బాబుకు సుప్రీంలో గుడ్ న్యూస్... ఇక నుంచి రంగంలోకి?
ఇదే సమయంలో... ర్యాలీలు, రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనవచ్చని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా స్పష్టం చేసింది.
By: Tupaki Desk | 28 Nov 2023 11:16 AM GMTఏపీలో సంచలనంగా మారిన స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో ఈరోజు సుప్రీంలో కీలక పరిణామం జరిగింది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు మంజూరైన బెయిల్ ను రద్దు చేయాలంటూ ఆంధ్రప్రదేశ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (ఏపీ సీఐడీ) దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో ఈరోజు కీలక విచారణ జరిగింది.
అవును... స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. దీంతో... ఈ తీర్పుపై ఏపీ సీఐడీ సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఈ సమయంలో ఈ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీం కోర్టు... డిసెంబరు 8లోగా కౌంటర్ సమర్పించాలని చంద్రబాబుకు నోటీసులు జారీ చేసింది.
ఇదే సమయంలో తదుపరి విచారణ వరకు కేసు వివరాలు ఎక్కడా మాట్లాడవద్దని చంద్రబాబుకు సుప్రీంకోర్టు సూచించింది. ఇదే సమయంలో... ర్యాలీలు, రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనవచ్చని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా స్పష్టం చేసింది.
సీఐడీ దాఖలు చేసిన ఎస్.ఎల్.పీ. విచారణకు స్వీకరించిన ధర్మాసనం ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. సీఐడీ తరపున వాదించిన ముఖుల్ రోహిత్గీ ఈ కేసులో చంద్రబాబుకు బెయిల్ అంశంతో పాటు.. కండీషన్ల నుంచి మినహాయింపు ఇవ్వటం పై అభ్యంతరం వ్యక్తం చేసారు. దీంతో, సుప్రీం కోర్టు ఈ కేసును వచ్చే నెల 11వ తేదీకి వాయిదా వేసింది.
కాగా... ఏపీ హైకోర్టు ఈ నెల 20న చంద్రబాబుకు ఇచ్చిన సాధారణ బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు అవినీతికి పాల్పడి, ఆ నిధులను టీడీపీ ఖాతాలకు మళ్లించారనేందుకు సీఐడీ ఎలాంటి ఆధారాలూ సమర్పించలేదంటూ పూర్తిస్థాయి బెయిల్ ఇచ్చింది.
దీంతో దీన్ని సవాలు చేస్తూ సీఐడీ ఈ నెల 21న సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ వాదనల సందర్భంగా సుప్రీంకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసిందని తెలుస్తుంది. ఇందులో ప్రధానంగా 17ఏ పైనే చంద్రబాబుపై స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసు భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని అంటున్నారు!