Begin typing your search above and press return to search.

హక్కుల వివాద దేశం.. మహిళా మానవ హక్కుల కార్యకర్తకు నోబెల్

సరిగ్గా ఏడాది కిందట ఆ దేశంలో హిజాబ్ పెద్ద వివాదం.. హిజాబ్ ధరించలేదని ఓ యువతిని పోలీసులు తీవ్రంగా కొట్టడం ఆ తర్వాత యువతి చనిపోవడం దేశాన్ని కుదిపేసింది

By:  Tupaki Desk   |   6 Oct 2023 10:24 AM GMT
హక్కుల వివాద దేశం.. మహిళా మానవ హక్కుల కార్యకర్తకు నోబెల్
X

సరిగ్గా ఏడాది కిందట ఆ దేశంలో హిజాబ్ పెద్ద వివాదం.. హిజాబ్ ధరించలేదని ఓ యువతిని పోలీసులు తీవ్రంగా కొట్టడం ఆ తర్వాత యువతి చనిపోవడం దేశాన్ని కుదిపేసింది. అల్లర్లు, ఆందోళనలు, నిరసనలు.. పోలీసు కాల్పులతో పదుల సంఖ్యలో మరణాలు సంభవించినట్లు కథనాలు వచ్చాయి. ఆ తర్వాత ప్రభుత్వం కొంత వెనక్కు తగ్గిందని కూడా ప్రచారం జరిగింది. ఇదంతా జరగడానికి కొన్ని నెలలు పట్టింది.

ఇప్పటికీ హక్కుల చిక్కులే..

మధ్య ఆసియా దేశం ఇరాన్. పేరుకు ముస్లిం దేశమే అయినా 1970ల వరకు ఆ దేశంలో పాశ్చాత్య ధోరణి కనిపించేది. యువత ముఖ్యంగా అమ్మాయిలు ఆ కల్చర్ లోనే ఉండేవారు. కానీ, ఆ తర్వాత సంప్రదాయ ధోరణుల్లోకి మళ్లింది. ఈ క్రమంలోనే కొన్నాళ్ల కిందట మహిళలు, అమ్మాయిలకు హిజాబ్ ధారణ తప్పనిసరి అనే నిబంధన ప్రవేశపెట్టారు. దీని అమలును పర్యవేక్షించేందుకు ఎథికల్ పోలీస్ వ్యవస్థను తీసుకొచ్చారు. నిబంధనలను విస్మరించిన వారి పట్ల ఈ పోలీసులు కఠినంగా వ్యవహరించేవారు. అలాంటి ఘటనే నిరుడు జరిగింది. కాగా, ఇప్పటికీ ఇరాన్ లో హక్కుల కార్యకర్తలు తమ గళం వినిపిస్తూనే ఉన్నారు.

వరించిన నోబెల్..

ఇరాన్ అంటే అమెరికాకు విపరీతమైన మంట. ఇజ్రాయిల్ కు అయితే ఆగర్భ శత్రువు. మిగతా పాశ్చాత్య దేశాలతోనూ అంతంతమాత్రం సంబంధాలే ఉన్న ఇరాన్.. రష్యాకు మాత్రం మిత్రుడు. ఉక్రెయిన్ యుద్ధంలో ఆ దేశానికి ఇస్కందర్ క్షిపణులను సరఫరా చేస్తోంది కూడా. కాగా, ఇరాన్ తో భారత్ కు మంచి సంబంధాలే ఉన్నాయి. ఇప్పుడు ఇరాన్ మహిళను ఓ అనుకోని ప్రపంచ ప్రఖ్యాత పురస్కారం వరించింది. అదేమంటే.. ప్రతిష్ఠాత్మక నోబెల్‌ శాంతి బహుమతి.

ఈ వారం మొదటినుంచి నార్వే నోబెల్ కమిటీ.. నోబెల్ బహుమతులను ప్రకటిస్తున్న తెలిసిందే. మొదట వైద్య శాస్త్ర నోబెల్ విజేతల పేర్లను వెల్లడించింది. శుక్రవారం ఇరాన్‌ కు చెందిన ప్రముఖ మానవ హక్కుల కార్యకర్త నర్గిస్‌ మొహమ్మదిని నోబెల్‌ శాంతి పురస్కారానికి ఎంపిక చేసింది. ఇరాన్ లో మహిళల అణచివేతకు వ్యతిరేకంగా ఆమె చేసిన పోరాటానికి అవార్డును అందజేసినట్లు ప్రకటించింది. నోబెల్ శాంతి పురస్కారం కోసం 351 నామినేషన్లు వచ్చినట్లు కమిటీ తెలిపింది.

నర్గిస్ మొహమ్మది 1972లో జన్మించారు. మానవ హక్కులకు గళమెత్తుతూ.. 2016లో మరణ శిక్ష రద్దుకు ఉద్యమించారు. ఇందుకుగాను ఆమెకు 16 ఏళ్ల జైలు శిక్ష విధించారు. అంతేకాదు.. ఇరాన్ లో వివాదాస్పద ప్రాంతమైన కుర్దిస్థాన్ కు చెందిన నర్గిస్.. ఫిజిక్స్ లో డిగ్రీ చదివారు. ఇరాన్ ప్రభుత్వం నుంచి ఎన్నో నిర్బంధాలను ఎదుర్కొన్న మొహమ్మది.. పలు సంవత్సరాలు జైలు శిక్షనూ అనుభవించారు. ఇప్పుడు ఆమెకు నోబెల్ శాంతి బహుమతి రావడం ఎంతైనా సంచలనంగా మారనుంది.