Begin typing your search above and press return to search.

మాది చిన్న దేశమే కావొచ్చు.. బెదిరించే లైసెన్స్ ఎవరికీ ఇవ్వలేదు

తాజాగా మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో ఆయన చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు తెర తీశాయని చెప్పాలి.

By:  Tupaki Desk   |   14 Jan 2024 5:01 AM GMT
మాది చిన్న దేశమే కావొచ్చు.. బెదిరించే లైసెన్స్ ఎవరికీ ఇవ్వలేదు
X

భారత దేశం మీదా.. మన దేశ ప్రధాని మీదా మల్దీవుల మంత్రులు చేసిన అనుచిత వ్యాఖ్యలు.. అనంతరం చోటు చేసుకున్న పరిణామాల గురించి తెలిసిందే. ఈ వివాదం ఇలా సాగుతున్న వేళలోనే.. ఆ దేశాధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు తన ఐదు రోజుల చైనా పర్యటనను ముగించుకొని దేశానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన నోటి నుంచి వచ్చిన మాటలు చూస్తే.. స్వరంలో తేడా కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుందని చెప్పాలి.తాజాగా మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో ఆయన చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు తెర తీశాయని చెప్పాలి.

మాల్దీవులు చిన్నదే కావొచ్చు కానీ తమను బెదిరించే లైసెన్సు మాత్రం ఏ దేశాలకు తాము ఇవ్వలేదని పేర్కొన్నారు. హిందూ మహాసముంద్ర ఒక నిర్దిష్ట దేశానికి చెందింది కాదన్న ఆయన.. ‘‘ఈ మహాసముద్రంలో మనకు చిన్న ద్వీపాలు ఉన్నప్పటికి 9లక్షల చదరపు కిలోమీటర్ల విస్తారమైన ప్రత్యేక ఆర్థిక మండలి ఉందని.. ఈ మహాసముద్రంలో అత్యధిక వాటా కలిగిన దేశాల్లో మాల్దీవులు ఒకటి. అయితే.. ఈ సముద్రం దానిలో ఉన్న అన్ని దేశాలకు చెందినది’ అని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా మాల్దీవులు భారతదేశ పెరట్లో ఉందన్న వ్యాఖ్యలపై స్పందిస్తూ. తాము ఎవరి పెరట్లో లేమని.. తమది స్వతంత్ర.. సార్వభౌమ రాజ్యంగా పేర్కొన్నారు. చైనాతో తమకున్న సంబంధాల గురించి ప్రస్తావిస్తూ.. తమ దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవటం తమ రెండు దేశాల సంబంధాలకు ఆధారమని పేర్కొన్నారు. మాల్దీవుల దేశీయ వ్యవహారాల్లో చైనా ప్రభావాన్ని చూపదన్నారు.

ఇదిలా ఉంటే.. ఆ దేశ మాజీ అధ్యక్షుడిపై ఆయన విమర్శలు చేశారు. భారతదేశ అనుకూల దేశాధ్యక్షుడిగా ఆయనకు పేరుంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో భారతదేశ వ్యతిరేక నినాదంతో అధికారంలోకి వచ్చిన మాల్దీవుల కొత్త దేశాధ్యక్షుడు.. ‘ఒక కుర్చీలో నుంచి లేచి మరో కుర్చీలో కూర్చోవటానికి ఒక పరాయి దేశం నుంచి అనుమతి కోరేవారు. మేం చిన్న వాళ్లమే కావొచ్చు. కానీ అది మమ్మల్ని బెదిరించే లైసెన్సు మీకు ఇవ్వదు’ అంటూ తన ప్రకటనను పూర్తి చేశారు.

మొత్తంగా చూస్తే.. చైనా పర్యటనలో భారత్ తో వ్యవహరించే విషయంలో తీసుకున్న ఫీడ్ బ్యాక్ ఆధారంగానే ఆయనీ వ్యాఖ్యలు చేసి ఉంటారని భావిస్తున్నారు. దీనికి బలం చేకూరేలా తాజాగా చైనా వ్యాఖ్యలు ఉండటం గమనార్హం. మాల్దీవుల అంతర్గత వ్యవహారాల్లో ఏ దేశం జోక్యం చేసుకున్నా.. గట్టిగా వ్యతిరేకిస్తామని చైనా ప్రకటన చేసింది.