'నో క్లీన్ షేవ్.. నో లవ్' : ప్రేమలో కొత్త ట్రెండ్
ఈ కోవలోనే తాజాగా మధ్య ప్రదేశ్ రాజధాని ఇండోర్‌లోని ఓ ప్రముఖ యూనివర్సిటీలో యువతులు వినూత్న నిరసన చేపట్టారు.
By: Tupaki Desk | 19 Oct 2024 7:30 PM GMTరెండక్షరాల ప్రేమ.. రెండు క్షణాల ప్రేమ! అని ఒకప్పుడు అనుకునేవారు. కానీ, ఇప్పుడు కాలం మారింది. ప్రేమించుకుంటున్న జంటలు జీవితాంతం సుఖంగా జీవిస్తున్నవారు కూడా ఉన్నారు. ప్రేమ కాలక్షేపం కాదు.. జీవితం అని భావిస్తున్నవారు కూడా ఉన్నారు. నిజానికి ఒకప్పుడు 'ప్రేమ' అంటే చెప్పుకొనేందుకు .. ప్రేమించుకునేందుకు కూడా సమాజం ఏమంటుందో.. ఇంట్లో పెద్దలు ఏమంటారో.. అనే జంకు ఉండేది. కానీ, కాలం మారింది. ఇప్పుడు ప్రేమలకు భయం లేదు. జంకు అంతకన్నా లేదు.
ప్రేమికులు.. నేరుగా ఇంట్లో వారిని ఒప్పించి వివాహాలు చేసుకుంటున్నారు. మరికొందరు బయటకు వచ్చేసి స్వతంత్రంగా కూడా బతుకుతున్నారు. ఇదిలావుంటే.. ప్రేమికుల అభిరుచులు.. వారి అలవాట్లు అనేవి.. ముందు ప్రేమలో పడిన తర్వాత.. తెలుసుకుని.. వాటిని తమ ప్రేమికులకు అనుకూలంగా మార్చుకుంటారు. ఇది సహజం కూడా. నాన్ వెజ్ తినే ప్రేమికుడికోసం.. వెజ్ తినే ప్రేమికురాలు తర్వాత కాలంలో నాన్‌వెజ్‌గా మారిన ఘటనలు ఉన్నాయి. అదేవిధంగా మతాలు కూడా!
కానీ, ఇప్పుడు కొత్తట్రెండ్ తెరమీదికి వచ్చింది. వారిని ప్రేమించేవారు.. లేదావారు ప్రేమించే వారు ఎలా ఉండాలో.. యువతీ యువకులు ముందుగానే నిర్ణయించుకుంటున్నారు. ఈ కోవలోనే తాజాగా మధ్య ప్రదేశ్ రాజధాని ఇండోర్‌లోని ఓ ప్రముఖ యూనివర్సిటీలో యువతులు వినూత్న నిరసన చేపట్టారు. తమను ప్రేమించే అబ్బాయిలకు 'గుబురు గడ్డం' ఉండరాదని వారు కోరుతున్నారు. క్లీన్ షేవ్‌తో ఉన్నవారే ప్రేమించాలని వారు నిరసన చేపట్టారు.
'నో క్లీన్ షేవ్.. నో లవ్' అంటూ నినదిస్తూ.. పెద్ద ఎత్తున యూనివర్సిటీలో ర్యాలీ చేశారు. అంతేకాదు.. 'నో క్లీన్ షేవ్.. నో గర్ల్‌ఫ్రెండ్' అని కూడా రాసుకున్న ప్లకార్డులను ప్రదర్శించారు. కొందరు యువతకు పెద్ద పెద్ద గడ్డాలు పెట్టుకుని వినూత్న నిరసన వ్యక్తం చేశారు. వీరి నిరసన చూసి.. వర్సిటీలోని తోటి విద్యార్థు లు అవాక్కయ్యారు. ప్రేమికుల అభిరుచులు వారిద్దరికే పరిమితం కావాల్సి ఉండగా.. ఇలా బహిరంగంగా డిమాండ్ చేయడమేంటని ఎక్కువ మంది విస్మయం వ్యక్తం చేయడం గమనార్హం.