ఎంత ఓటమి అయితే మాత్రం ఇంత ఔట్ డేటెడ్ చేసుడేంది కేసీఆర్!
తెలంగాణ రాజకీయాల్లో తిరుగులేని అధిక్యతను ప్రదర్శించుకున్న ఆయన.. ఇప్పుడు ఔట్ డేటెడ్ గా మారిపోతున్నారు.
By: Tupaki Desk | 10 Jun 2024 11:30 AM GMTరాజకీయాల్లో గెలుపు టానిక్ లాంటిదైతే.. ఓటమి నిరాశను నిండుగా కమ్మేస్తుంది. ఒకలాంటి ఓటమి ఫర్లేదు. కానీ.. దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యేలాంటి ఓటమి ఎదురైతే.. దాన్ని తట్టుకొని నిలబడటం అంత సామాన్యమైన విషయం కాదు. నిజానికి ఒక రాజకీయ అధినేతకు అసలుసిసలు సవాలు ఇదే. అధికారం చేతిలో ఉన్నప్పడు చెలరేగిపోవటం.. తనకు తిరుగులేదన్నట్లుగా వ్యవహరించటం ఎవరైనా చేస్తారు. కానీ.. దారుణ ఓటమి పరాభవాన్ని గుండెల్లో దాచుకొని కసిగా పోరాటం.. పార్టీని విజయతీరాలకు తీసుకురావటం సామాన్యమైన విషయం కాదు.
నిజానికి ఆ షాక్ నుంచి తేరుకోవటమే పెద్ద సవాలు. వాతావరణం తనకు అనుకూలంగా ఉన్నప్పడు తనకు ఎదురే లేదన్నట్లుగా వ్యవహరించే గులాబీ బాస్.. వరుస ఓటముల తర్వాత ఆయన తీరును చూస్తే.. ఎలాంటి పెద్ద మనిషి ఎలా అయ్యారన్న భావన కలుగక మానదు. తెలంగాణ రాజకీయాల్లో తిరుగులేని అధిక్యతను ప్రదర్శించుకున్న ఆయన.. ఇప్పుడు ఔట్ డేటెడ్ గా మారిపోతున్నారు. లోక్ సభ ఎన్నికల ప్రచార వేళలోనూ.. ఆ తర్వాత ఎన్నికల్లో గెలుపు ఖాయమని.. తమకు తక్కువలో తక్కువ పదికి పైగా స్థానాల్ని సొంతం చేసుకుంటామని చెప్పటం తెలిసిందే.
అయితే.. ఎన్నికల ఫలితాలు ఎలా వచ్చాయో తెలిసిందే. మొత్తం 17 స్థానాలకు ఒక్కటంటే ఒక్క ఎంపీస్థానాన్ని సైతం గెలుచుకోలేని దీన స్థితిలో నిలిచిపోయారు. ఎన్నికల్లో గెలుపు సాధించిన తర్వాత కెమేరాల ముందుకు వచ్చే కేసీఆర్.. ఓటమి వేళ మాత్రం ముఖం చాటేయటం కనిపిస్తుంది. రాజకీయాల్లో గెలుపోటములు సహజం. గెలుపునకు చెలరేగిపోవటం.. ఓటమికి కుంగిపోవటం లాంటివి చేయకూడదు.
కానీ.. కేసీఆర్ మాత్రం అలాంటి తీరునే ప్రదర్శిస్తున్నారు. ఘన విజయం సాధించిన వేళ తమనకు మించినోడు లేడన్నట్లుగా మాటలు చెప్పిన పెద్దమనిషి.. ఓడిన వేళ కనీసం ప్రజల ముందుకు రావాలన్న ఆలోచన కూడా చేయకపోవటం గమనార్హం. ఎన్నికల్లో తాము ఓడినప్పటికీ.. తమకు ఓట్లు వేసిన వారికి థ్యాంక్స్ చెప్పాలన్న ఆలోచన కూడా గులాబీ బాస్ కు రాకపోవటం ఏమిటన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.
సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత కేసీఆర్ ఊసే తెలంగాణ రాష్ట్రంలో వినిపించని పరిస్థితి. తన గురించి మాట్లాడుకోవటం తర్వాత.. తాను ఒకడ్ని ఉన్నాడన్న భావన ఎవరికి లేకపోవటం.. తన ప్రస్తావనే లేకపోవటం చూసినప్పుడు ఇంత త్వరగా కేసీఆరర్ ఔట్ డేటెడ్ అయినట్లుగా పరిస్థితి మారింది. ఇలాంటి వాదనకు చెక్ పెట్టేలా కేసీఆర్ ఉత్సాహంగా బయటకు రావాల్సిన అవసరం ఉంది. అంతేతప్పించి.. ఫాంహౌస్ కు పరిమితమైతే.. గులాబీ కారు సైతం షెడ్డుకు పరిమితం అవుతుందన్న విషయాన్ని కేసీఆర్ మర్చిపోకూడదు.