నిజామాబాద్‌లో బీఆర్ఎస్‌ను ఊడ్చేయాలన్నదే ప్లాన్!
నిరుడు తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 64 స్థానాల్లో గెలిచింది. బీఆర్ఎస్ 39 స్థానాలకే పరిమితమైంది.
By: Tupaki Desk | 22 Jun 2024 12:30 PM GMTతెలంగాణలో రాజకీయ సమీకరణాలు రోజురోజుకూ మారుతున్నాయి. అధికారంలో ఉన్న కాంగ్రెస్ బలం పెరుగుతుండగా.. గత ఎన్నికల్లో ఓటమితో ఢీలా పడ్డ బీఆర్ఎస్‌కు షాక్‌ల మీద షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుని కేసీఆర్‌ను దెబ్బతీసేలా రేవంత్ సాగుతున్నారు. ఇప్పటికే నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హస్తం గూటికి చేరారు. మరో 20 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌తో టచ్‌లో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే ఖమ్మం ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ ఖాళీ అయింది. మిగతా జిల్లాలోనూ అదే విధంగా చేయాలని రేవంత్ లక్ష్యం పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. ఇప్పుడు నిజామాబాద్‌పై రేవంత్ ఫోకస్ పెట్టారనే టాక్ వినిపిస్తోంది.
నిరుడు తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 64 స్థానాల్లో గెలిచింది. బీఆర్ఎస్ 39 స్థానాలకే పరిమితమైంది. ఆ 39లో ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరిపోయారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని 9 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 4 చోట్ల కాంగ్రెస్ గెలిచింది. రెండు చోట్ల బీఆర్ఎస్ నెగ్గింది. మూడు స్థానాల్లో బీజేపీ జయకేతనం ఎగురవేసింది. నిజామాబాద్, కామారెడ్డిలో కలిపి బీఆర్ఎస్ గెలిచిన రెండు స్థానాల్లో బాన్సువాడ ఒకటి. ఇప్పటికే బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇక మిగిలింది బాల్కొండ. ఇక్కడ వేముల ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు.
ఇప్పుడు వేముల ప్రశాంత్ రెడ్డిని కూడా కాంగ్రెస్‌లో చేర్చుకునే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయని తెలిసింది. త్వరలోనే ఆయన కూడా కారు దిగే అవకాశం ఉందనే చర్చ జోరుగా సాగుతోంది. అదే జరిగితే అప్పుడు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ నుంచి ఒక్క ఎమ్మెల్యే కూడా ఉండరు. ఖమ్మం లాగే ఇక్కడా బీఆర్ఎస్ జీరోకు చేరుతుంది. అదే క్రమంలో మిగతా జిల్లాల్లోనూ బీఆర్ఎస్‌ను జీరోను చేయడమే రేవంత్ లక్ష్యంగా కనిపిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.