Begin typing your search above and press return to search.

ఈ తెలుగు పార్టీల చరిత్రను ఎవరూ 'మార్చి' లేరు

అన్ని వర్గాలకూ మేలుచేసిన సంక్షేమాన్ని నమ్ముకున్నవైసీపీ మాత్రం మరోసారి అధికారం తమదేననే ధీమాతో ఉంది.

By:  Tupaki Desk   |   15 March 2024 3:30 PM GMT
ఈ తెలుగు పార్టీల చరిత్రను ఎవరూ మార్చి లేరు
X

మార్చి నెల.. శివరాత్రితో శివశివ అంటూ చలికాలం వెళ్లిపోయి.. అప్పుడప్పుడే ఎండలు ముదిరే కాలం.. మామిడి పూత పిందెల నుంచి కాయలుగా మారే కాలం.. సువాసన వెదజల్లే మల్లెలు మార్కెట్ కు వచ్చే కాలం.. మరి ఇదే నెలలో తెలుగు రాష్ట్రాల చరిత్రలో కీలకమైన మూడు రాజకీయ పార్టీలు ఆవిర్భవించాయి.

అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ, జనసేన.. ఏపీలోని ఈ మూడు ప్రధాన పార్టీలకూ మార్చి నెల కీలకమే. ఎందుకంటే.. వచ్చే నెలలో జరగబోయే ఎన్నికల్లో తాడోపేడో తేల్చుకునేందుకు ఈ పార్టీలు సిద్ధం అవుతున్నాయి. టీడీపీ-జనసేనలు బీజేపీతో జట్టు కట్టి అధికార వైసీపీని సవాల్ చేస్తున్నాయి. అన్ని వర్గాలకూ మేలుచేసిన సంక్షేమాన్ని నమ్ముకున్నవైసీపీ మాత్రం మరోసారి అధికారం తమదేననే ధీమాతో ఉంది. శనివారం వెలువడబోయే ఎన్నికల షెడ్యూల్ అనంతరం వీటి మధ్య సమరం రసవత్తరంగా సాగడం ఖాయం. వైసీపీ గనుక ఓడితే జగన్ రాజకీయ భవిష్యత్ కు మరోసారి సవాల్ తప్పదు. టీడీపీ ఓటమి పాలైతే చంద్రబాబు క్రియాశీల రాజకీయాలకు దాదాపు ముగింపు వచ్చినట్లే. తాను నెగ్గడమే కాక కనీస సంఖ్యలో ఎమ్మెల్యేలను గెలిపించుకోకుంటే జన సేనాని పవన్ కల్యాణ్ రాజకీయ ఉనికికే ముప్పు.

పుట్టింది ఈ నెలలోనే

వచ్చే ఎన్నికల్లో ఢీ అనేలా తలపడనున్న వైసీపీ, జనసేన, టీడీపీ మధ్య ఒక సారూప్యత ఉంది. అదేమంటూ ఈ మూడు పార్టీలు మార్చి నెలలోనే పుట్టాయి. తెలుగు వారు గర్వించే మహా నటుడు, అన్న నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) 1982 మార్చి 29న తెలుగు దేశం పార్టీని స్థాపించారు. ‘‘సమాజమే దేవాలయం.. పేదలే దేవుళ్లు’’ అనే నినాదంతో జనంలోకి వెళ్లి కేవలం 9 నెలల్లో అధికారం సాధించి ప్రపంచ రికార్డు నెలకొల్పారు. ఇక 1983, 1985, 1994, 1999, 2014 (విభజిత ఏపీ)లో ఎన్నికలను గెలిచింది. మొత్తం 42 ఏళ్ల చరిత్రలో 21 ఏళ్లు (50 శాతం) అధికారంలో ఉంది.

తనదైన శైలి ఉమ్మడి ఏపీలో అత్యంత జనాదరణ పొంది.. వరుసగా రెండోసారి కాంగ్రెస్ పార్టీని గెలిపించి.. అకాల మరణం పాలయ్యారు దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి. దీనిని తట్టుకోలేక ప్రాణాలు తీసుకున్న కుటుంబాలను పరామర్శించేందుకు సిద్ధమైన వైఎస్ కుమారుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్ఠానం అడ్డుకుంది. దీనికి నిరసనగా ఆయన కాంగ్రెస్ ను వీడి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ (వైఎస్సార్ కాంగ్రెస్) అంటూ 2011 మార్చి 12న సొంత పార్టీని నెలకొల్పారు. 2014లో విభజిత ఏపీలో అధికారంలో కోసం తీవ్రగా పోరాడి ఓడారు. 2019లో మాత్రం సునాయాసంగా గెలుపొందారు.

ప్రశ్నించే నైజంతో..

2014 ఎన్నికల ముంగిట మార్చి 14న జనసేన పార్టీని స్థాపించారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ప్రశ్నించే తత్వంతో పదేళ్లుగా పోరాటం సాగిస్తున్నారు. తొలి ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటూ టీడీపీకి మద్దతు ప్రకటించిన ఆయన గత ఎన్నికల్లో ఒంటరిగా బరిలో దిగారు. అయితే, పవన్ రెండు చోట్ల పోటీచేసి ఓడిపోయారు. ఒక్క ఎమ్మెల్యే గెలిచినా ఆయన కూడా పార్టీలో ఉండలేదు. వచ్చే ఎన్నికల్లో మాత్రం బలమైన ముద్ర చూపేందుకు సిద్ధం అవుతున్నారు. టీడీపీ-బీజేపీతో పొత్తు పెట్టుకుని 21 అసెంబ్లీ, 3 లోక్ సభ స్థానాల్లో బరిలో దిగుతున్నారు.