నామినేటెడ్ పదవులకు భారీ బ్రేక్...క్యాడర్ ఆశలకు చెక్ !
ఏపీలో శ్రావణ మాసం మంచి ముహూర్తం అని ఊరించిన నామినేటెడ్ పదవులు ఇపుడు అందని పండు అయ్యాయని ప్రచారం సాగుతోంది.
By: Tupaki Desk | 22 Aug 2024 1:30 PM GMTఏపీలో శ్రావణ మాసం మంచి ముహూర్తం అని ఊరించిన నామినేటెడ్ పదవులు ఇపుడు అందని పండు అయ్యాయని ప్రచారం సాగుతోంది. నామినేటెడ్ పదవులు అదిగో ఇదిగో అన్న వార్తలు అన్నీ గాలిలోకి కొట్టుకుపోగా పూర్తి స్థాయిలో పదవుల పందేరం వాయిదా పడింది అని అంటున్నారు. శ్రావణ మాసం కాకుండా మరి ఎపుడు అంటే వచ్చేది భాద్రపద మాసం. మంచిది కాదు పైగా శూన్య మాసం.
దాంతో ఆశ్వీయజ మాసానికి ఈ పదవుల పందేరం వాయిదా పడింది అని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీంతో నామినేటెడ్ పదవులతో ఎంచక్క కుర్చీ ఎక్కవచ్చు అని ఆశించిన వారికి తీరని ఆశాభంగమే కలుగుతోంది అని అంటున్నారు. శ్రావణ మాసంలో అపుడే సగం రోజులు పైగా గడచిపోయాయి. ఇప్పటికి అనేక డేట్లు ప్రచారంలోకి వచ్చాయి కానీ అవన్నీ ఉత్తవని తేలిపోయింది.
మరో వైపు చూస్తే ఫలానా వారికి ఫలనా పదవి అని సోషల్ మీడియాలో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో చక్కర్లు కొట్టిన వార్తలు కూడా ఈ రోజుకు అవాస్తవం అనే తేలిపోయింది అని అంటున్నారు. ఆశావహులు ఎక్కువగా ఉండడంతో పాటు పదవుల పంపిణీ చేసినా ఖజానా ఖాళీగా ఉండడంతో నిధులకు చూసుకోవాల్సి వస్తుంది అన్న ఆలోచనలు కూటమి పెద్దలలఒ ఉన్నాయని అంటున్నారు
ఒక వైపు సంక్షేమ పధకాలకు నిధులు లేవని చెబుతూ మరో వైపు నామినేటెడ్ పదవుల పేరుతో ఖజానాకు భారం పెట్టడం వల్ల జనాలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయని భావించి కూడా వాయిదా వైపు మొగ్గారని అంటున్నారు. అయినా నామినేటెడ్ పదవులు ఇవ్వాలన్నది కంపల్సరీ కాదు అన్న మాట కూడా ఉంది.
అన్ని విధాలుగా చూసుకుని నెమ్మదిగా భర్తీ చేయవచ్చు అని కూడా ఆలోచిస్తున్నారుట. ఇంకా ప్రభుత్వం కుదురుకోలేదని కొంత వెసులుబాటు తీసుకుని పదవులు దశల వారీగా భర్తీ చేయడం అన్న అలోచన కూడా ఉంది అని అంటున్నారు.
ఇంకో వైపు చూస్తే కూటమిలో ఈ నామినేటెడ్ పదవుల పంపిణీ లెక్క తెగలేదని అంటున్నారు. కూటమిలో టీడీపీ పెద్ద పార్టీ. ఆ పార్టీలోనే ఎక్కువ మంది త్యాగరాజులు ఉన్నారని వారికే ఎక్కువ పదవులు కావాలని ఒక డిమాండ్ వచ్చిందంట. అయితే మిత్రులకు కూడా ముప్పయి శాతం దాకా పదవులు ఇవ్వడానికి ప్రయత్నం జరిగింది.దాంతోనే తమ్ముళ్ల మధ్య తకరారు మొదలైంది అని అంటున్నారు.
ఇంతలా గందరగోళంతో గలాటాతో పదవులను భర్తీ చేయడం అవసరమా అన్న చర్చతోనే వాయిదా పద్దతి ఎంచుకున్నారు అని అంటున్నారు. ఇక ఈ నామినేటెడ్ పదవుల భర్తీకి ఎంచుకున్న విధానం మీద కూడా విమర్శలు వచ్చాయని అంటున్నారు. ఐవీఆర్ఎస్ సర్వే ద్వారా అభ్యర్థుల ఎంపిక జరగడం పట్ల తమ్ముళ్లు అభ్యంతరం వ్యక్తం చేశారు అని అంటున్నారు.
అలాగే ఎమ్మెల్యేలు కూడా తమ వారికి పదవులు ఇప్పించుకోవాలని చూస్తున్నారు. దాంతో రానున్న రోజులలో మరోసారి ఎంపికని పకడ్బందీగా చేపట్టాలని నిర్ణయించారు అని అంటున్నారు. ఎమ్మెల్యేల ద్వారా ఒక్కో పదవికి కనీసంగా ఇద్దరు లేదా ముగ్గురిని సూచిస్తూ జాబితాను పంపిస్తే దానిని హై కమాండ్ వడపోత పట్టి అందులో నుంచి నామినేటెడ్ పదవులకు అర్హులను ఎంపిక చేస్తారు అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే మరో రెండు నెలల పాటు నామినేటెడ్ పదవుల ఊసు ఉండకపోవచ్చు అన్నది లేటెస్ట్ గా వస్తున్న టాక్. మరి ఇందులో నిజం ఎంత అన్నది చూడాల్సి ఉంది.