Begin typing your search above and press return to search.

ప్రధాన ప్రతిపక్షం లేని రాష్ట్రాలివే... ఆశ్చర్యకర విషయం ఏమిటంటే..?

తాజాగా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత పలు కీలక విషయాలకు సంబంధించిన చర్చ తెరపైకి వచ్చింది.

By:  Tupaki Desk   |   25 Nov 2024 8:30 AM GMT
ప్రధాన ప్రతిపక్షం లేని రాష్ట్రాలివే...  ఆశ్చర్యకర విషయం ఏమిటంటే..?
X

తాజాగా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత పలు కీలక విషయాలకు సంబంధించిన చర్చ తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా ఇటీవల ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అన్నట్లుగా ఫలితాలు వెలువడుతుండటం ఆసక్తిగా మారింది. దీంతో... కొన్ని రాష్ట్రాల్లో ప్రధాన ప్రతిపక్షం లేని పరిస్థితులు నెలకొన్నాయి.

అవును.. ఇటీవల ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అన్నట్లుగా ఫలితాలు వస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. దేశంలో ఇటీవల జరిగిన పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి పార్టీలు... ఆయా రాష్ట్రాల్లో ప్రత్యర్థులకు ప్రతిపక్ష హోదా కూడా మిగలనివ్వకుండా సీట్లు సంపాదించుకున్నాయి.

ఈ వ్యవహారంపై వినిపిస్తున్న ఆరోపణల సంగతి కాసేపు పక్కపెడితే... తాజాగా మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలోనూ అదే సీను ఆవిష్కృతమైంది. ఇందులో భాగంగా... అధికార మహాయుతి కూటమి మరోసారి అధికారాన్ని దక్కించుకోగా.. ప్రతిపక్ష కూటమి మహా వికాస్ అఘాడి ఘోరంగా ఓటమి పాలైంది. అయితే.. ఈ సారి కూటమిలో ఏ పార్టీకి పదిశాతం సీట్లు రాలేదు.

మహా వికాస్ అఘాడీ కూటమిలోని కాంగ్రెస్ కు 16 సీట్లు, శివసేన (యూబీటీ) 20 సీట్లు, ఎన్సీపీ (ఎస్పీ)కి 10 సీట్లు దక్కాయి. అంటే... మహారాష్ట్ర అసెంబ్లీలోని మొత్తం 288 స్థానాల్లోనూ పదిశాతం (29) సీట్లు విపక్ష కూటమిలోని ఏ పార్టీకీ దక్కలేదు. దీంతో... మహారాష్ట్రలో ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష హోదా పొందే పార్టీ లేని పరిస్థితి నెలకొంది.

కాగా ఇదే ఏడాదిలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లోనూ ఇదేవిధంగా ఫలితాలు వెలువడిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... 175 స్థానాల్లోనూ కూటమి (టీడీపీ - బీజేపీ - జనసేన) లు 164 స్థానాల్లో విజయం సాధించగా.. సింగిల్ గా పోటీ చేసిన వైసీపీ 11 సీట్లకు పరిమితమైంది. దీంతో ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కలేదు.

అయితే.. మహారాష్ట్రకూ ఏపీకి ఉన్న చిన్న తేడా ఏమిటంటే... అక్కడ కూడా అధికార కూటమిలో మూడు పార్టీలు, మహా వికాస్ అఘాడిలోనూ మూడు పార్టీలూ ఉండగా... ఏపీలో మాత్రం ప్రతిపక్షంలో ఒకటే పార్టీ ఉంది. ఈ క్రమంలో... ప్రధాన ప్రతిపక్షం లేని అసెంబ్లీలు ఉన్న రాష్ట్రాలు ఇంకా దేశంలో ఎన్ని ఉన్నాయనే చర్చ తెరపైకి వచ్చింది.

ఇందులో భాగంగా... ఏపీ, మహారాష్ట్రతో పాటు అరుణాచల్ ప్రదేశ్, గుజరాత్, మణిపూర్, నాగాలాండ్, సిక్కిం రాష్ట్రాల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీలు లేవు. ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏమిటంటే... ఈ ఏడు రాష్ట్రల్లోనూ బీజేపీతో కూడిన కూటమి ప్రభుత్వాలే అధికారంలోకి రావడం గమనార్హం. దీనిపై ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతుంది!