కొలికపూడిపై నాన్ బెయిలబుల్ కేసు... సీఐడీ ఎంట్రీతో జంప్?
ఈ నేపథ్యంలో కొలికపూడి శ్రీనివాసరావు తనపై చేసిన వ్యాఖ్యలపై దర్శకుడు రాం గోపాల్ వర్మ స్పందించారు.
By: Tupaki Desk | 30 Dec 2023 1:15 PM GMTకొద్ది రోజుల క్రితం ఓ ఛానల్ లోని ఒక చర్చా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కొలికపూడి శ్రీనివాసరావు.. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... యాంకర్ అడిగిన ప్రశ్నలకు కొలికపూడి సమాధానాలు చెప్తూ... "రాంగోపాల్ వర్మ తల నరికి తెస్తే కోటీ రూపాయలు ఇస్తా" అంటూ ఛాలెంజ్ చేశారు. అనంతరం.. "ఐ రిపీట్, ఐ రిపీట్ నాకు సమాజం కంటే ఏదీ ఎక్కువ కాదు" అంటూ రెచ్చిపోయారు.
అనంతరం ఆ షోను యాంకర్ కంటిన్యూ చేశారు.. అనంతరం ఆ ఛానల్ కు సంబంధించిన వెబ్ సైట్, యూట్యూబ్ ఛానల్స్ లోనూ ఆ వీడియోను అందుబాటులో ఉంచారని అంటున్నారు! దీంతో ఈ ఇష్యూ వైరల్ గా మారింది. ఈ నేపథ్యంలో కొలికపూడి శ్రీనివాసరావు తనపై చేసిన వ్యాఖ్యలపై దర్శకుడు రాం గోపాల్ వర్మ స్పందించారు. ఇందులో భాగంగా... ఏపీ డీజీపీకి ఫిర్యాదు చేశారు.
ఈ సమయంలో కొలికపూడి శ్రీనివాస రావుతోసహా ఆరుగురిపై ఏపీ సీఐడీ నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసిందని తెలుస్తుంది. వారిలో సదరు ఛానల్ యజమాని, యాంకర్, మేనేజింగ్ డైరెక్టర్లు కూడా ఉన్నారని అంటున్నారు. ఈ సందర్భంగా కొలికపూడి శ్రీనివాసరావు ఇంటికి ఏపీ సీఐడీ అధికారులు వెళ్లారని తెలుస్తుంది. రాంగోపాల్ వర్మ ఫిర్యాదు నేపథ్యంలో శ్రీనివాసరావును అరెస్ట్ చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం.
కొలికపూడిని అరెస్టు చేసేందుకే ఏపీ సీఐడీ బృందం హైదరాబాద్ వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో హైదరాబాద్ కి చేరుకున్న ఏపీ సీఐడీ అధికారులు.. నల్లగండ్లలోని అపర్ణ సైబర్ లైఫ్ గేటెడ్ కమ్యూనిటీలోని శ్రీనివాసరావు ఇంటికి వచ్చినట్లు తెలుస్తుంది. అయితే సీఐడీ అధికారులు వచ్చే సమయానికి ఆయన పరారయ్యారని అంటున్నారు. దీంతో... ఆయన భార్యతో మాట్లాడిన అనంతరం సీఐడీ అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారని తెలుస్తుంది.
కాగా... తన తల తెస్తే కోటి రూపాయలు నజరానా అని చేసిన ప్రకటనను ఆర్జీవీ సీరియస్ గా తీసుకున్నారు. ఈ సందర్భంగా ఏపీ డీజీపీకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫిర్యాదులో "కొలికపూడి శ్రీనివాస్ లైవ్ టీవీ షోలో నన్ను చంపి నా తలను తీసుకువచ్చిన వాడికి కోటి రూపాయలు ఇస్తానని బహిరంగంగా ఆఫర్ ఇచ్చాడు. ఇదే కాకుండా నన్ను నా ఇంటి కొచ్చి తగలబెడతానని పబ్లిక్ గా అదే టీవీలో చెప్పాడు" అని పేర్కొన్నారు.
ఇదే సమయంలో... "ఆపుతున్నట్లు నటిస్తూ యాంకర్ నన్ను చంపే కాంట్రాక్ట్ గురించి మూడు సార్లు రిపీట్ చేయించాడు. ఆ తర్వాత కూడా అతడితో చర్చ కొనసాగించారు. దీన్ని బట్టి వాళ్లిద్దరూ నన్ను చంపటానికి కాంట్రాక్ట్ ఇవ్వటానికి ముందుగానే ప్లాన్ చేసుకున్నట్టు క్లియర్ గా అర్ధమవుతోంది. శ్రీనివాసరావు నన్ను తానే మర్డర్ చెయ్యటంకన్నా దారుణం, లైవ్ టీవీలో కూర్చుని నన్ను చంపితే కోటి రూపాయలు ఇస్తానని వేరే ఎవరెవరికో డబ్బాశ చూపించి ఇన్స్పైర్ చెయ్యటం" " అని ఫిర్యాదులో పేర్కొన్నారు.
"ఇలాంటి హత్య కుట్రలు తన ఛానల్ లో ప్రసారమవుతున్నాయని తెలిసి కూడా సదరు యాంకర్ ని వెంటనే జాబ్ నుంచి తీసెయ్యలేదంటే యజమాని కూడా ఈ కుట్రలో భాగంగా ఉన్నట్టు క్లియర్ గా తెలిసిపోతోంది" అని వెల్లడించారు. ఒక డెమోక్రసీలో హత్యా కాంట్రాక్టులు ఇంత పబ్లిక్ గా ఇవ్వటం చూస్తే టెర్ర్రరిస్ట్ లు కూడా షాక్ అవుతారు. కాబట్టి, పై ముగ్గురి మీద వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి" అని ఆర్జీవీ.. ఏపీ డీజీపీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.