జగన్ ఒక ప్లస్.. రెండు మైనస్‌లు .. !
వైసీపీ తాజాగా ధర్నాలకు, నిరసనలకు పిలుపునిస్తే.. పెద్దగా స్పందనలేదు. కానీ, టీడీపీ గతంలో ఇచ్చిన నిరసనలు, ధర్నాలకు వచ్చిన స్పందన వేరుగా ఉంది.
By: Tupaki Desk | 28 Dec 2024 9:30 AM GMTఒక వ్యూహం బెడిసి కొడితే.. మరో వ్యూహం వైపు మళ్లుతారు. కానీ.. వరుసగా అన్ని వ్యూహాలు బెడిసి కొడితే పరిస్థితి ఏంటి? ఇదీ.. ఇప్పుడు వైసీపీ అధినేత జగన్ విషయంలో జరుగుతున్న చర్చ. ఆయన వేసిన ఒక్క పాచికా సక్సెస్ కాలేదు. నిన్న మొన్నటి వరకు ఆయన ఐప్యాక్‌ను నమ్ముకున్నారు. అయితే.. మధ్యలో తానే తీసుకున్న సొంత నిర్ణయాలు.. ఐప్యాక్ చెప్పిన ఫార్ములాలు ఇలా.. అనేకం బెడిసి కొట్టాయి. దీంతో పార్టీ కేవలం 11 స్థానాలకు పరిమితం అయింది.
ఇక, ఇప్పుడు వెనుదిరిగి చూసుకున్నా.. ఆరు మాసాల్లో వైసీపీ పరిస్థితి ఎలా ఉందంటే ఘోరంగా తయా రైంది. ఈ సమయంలో ఒక్కసారి 2019 విషయానికి వెళ్తే.. అప్పట్లో టీడీపీ కూడా 23 స్థానాలకే పరిమితమై.. కొంత ఇబ్బందికర పరిస్థితులే ఎదుర్కొంది. అయితే.. ఆరు మాసాలు గడిచే సరికి.. అప్పటి వరకు ఉన్న నిశ్శబ్దం కొంత తగ్గి.. పార్టీలో చైతన్యం రాజుకునే దిశగా అడుగులు వేయడం ప్రారంభించింది. అయితే.. అప్పటికే ఒకరిద్దరు నాయకులు పార్టీలు మారారు.
కానీ, పూర్తిగా కొంప కొల్లేరయ్యే పరిస్థితి అయితే కనిపించలేదు. వైసీపీ తాజాగా ధర్నాలకు, నిరసనలకు పిలుపునిస్తే.. పెద్దగా స్పందనలేదు. కానీ, టీడీపీ గతంలో ఇచ్చిన నిరసనలు, ధర్నాలకు వచ్చిన స్పందన వేరుగా ఉంది. నిజానికి చెప్పాలంటే.. కొంత తమ్ముళ్లు బద్దకించారు. కానీ, చంద్రబాబు అంకుశంతో ముందుకు వచ్చి.. తానే స్వయంగా రంగంలోకి దిగారు. ఫలితంగా.. టీడీపీ అనతి కాలంలోనే పుంజుకుంది. కానీ, ఈ తరహా పరిస్థితి వైసీపీలో లేకపోవడం గమనార్హం.
అందరూ.. ఐఏఎస్‌లు, ఐపీఎస్‌ల మాదిరిగా కాలర్ నలగకూడదన్న ధోరణిలోనే ఉన్నారు. నిజానికి వైసీపీకి ఇప్పటి వరకు రోడ్డెక్కిన సంస్కృతి లేదు. ఎప్పుడు ఏం జరిగినా.. నేరుగా జగన్ రంగంలోకి దిగి జలదీక్షలని, ఇతర దీక్షలని చేపట్టేవారు. దీంతో పార్టీ నేతలు ఎప్పుడూ.. రోడ్డెక్కి జెండాలు పట్టింది లేదు. ఇక, ఇప్పుడు కూడా.. అదే పరిస్థితి ని కొనసాగిస్తున్నారు. ఎవరూ కూడా.. రోడ్డెక్కేందుకు ముందుకు రావడం లేదు. పట్టుమని 10 నిమిషాలు ధర్నాకు కూర్చునే పరిస్థితి కూడా లేదు. సో.. ఈ పరిణామాల నుంచి పార్టీని బయటకు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.