పవన్ కళ్యాణ్ పై నాన్ బెయిలబుల్ కేసు నమోదు!
ఈ సమయంలో తాజాగా జాతీయ ఎస్సీ కమిషన్ ఆదేశాల మేరకు పవన్ కళ్యాణ్ పై మరో నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది.
By: Tupaki Desk | 14 April 2024 4:43 AM GMTఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ తేదీకి కౌంట్ డౌన్ మొదలైంది. నెలరోజుల లోపే పోలింగ్ తేదీ ఉండటంతో పాటు అంతకు రెండు రోజుల ముందే ప్రచార పర్వాలకు తెర్పడనున్న నేపథ్యంలో.. అన్ని రాజకీయ పార్టీలూ దూకుడు పెంచాయి. ఈ క్రమంలో... ఏపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు తెరపైకి వస్తున్నాయి. ఇందులో భాగంగా తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై నాన్ బెయిలబుల్ కేసు నమోదవ్వడం ఆసక్తిగా మారింది.
అవును... ఏపీలో ఎన్నికల పోలింగ్ తేదీకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిన నేపథ్యంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి! ఇందులో భాగంగా... వాలంటీర్ వ్యవస్థపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన తీవ్ర వ్యాఖ్యల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ సమయంలో జాతీయ ఎస్సీ కమిషన్ రంగంలోకి దిగడంతో ఈ వ్యవహారం అత్యంత సీరియస్ గా మారిందని అంటున్నారు!
గతంలో పవన్ కళ్యాణ్ పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరువు నష్టం కేసు వేసిన సంగతి తెలిసిందే. తనకు కేంద్ర నిఘా వర్గాల సమాచరం ఉందంటూ.. ఏపీలో వాలంటీర్లు హ్యూమన్ ట్రాఫికింగ్ కి సహకరిస్తున్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో తాజాగా జాతీయ ఎస్సీ కమిషన్ ఆదేశాల మేరకు పవన్ కళ్యాణ్ పై మరో నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది.
ఆంధ్రప్రదేశ్ లో మానవ అక్రమ రవాణా.. సుమారు 29,000 మంది మహిళల అదృశ్యం వెనుక వాలంటీర్లు ఉన్నారంటూ గత ఏడాది పవన్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి జాతీయ ఎస్సీ కమిషన్ స్పందించింది! ఒక మాదిగ సంఘం మహిళా వాలంటీర్.. పవన్ పై ఫిర్యాదు చేయడంతో ఈ కేసును ఎస్సీ కమిషన్ కు పంపారు. దీంతో... ఈ వ్యవహారంపై స్పందించిన నేషనల్ ఎస్సీ కమిషన్... పవన్ పై నాన్ బెయిలబుల్ కేసు బుక్ చేయాలని ఏలూరు పోలీసులను ఆదేశించారు.
ఈ మేరకు పవన్ కల్యాణ్ పై 153, 504, 505 (2)ఐపీసీ కింద నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసి, దర్యాప్తుకు ఆదేశించారు! దీంతో... ఎన్నికల సమయంలో ఈ విషయం తీవ్ర చర్చనీయాంశం అయ్యింది! ఇదే సమయంలో... ఈ కేసుకు సంబంధించి పవన్ కు అదుపులోకి తీసుకునే అవకాశం ఉందంటూ నెట్టింట ఊహాగాణాలు తెరపైకి వస్తున్నాయి!