. 2020లో తొలుత బీజేపీ, 2022 ఆగస్టులో ఆర్జేడీ, కాంగ్రెస్ మద్దతుతో సీఎం అయిన నీతీశ్ ఇప్పుడు మళ్లీ కమలం అండతో మూడోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్నారు.