టీడీపీ జనసేనల మధ్య పదవుల కోసం సమరం !
రెండు పార్టీలలోనూ ఆశావహులు ఉన్నారు. ఇద్దరినీ శాంత పరచాలి. ఇద్దరికీ సర్దుబాటు చేయాలి.
By: Tupaki Desk | 2 July 2024 3:38 AM GMTరెండు పార్టీలలోనూ ఆశావహులు ఉన్నారు. ఇద్దరినీ శాంత పరచాలి. ఇద్దరికీ సర్దుబాటు చేయాలి. పై స్థాయిలో అయితే టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇద్దరి మధ్య బాగానే సామరస్యం ఉంది. ఇద్దరూ కూడా అన్ని విషయాల మీద పూర్తి అవగాహనతో ముందుకు పోతున్నారు.
కానీ గ్రౌండ్ లెవెల్ లో మాత్రం ఆరాటాలు పోరాటాలు ఒక రేంజిలో ఉన్నాయి. ఎవరి ఆశలు వారివి. ఎవరి ఆకాంక్షలు వారివి. అందుకే ప్రయత్నలు కూడా ఎవరి స్థాయిలో వారు చేసుకుంటున్నారు. నామినేటెడ్ పదవులు ఏపీలో దండీగా ఉన్నాయి. అవి వందల కొద్దీ ఉన్నాయి. ఇందులో ప్రెస్టేజ్ తో కూడా పోస్టులు కేబినెట్ ర్యాంక్ పోస్టులు కూడా చాలా ఉన్నాయి.
ఇపుడు వీటి మీద రెండు పార్టీల కన్ను పడింది. ముందుగా ఎవరైతే కుర్చీ మీద కర్చీఫ్ వేస్తారో వారికి సహజంగానే చాన్స్ దక్కుతుందన్న ముందస్తు తెలివిడితో తెలుగు తమ్ముళ్ళు జనసైనికులు బడా కుర్చీలకే టార్గెట్ పెడుతున్నారు. ఆ వరసలో తిరుపతిలోని తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ తుడా చైర్మన్ పదవి కోసం పోటీ పెద్ద ఎత్తున సాగుతోంది అని అంటున్నారు.
ఈ పదవి మీద జనసేన కన్ను పడడమే కాదు ఎగరేసుకుని పోయే సూచనలు కూడా కనిపిస్తున్నాయని అంటున్నారు దానికి కారణం తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు జనసేనకు చెందిన వారు. దాంతో ఈ కీలకమైన పదవి జనసేన ఖాతాలోకే అని అంటున్నారు ఈ విధంగా ప్రచారం సాగుతూండడంతో తమ్ముళ్ళలో కంగారు ఎక్కువైపోయిందని అంటున్నారు.
దాంతో తిరుపతిలో ఈ పదవి మీద ఆశలు పెంచుకున్న తమ్ముళ్ళు తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబుని కలిశారని అంటున్నారు ఈ పదవి విషయంలో తమ నుంచి జారీపోనీయవద్దని వారు బాబుని కోరినట్లుగా తెలుస్తోంది. ఈ పదవి తమకే కావాలని రెండు పార్టీలకు చెందిన నాయకులు పోటీ పడడంతో ఒక చిన్న సైజు వార్ అయితే స్టార్ట్ అయిపోయింది అని అంటున్నారు.
అయితే ఇక్కడ టీడీపీ నేతలు చెబుతున్న కారణాలు లాజిక్ కి అందేలా ఉన్నాయని అంటున్నారు. తిరుపతి టీడీపీకి పట్టున్న సీటు. పొత్తులో భాగంగా దానిని జనసేనకు ఇచ్చేశారు. ఇపుడు తుడా కూడా వదులుకుంటే టీడీపీకి ఉనికికే ఇబ్బంది వస్తుందని తమ్ముళ్ళు అంటున్నారు. పైగా తాము పొత్తులో సీటుకు త్యాగం చేశామని అందువల్ల తుడా పదవి ఇస్తే న్యాయం జరుగుతుందని అంటున్నారుట. దీంతో ఇపుడు టీడీపీ అధినాయకత్వం ఏమి చేస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది.
కేవలం తుడా మాత్రమే కాదు కీలకమైన పోస్టులు ఉన్న ప్రతీ చోటా ఇదే విధంగా రెండు పార్టీల మధ్య వార్ సాగుతోందని అంటున్నారు. పొత్తులో సీట్లు తక్కువ తీసుకున్నపుడు పవన్ కళ్యాణ్ తన పార్టీ వారితో నిర్వహించిన అనేక సమావేశాలలో మాట్లాడుతూ నామినేటెడ్ పదవులతో పాటు లోకల్ బాడీస్ లో అవకాశాలు ఇలా చాలా ఉంటాయని చెప్పిన సంగతిని జనసైనికులు గుర్తుచుకుంటున్నారు.
టీడీపీ విషయం సరేసరి. అయిదేళ్ళుగా అధికారం లేదు. అంతకు ముందు అధికారం చలాయించినా చాలా పదవులను చంద్రబాబు ఆనాడు భర్తీ చేయకుండా వదిలేశారు.దాంతో ద్వితీయ శ్రేణి తృతీయ శ్రేణి నాయకులు అంతా పదేళ్ళుగా అన్యాయం అయిపోయామని బాధలో ఉన్నారు. దాంతో వారికి అవకాశాలు ఇవ్వాల్సి ఉంటుంది అని అంటున్నారు.