Begin typing your search above and press return to search.

రోజా పై నాన్ లోకల్ అస్త్రం

ఎక్కడినుండో వచ్చిన నగిరిలో పోటీచేస్తున్న రోజా కూడా నాన్ లోకలే అని మంత్రి వ్యతిరేకవర్గంలోని నేతలు పెద్దఎత్తున ప్రచారం చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   31 Jan 2024 1:30 PM GMT
రోజా పై నాన్ లోకల్ అస్త్రం
X

లోకల్, నాన్ లోకల్ అనే అస్త్రం ఈమధ్య చాలా ఎక్కువగా వినబడుతోంది. అందులో కూడా రాజకీయ నేతల నుండే ఎక్కవగా వినబడుతోంది. విషయం ఏమిటంటే మంత్రి రోజాను నగిరి నియోజకవర్గంలోని నేతలు నాన్ లోకల్ అంటు గట్టిగా తగులుకుంటున్నారు. ఎక్కడినుండో వచ్చిన నగిరిలో పోటీచేస్తున్న రోజా కూడా నాన్ లోకలే అని మంత్రి వ్యతిరేకవర్గంలోని నేతలు పెద్దఎత్తున ప్రచారం చేస్తున్నారు. రోజాది తిరుపతి అన్న విషయం అందరికీ తెలిసిందే.

తిరుపతికి చెందిన రోజాను టీడీపీలో ఉన్నపుడు చంద్రబాబునాయుడు నగిరి నుండి పోటీచేయించారు. ఆ తర్వాత రెండోసారి చంద్రగిరిలో పోటీచేయించారు. ఆ రెండుసార్లు రోజా కాంగ్రెస్ అభ్యర్ధుల చేతిలో ఓడిపోయారు. తర్వాత వైసీపీలో చేరిన రోజా మళ్ళీ నగిరి నుండే పోటీచేశారు. అలా 2014,2019 ఎన్నికల్లో రెండుసార్లు గెలిచారు. రెండోసారి గెలిచి ఇపుడు మంత్రిగా ఉన్నారు. రాబోయే ఎన్నికలకు సంబంధించి ప్రతిపక్ష నేతలపై రోజా నాన్ లోకల్ అంటు నానా గోలచేస్తున్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్, దగ్గుబాటి పురందేశ్వరి, వైఎస్ షర్మిల ఇలా అందరు నాన్ లోకల్సే అన్నది రోజా ఆరోపణ.

వీళ్ళు పుట్టకతో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన నేతలే అయినప్పటికీ దశాబ్దాలుగా ఉంటున్నది మాత్రం హైదరాబాద్ లోనే. వీళ్ళంతా హైదరాబాద్ లో కూర్చుని ఏపీలో రాజకీయాలు చేయటం ఏమిటన్నది రోజా ప్రశ్న. ఏపీ రాజకీయాల్లో ఉంటున్న వీళ్ళు పర్మినెంటుగా ఏపీలోనే ఎందుకు ఉండటంలేదని రోజా పదేపదే ప్రశ్నిస్తున్నారు. రోజా ఆరోపణల్లో కొంత వాస్తవం ఉంది. అయితే ఇదే సమయంలో ఒకపుడు రోజా ఉన్నది కూడా హైదరాబాద్ లోనే. ప్రతిపక్షంలో ఉన్నపుడు జగన్ ఎక్కువగా ఉన్నది కూడా హైదరాబాద్ లోనే.

అయితే అదే నాన్ లోకల్ అస్త్రాన్ని ఇపుడు సొంతపార్టీలోని రోజా వ్యతిరేకవర్గం బయటకు తీసింది. తిరుపతికి చెందిన రోజా నగిరికి నాన్ లోకలే కదా అని గోలమొదలుపెట్టారు. రోజా తిరుపతిలో పోటీచేయకుండా నగిరిలో ఎందుకు పోటీచేస్తున్నారంటు వ్యతిరేకవర్గం మండిపోతోంది. లోకల్ క్యాండిడేట్లకే రాబోయే ఎన్నికల్లో జగన్ టికెట్ ఇవ్వాలని రోజా వ్యతిరేక వర్గం గట్టిగా డిమాండ్లు మొదలుపెట్టింది. మరి చివరకు ఏమవుతుందో చూడాలి.