పాపాల పెద్దిరెడ్డి అని పైకి అంటున్నారే తప్ప...!
పార్టీ పరంగా, రాజకీయాల పరంగా కూడా.. పెద్దిరెడ్డి ఒకరకంగా చంద్రబాబు, లోకేష్‌లకు జగన్‌ను మించిన టార్గెట్!.
By: Tupaki Desk | 17 March 2025 9:00 PM ISTవైసీపీ అధినేత జగన్‌కు అత్యంత నమ్మకస్తుడైన నాయకుడిగా పేరొందిన సీనియర్ నేత, పుంగనూరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని గతంలో చంద్రబాబు, నారా లోకేష్‌లు పాపాల పెద్దిరెడ్డి అని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అంతేకాదు.. తాము అధికారంలోకి వస్తే.. పెద్దిరెడ్డి పాపాలను కడుగుతామని కూడా శపథం చేశారు. పార్టీ పరంగా, రాజకీయాల పరంగా కూడా.. పెద్దిరెడ్డి ఒకరకంగా చంద్రబాబు, లోకేష్‌లకు జగన్‌ను మించిన టార్గెట్!.
కుప్పంలో చంద్రబాబును ఓడించాలన్న కృత నిశ్చయంతో పెద్దిరెడ్డి పనిచేశారు. నిరంతరం.. అక్కడే తిష్ఠవేసి మరీ బాబు ఓటమికి ఆయన కృషి చేశారు. మరోవైపు.. ఎన్నికలకు ముందు చంద్రబాబు చేపట్టిన యాత్రను పుంగనూరులోకి రాకుండా కూడా అడ్డుకున్నారు. అప్పట్లో ఏకంగా చంద్రబాబుపైకి రాళ్ల దాడి కూడా జరిగింది. ఇక, పుంగనూరులోనే కాదు.. కుప్పంలోనూ.. పెద్ద సంఖ్యలో టీడీపీ నాయకులను కార్యకర్తలను వేధించారని చంద్రబాబు, లోకేష్‌లే చెప్పుకొచ్చారు.
ఇవి రాజకీయంగా టీడీపీని ఇరుకున పెట్టాయి. అందుకే.. పెద్దిరెడ్డిని పాపాల పెద్దిరెడ్డి అని వ్యాఖ్యానించడ మే కాకుండా.. `రెడ్ బుక్` పేరుతోనూ ప్రకటనలు చేశారు. అయితే.. అధికారంలోకి వచ్చి 9 మాసాలు పూర్త యినా.. ఇప్పటి వరకు పెద్దిరెడ్డిపై ఒక్క కేసును కూడా పెట్టలేకపోయారన్నది తమ్ముళ్ల ఆవేదన. నిజానికి మూడు కీలకమైన కేసుల్లో పెద్దిరెడ్డి పేరును చేర్చాలని అనుకున్నారు.
1) మదనపల్లె ఫైళ్ల దహనం.
2) అన్నమయ్య జిల్లాలో అటవీ భూములను ఆక్రమించిన వ్యవహారం.
3) మఠం భూములను ఆక్రమించడం.
ఈ మూడు కేసులు కూడా కీలకమైనవి.
కానీ, ఇప్పటి వరకు పెద్దిరెడ్డిని ఆ జాబితాలో చేర్చలేక పోయారు. దీనికి కారణం ఏంటి? చంద్రబాబు, లోకేష్ లు లైట్ తీసుకున్నారా? అంటే.. అదేం కాదు. దీనికి రెండు కారణాలు కనిపిస్తున్నాయని తెలుస్తోంది.
1) బీజేపీ పెద్దల నుంచి వస్తున్న ప్రజర్.
2) లోకల్‌గా ఉన్న కొందరు టీడీపీ నాయకులే.. పెద్దిరెడ్డి విషయంలో చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారన్న చర్చ సాగుతోంది. బీజేపీ పెద్దలతో పెద్దిరెడ్డి కుమారుడు ఎంపీ మిథున్‌రెడ్డికి సత్సంబంధాలు ఉన్నాయి.
తద్వారా ఢిల్లీ వైపు నుంచి విషయాన్ని నరుక్కొస్తున్నారని తెలుస్తోంది. దీంతో పెద్దిరెడ్డిపై చర్యలు తీసుకు నేందుకు రాష్ట్ర సర్కారు వెనుకంజ వేస్తోంది. పెద్దిరెడ్డి గనుల వ్యాపారంలో బీజేపీకి చెందిన యూపీ నాయ కులు, గుజరాత్ నాయకుల హస్తం కూడా ఉంది. ఇది ఇప్పుడు పెద్దిరెడ్డికి వరంగా మారింది. ఇక, లోకల్‌గా ఉన్న నాయకులు.. రాజకీయాల వరకు మాత్రమే పెద్దిరెడ్డిని టార్గట్ చేసుకుంటే సరిపోతుందని.. కేసులు, జైళ్లు అంటే.. ఆయనపై మరింత సానుభూతి పెరుగుతుందన్న ఉద్దేశం వారు చెబుతున్నారు. సో.. మొత్తానికి పాపాల పెద్దిరెడ్డి అని పైకి అంటున్నారే తప్ప... చర్యలు తీసుకునేందుకు సర్కారు పెద్దగా ప్రయత్నించడం లేదన్నది వాస్తవం అంటున్నారు పరిశీలకులు.