'ఆ మిత్రులు' ఏమయ్యారు? బాబును వాడుకుని వదిలేశారా?!
చంద్రబాబు ఉమ్మడి ఏపీ సహా.. విభజిత రాష్ట్రం ఏపీలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. ఆయన సాయం కోసం అర్థించిన చేతులు చాలానే ఉన్నాయి.
By: Tupaki Desk | 11 Sep 2023 8:29 AM GMTఔను.. ఆ మిత్రులు ఇప్పుడు ఏమయ్యారు? ఒకప్పుడు చంద్రబాబు కోసం, ఆయన అప్పాయింట్‌మెంట్ కోసం, ఆయన స్నేహం కోసం, సాయం కోసం వేచి చూసిన రాష్ట్రాల పాలకులు ఇప్పుడు కనీసం పెదవి కూడా విప్పక పోవడానికి కారణం ఏమిటి? ఇదీ.. ఇప్పుడు రాజకీయంగా జరుగుతున్న చర్చ. చంద్రబాబు ఉమ్మడి ఏపీ సహా.. విభజిత రాష్ట్రం ఏపీలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. ఆయన సాయం కోసం అర్థించిన చేతులు చాలానే ఉన్నాయి.
ఉదాహరణకు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, బిహార్ సీఎం నితీశ్ కుమార్, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(తెలంగాణ ఎన్నికల్లో పొత్తు కూడా పెట్టుకున్నారు) వంటి వారు.. అనేక సందర్భాల్లో చంద్రబాబు సాయం పొందారు. ఆయన దన్నుతో కేంద్రంపై యుద్ధం కూడా ప్రకటించారు. అంతేకాదు..వారు కోరినప్పుడు చంద్రబాబు కూడా అనేక రూపాల్లో సాయం చేశారు.
మమతా బెనర్జీ ప్రభుత్వంపై సీబీఐని కేంద్రంవినియోగించినప్పుడు రాత్రికి రాత్రికి కలకత్తా వెళ్లిన చంద్ర బాబు అక్కడ సీఎం మమతతో కలిసి ధర్నా చేశారు. కేంద్రంపైనా పోరాడారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు కూడా అదే రూపంలో సాయం చేశారు. ఇక, బిహార్ సీఎం నితీశ్ కుమార్‌కు కూడా అనేక సందర్భాల్లో సాయం చేశారు. అఖిలేష్ యాదవ్ అనేక సందర్భాల్లో చంద్రబాబు మార్గదర్శకుడని కొనియాడారు.
అలాంటి నాయకులు.. సహా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సైతం... ఇప్పుడు ఏమైనట్టు? చంద్రబాబు అరెస్టు, రిమాండ్ నేపథ్యంలో జాతీయ స్థాయిలో నాయకులు ఒక్కరంటే ఒక్కరు రియాక్ట్ కాలేదు. కనీసం..చంద్రబాబు అరెస్టును ఖండించిన పాపాన కూడా పోలేదు. మరి దీనిని బట్టి చంద్రబాబును వారు వాడుకుని వదిలేశారా? లేక.. ఈ అరెస్టులోనూ వారు రాజకీయ పిడకలు ఏరుకుంటున్నారా? అనేది ఆసక్తిగా మారింది. ఏదేమైనా కష్ట సమయంలో చంద్రబాబుకు జాతీయ మద్దతు కరువవడం చర్చకు దారితీసింది.