వాళ్లు రాజీనామా చేస్తారా.. చేయిస్తారా..?
సాధారణంగా ప్రభుత్వం మారిపోయినప్పుడు.. నామినేటెడ్ పదవుల్లో ఉన్నవారు తమ తమ పదవులను వదులుకుంటారు.
By: Tupaki Desk | 26 Jun 2024 8:30 AM GMTసాధారణంగా ప్రభుత్వం మారిపోయినప్పుడు.. నామినేటెడ్ పదవుల్లో ఉన్నవారు తమ తమ పదవులను వదులుకుంటారు. ఇది వారికి , వారు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీలకు కూడా అంతో ఇంతో గౌరవం. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో వైసీపీ సర్కారు కుప్పకూలగానే.. టీటీడీ చైర్మన్‌గా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. అదేవిధంగా మరికొందరు చైర్మన్‌లు కూడా రాజీనామాలు చేశారు. దీంతో వారంతా గౌరవ ప్రదంగా ఆయా పదవుల నుంచి తప్పుకొన్నారు.
ఇక, సామాజిక వర్గాలకు చెందిన 56 కార్పొరేషన్ల కు సంబంధించిన చైర్మన్‌లను ప్రభుత్వమే తొలగించింది. ముందుగా వారం రోజుల సమయం ఇస్తున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రకటించారు. కానీ, తర్వా త.. ఏమైందో ఏమో.. రాత్రికి రాత్రి వారిని తొలగిస్తూ.. నిర్ణయం తీసుకున్నారు. దీంతో అన్ని సామాజిక వర్గాల కార్పొరేషన్లలోని చైర్మన్ పదవులు రద్దయ్యాయి. అయితే.. కొందరు మాత్రం ఇంకా పదవులను పట్టుకుని వేలాడుతున్నారు.
వీరి విషయంలో ఏం చేయాలన్న దానిపై ప్రభుత్వం ఆలోచనలో పడింది. ఉదాహరణకు కనక దుర్గమ్మ ఆలయం బోర్డు చైర్మన్ పదవికి వైసీపీ నేత ఇంకా రాజీనామా చేయలేదు. ఆయన టీడీపీలో చేరేందుకు రెడీగా ఉన్నారని.. విజయవాడకు చెందిన నాయకులతో టచ్‌లో ఉన్నారని సమాచారం. అదేవిధంగా మంగళగిరి పానకాల లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఉన్న బోర్డు చైర్మన్ కూడా తన పదవిని వదులుకోలేదు. శ్రీకాళహస్తి, కాణిపాకం వంటి బోర్డుల్లోనూ ఇదే జరుగుతోంది.
మరీ ముఖ్యంగా.. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ పదవిని కూడా.. ప్రస్తుతం ఉన్న నాగలక్ష్మి వదులు కోలేదు. సహజంగా ప్రభుత్వం మారితే.. ఈ పదవిని వదిలేస్తారు. గతంలో చంద్రబాబు హయాంలో నన్నపనేని రాజకుమారి మహిళా కమిషన్ చైర్ పర్సన్‌గా ఉన్నారు. అయితే.. వైసీపీ అధికారంలోకి రావడంతో ఆమె స్వచ్ఛందంగా వచ్చి.. రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు నాగలక్ష్మి సహా.. మిగిలిన వారు గౌరవంగా రాజీనామాలు చేస్తారా? లేక సర్కారే బలవంతంగా చేయించే పరిస్థితి వస్తుందా? అనేది చూడాలి.