ఏపీలో నామినేటెడ్ పంపకాలు పూర్తి.. ఒప్పందం ఏంటంటే..!
వీరందరికీ ఒక్కటే లక్ష్యం.. నామినేటెడ్ పదవులు దక్కించుకోవడం.
By: Tupaki Desk | 22 Oct 2024 9:30 PM GMTరాష్ట్రంలో నామినేటెడ్ పదవుల పంపకాల విషయంలో ఒక ఒప్పందం కుదిరినట్టు తెలుస్తోంది. కూటమి సర్కారు ఏర్పడిన తర్వాత.. నామినేటెడ్ పదవుల వ్యవహారం.. పెద్ద ఎత్తున చర్చకు వస్తున్న విషయం తెలిసిందే. ఎన్నికలకు ముందు కష్టపడిన వారు.. పార్టీ కోసం టికెట్లు త్యాగం చేసిన వారు.. ఆర్థికంగా పార్టీని ఆదుకున్నవారు.. ఇలా అనేక మంది ఉన్నారు. వీరందరికీ ఒక్కటే లక్ష్యం.. నామినేటెడ్ పదవులు దక్కించుకోవడం.
ఆదిశగానే నాయకులు అడుగులు వేస్తున్నారు. ఇక, టీడీపీలోనే 40 వేల మంది వరకు క్యూలో ఉన్నట్టు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. వీరిలో ఎవరికి ఇవ్వాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. ఇక, మిగిలిన కూటమి పార్టీలైన జనసేన, బీజేపీలు కూడా మేమంటే మేమే.. అంటూ ముందున్నాయి. తమకు కూడా నామినేటెడ్ పదవుల్లో వాటా కావాలని పోరు పెడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పటికి రెండు మూడు సార్లు ఆయా పార్టీలతో భేటీ అయిన చంద్రబాబు తాజాగా ఒక నిర్ణయానికి వచ్చారు.
నామినేటెడ్ పదవుల్లో మిత్రపక్షాలకు 20 శాతం పదవులు ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించినట్టు పార్టీ సీనియర్లు చెబుతున్నారు. మిగిలిన 80 శాతం పదవులను తామే తీసుకుంటామని అంటున్నారు. దీనిపై ఒప్పందం కుదిరినట్టు కూడా చెబుతున్నారు. వాస్తవానికి ఎన్నికలకు ముందు టికెట్ల పంపిణీ సమయం లో తమకు తక్కువగా సీట్లు ఇచ్చారని జనసేన నాయకులు యాగీ చేశారు. ఆసమయంలో జనసేనకు నామినేటెడ్ పదవులు ఎక్కువగా దక్కుతాయని చెప్పుకొచ్చారు.
ఈ క్రమంలో కనీసంలో కనీసం తమకు 30 శాతం పదవులు ఇస్తే బాగుంటుందని పవన్ కల్యాణ్ కూడా ఓ సందర్భంలో ఒకే ఒక్కసారి చెప్పుకొచ్చారు. ఇక, బీజేపీ కూడా తమకు 25 శాతం పదవులు ఇవ్వాలని పేర్కొంటూ.. కేంద్రంలోని పెద్దలను కూడా రంగంలోకి దింపింది. కానీ, ఇప్పుడు అన్నీ యూటర్న్ తీసుకుని.. ప్రభుత్వంలో కీలక పార్టీగా ఉన్న టీడీపీ.. తాము 80 శాతం పదవులు తీసుకునేలా రెండు పార్టీలను ఒప్పించినట్టు తెలిసింది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.