Begin typing your search above and press return to search.

20 కిలోమీటర్లు ఫ్రీ.. ఆపై వెళ్లినంత దూరం!

దేశంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చాక.. మరీ ముఖ్యంగా నితిన్ గడ్కరీ కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి అయ్యాక జాతీయ రహదారుల నిర్మాణం బాగా ఊపందుకుంది.

By:  Tupaki Desk   |   11 Sep 2024 9:30 AM GMT
20 కిలోమీటర్లు ఫ్రీ.. ఆపై వెళ్లినంత దూరం!
X

దేశంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చాక.. మరీ ముఖ్యంగా నితిన్ గడ్కరీ కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి అయ్యాక జాతీయ రహదారుల నిర్మాణం బాగా ఊపందుకుంది. గడ్కరీ ప్రత్యేక ఫోకస్ తో తెలుగు రాష్ట్రాల్లోని చాలా రహదారులకు జాతీయ హోదా దక్కింది. అంతెందుకు.. ఒక్క ఖమ్మం జిల్లా నుంచే నాలుగు జాతీయ రహదారులు వెళ్తున్నాయి. ఇలాంటివి దేశంలో ఎన్నో రహదారులు అత్యుత్తమంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ క్రమంలో టోల్ గేట్ వ్యవస్థను హైటెక్ చేస్తున్నారు. తద్వారా వాహనదారులకు మరింత సులభ ప్రయాణం కలిగేలా చూస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఈ క్రమంలో మరో హైటెక్ నిర్ణయం తీసుకున్నారు.

హైదరాబాద్ నుంచి విజయవాడ జాతీయ రహదారి.. చౌటుప్పల్ దాటగానే పంతంగి.. ఆ తర్వాత సూర్యాపేట చేరకముందే మరోటి.. కోదాడ దాటి జగ్గయ్యపేట సమీపంలో ఇంకోటి.. ఇబ్రహీంపట్నం వద్ద కీసరలో ఒకటి.. ఇవన్నీ 300 కిలోమీటర్ల లోపు నాలుగు టోల్ గేట్లు.. ఒక్కోదానికి ఫాస్టాగ్ తప్పనిసరి.. ఇక హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్తుంటే.. మూడు టోల్ గేట్లు.. ఇవన్నీ ప్రైవేటు వాహనదారుల టోల్ తీసేవే.. జేబుకు చిల్లు పెట్టేవే.. ప్రైవేటు వాహనదారులే కాదు.. క్యాబ్ డ్రైవర్లూ చాలామంది తిట్టుకుంటూనే డబ్బులు కడుతున్న పరిస్థితి. మరోవైపు సొంత వాహనాలు లేనివారికీ ఈ టోల్ భారం కిరాయిలో కలిపి కట్టాల్సి వస్తుంది. ఇకమీదట మాత్రం దీన్నుంచి ఉపశమనం లభించనుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది.

జీఎన్‌ఎస్‌ఎస్‌ అంటే..

జీఎన్‌ఎస్‌ఎస్‌.. దీని పూర్తి పేరు గ్లోబల్‌ నావిగేషన్‌ శాటిలైట్‌ సిస్టమ్‌. ఒకవేళ ప్రైవేటు వాహనదారులు గనుక దీనిని అమర్చుకుంటే పెద్ద ఉపశమనం పొందవచ్చు. ఎందుకంటే జీఎన్‌ఎస్‌ఎస్‌ ఉన్న ప్రైవేటు వాహనాలు జాతీయ రహదారులమీద రోజుకు 20 కిలోమీటర్ల వరకూ టోల్‌ ఛార్జి లేకుండా ఉచితంగా ప్రయాణించవచ్చు. అంతేకాదు.. వంతెనలు, బైపాస్, సొరంగాలను ఉచితంగా ఉపయోగించుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

మున్ముందు టోల్ గేట్లు ఉండవు..

యూపీఏ ప్రభుత్వ హయాంలో జాతీయ రహదారుల టోల్ గేట్లకు సంబంధించి రుసుములపై 2008లో పలు నియమాలు తీసుకొచ్చారు. వీటిని తాజాగా కేంద్ర ప్రభుత్వం సవరించింది. దీని ఉద్దేశం ఏమంటే.. జీఎన్‌ఎస్‌ఎస్‌ ద్వారానే టోల్‌ రుసుములును వసూలు చేయడం. అంటే ఇకమీదట

టోల్‌ గేట్లు లేకుండానే ప్రయాణించే అవకాశం రానున్నట్లే. అయితే, అందుకోసం జీఎన్ఎస్ఎస్ ప్రోత్సాహకం ప్రకటించినట్లు భావిస్తున్నారు.

20 కిలోమీటర్లు ఫ్రీ.. ఆపై వెళ్లినంత దూరం..

జీఎన్ఎస్ఎస్ ప్రకారం.. తొలి 20 కిలోమీటర్లు టోల్ చార్జీ ఉండదు. అది దాటాక ప్రయాణించిన దూరానికే రుసుములు చెల్లించాల్సి ఉంటుంది. కాగా, మరో కీలక నిర్ణయమూ కేంద్రం తీసుకోనుంది. ఇప్పుడున్న టోల్‌ గేట్‌ వ్యవస్థ స్థానంలో శాటిలైట్‌ ఆధారిత సిస్టమ్ ను అందుబాటులోకి తేనుంది. దీనిపై ఇప్పటికే కసరత్తు సాగిస్తోంది. అదేగనుక వస్తే.. వాహనాలు టోల్‌ గేట్‌ దగ్గర ఆగి డబ్బు కట్టాల్సిన అవసరం ఉందడు. ఎంత దూరం అయితే వెళ్లామో.. దానిని గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (జీపీఎస్‌)తో లెక్కిస్తారు. ఆ మేరకు టోల్‌ రుసుము కట్టించుకుంటారు.