Begin typing your search above and press return to search.

విజయవాడ సెంట్రల్ లో మద్యం షాపు పెట్టే దమ్ములేదట!?

విజయవాడ నగరానికి ఎక్సైజ్ శాఖ మొత్తం 39 షాపుల్ని కేటాయించింది.

By:  Tupaki Desk   |   17 Oct 2024 5:08 AM GMT
విజయవాడ సెంట్రల్ లో మద్యం షాపు పెట్టే దమ్ములేదట!?
X

ఎప్పుడెప్పుడో మద్యం షాపుల వేలం పూర్తి అవుతుంది.. ఆ వెంటనే షాపుల్ని ఓపెన్ చేసేందుకు వ్యాపారులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో మాత్రం లిక్కర్ షాపు ఓపెన్ చేసేందుకు ససేమిరా అంటున్న వైనం ఆసక్తికరంగా మారింది. మద్యం లాటరీలో షాపుల్ని సొంతం చేసుకున్న వారు సైతం.. సెంట్రల్ లో షాపుల్ని ఓపెన్ చేసే విషయంలో వెనక్కి తగ్గుతున్నారు. సెంట్రల్ కు బదులుగా తూర్పు.. పశ్చిమ నియోజకవర్గాల్లో ఓపెన్ చేసుకుంటామని.. తమకు అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుకుతున్న వైనం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

విజయవాడ నగరానికి ఎక్సైజ్ శాఖ మొత్తం 39 షాపుల్ని కేటాయించింది. లాటరీలో భాగంగా వ్యాపారులు విజయవాడలోని మూడు నియోజకవర్గాల్లో మొత్తం 13 చొప్పున లిక్కర్ షాపుల్ని ఓపెన్ చేయాలని డిసైడ్ అయ్యారు. అయితే.. ఈ 39 మంది ఇప్పుడు ఒక్క కట్టుగా మారి.. కొత్త నిర్ణయానికి వచ్చారు. అదేమంటే.. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం మినహాయించి తూర్పు.. పశ్చిమ నియోజకవర్గాల్లో షాపుల్ని ఏర్పాటు చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. ఇదే విషయాన్ని వారు ఎక్సైజ్ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఎందుకిలా అంటే.. రాజకీయ నేతల కమిషన్లే దీనికి కారణంగా చెబుతున్నారు.

విజయవాడ సెంట్రల్ లో షాపుల్ని దక్కించుకున్న వ్యాపారులకు కొందరు నేతలు ఫోన్లు చేసి బెదిరింపులకు పాల్పడుతున్నట్లుగా పెద్ద ఎత్తున ఆరోపణలు సంచలనంగా మారాయి. షాపుల్ని దక్కించుకున్న వారికి ఫోన్లు చేస్తున్న నేతలు.. తమకు ఇవ్వాల్సిన నెలవారీ కమిషన్ల లెక్కతో బెదరగొడుతున్నట్లు చెబుతున్నారు. దీంతో.. రూటు మార్చిన అధికారులు విజయవాడ సెంట్రల్ లో మద్యం షాపుల్ని ఏర్పాటు చేయకుండా.. ఈస్ట్.. వెస్ట్ ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు.

రాజకీయ నేతల కమిషన్ల కారణంగా తాము షాపుల్ని ఓపెన్ చేయమని చెబితే.. కొత్త చిక్కులు తెర మీదకు వచ్చే వీలుందన్న భయంతో ఉన్న కొందరు.. పాత సెంటిమెంట్ ను కొత్తగా తెర మీదకు తీసుకొస్తుననారు. సాధారణంగా ఏదైనా ఇల్లు కొనాలన్నా.. అద్దెకు తీసుకోవాలన్నా.. ఈస్ట్.. వెస్టు గుమ్మాల్ని చూసుకోవటం తెలిసిందే. మద్యం వ్యాపారులు ఇదే సెంటిమంట్ ను వినిపిస్తూ తమకు సెంట్రల్ లో లిక్కర షాపు ఓపెన్ చేసేందుకు సెంటిమెంట్ అడ్డు వస్తుందని.. అందుకే.. తాము ఈస్ట్.. వెస్ట లో ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు.

నిజానికి విజయవాడ నగరానికి కేటాయించిన 39 షాపుల్లో సగానికి పైనే సిండికేట్లు తన్నుకుపోయారు. నాలుగైదు సిండికేట్లు 20కు పైగా షాపుల్ని దక్కించుకున్నారు. ఇక.. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల కారణంగా తూర్పు.. పశ్చిమ నియోజకవరగాల్లో ఇప్పుడు పోటీ ఎక్కువైంది. దీంతో.. ఇక్కడ షాపుల్ని దక్కించుకున్న వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తాజా పరిణామాలు విజయవాడ లిక్కర్ షాపుల యజమానుల్లో హాట్ టాపిక్ గా మారింది. దీనికో పరిష్కారాన్ని కనుగునేందుకు అధికారులు కిందా మీదా పడుతున్నారు.