వీడియో : సైనికుల్ని పంపి.. ఆయుధాలిచ్చి.. ఉక్రెయిన్ లో పారిపోతున్న ఉ.కొరియా
ఇదెలా సాధ్యం అంటే.. ఉత్తర కొరియా సైనికులు రష్యాకు సాయంగా ఉక్రెయిన్ లోకి వెళ్లడంతోనే.
By: Tupaki Desk | 24 Dec 2024 8:05 AM GMTప్రపంచంలో ప్రస్తుతం రెండు దేశాల గురించి చెప్పుకోవాలి.. ఉ అంటే ఉక్రెయిన్.. ఉ అంటే ఉత్తర కొరియా. ఒకటి యుద్ధ బాధిత దేశం.. మరొకటి యుద్ధ కాంక్షతో రగిలిపోయే దేశం. భౌగోళికంగా వీటికి ఒకదానికొకటి చాలా దూరం. కానీ, ఇప్పుడు యుద్ధంలో తలపడుతున్నాయి. ఇదెలా సాధ్యం అంటే.. ఉత్తర కొరియా సైనికులు రష్యాకు సాయంగా ఉక్రెయిన్ లోకి వెళ్లడంతోనే. ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది.
డ్రోన్లకు చిక్కకుండా..
పెద్ద సంఖ్యలో ఉత్తర కొరియా సైనికులు తమ దళాల చేతిలో హతం అయినట్లుగా ఇప్పటికే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ప్రకటించిన సంగతి తెలిసిందే. చాలామంది గాయపడినట్లుగా పేర్కొన్నారు. ఇలా చనిపోయినవారి ముఖాలను రష్యా సేనలు కాల్చివేసినట్లుగా ఉన్న ఫొటోలను జెలెన్ స్కీ విడుదల చేశారు. మరోవైపు ఉక్రెయిన్ డ్రోన్లను ఎదుర్కోలేక ఉత్తర కొరియా జవాన్లు పరుగులు పెట్టిన వీడియోలు బయటకు వస్తున్నాయి.
రష్యాలోని కుర్స్క్ ప్రాంతంపై ఆధిపత్యం కోసం కొన్నాళ్లుగా యుద్ధం సాగుతోంది. దీనిని గతంలో ఉక్రెయిన్ స్వాధీనం చేసుకుందనే కథనాలు వచ్చాయి. ఉత్తర కొరియా 12 వేల మంది సైనికులను పంపగా.. ఇక్కడ 3 గ్రామాల్లోనే దాదాపు 10వేల మంది ఉన్నారు. భాష సమస్య కారణంగా రష్యా-ఉత్తర కొరియా దళాల మధ్య సమన్వయం లోపించి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. తొలి వారాల్లోనే ప్రతి పదిమంది ఉత్తర కొరియా సైనికుల్లో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. కాగా, వీరిని ఉక్రెయిన్ కు చెందిన కమికేజ్ డ్రోన్లు వేటాడాయి. 3 రోజుల్లో 77 మందిని చంపేశాయి. ప్రత్యేక శిక్షణ అనంతరం వీరిని కదన రంగంలోకి దింపారు. తాజాగా వేలాది కొరియన్ సైనికులు చనిపోయి ఉండడమో లేదా గాయపడడమో జరిగిందని జెలెన్‌స్కీ వెల్లడించారు.
రష్యాకు 20 వేల కంటైనర్లలో ఆయుధాలు
రష్యాతో పోలిస్తే ఉత్తరకొరియా చాలా చిన్న దేశం. కానీ ప్రస్తుతం ఆ దేశమే రష్యాకు ఆయుధాలకు పెద్ద దిక్కు అయిందట. ఉత్తర కొరియా నియంత కిమ్ వందల కొద్దీ ఆయుధాల ఫ్యాక్టరీలను రాత్రింబవళ్లు నడిపించి ఆయుధాలను ఉత్పత్తి చేస్తున్నారట. 200 ఆయుధ ఫ్యాక్టరీలు పూర్తిస్థామర్థ్యంతో ఉత్పత్తిని వేగవంతం చేశాయిట హ్వాసంగ్-11 శ్రేణి బాలిస్టిక్ క్షిపణుల తయారీ కేంద్రాల్లో కొత్త పరికరాలు అమర్చి ఉత్పత్తిని పెంచినట్లు తెలుస్తోంది. మరో గమనార్హమైన విషయం ఏమంటే.. మొత్తం కార్యక్రమాన్ని అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ స్వయంగా పరిశీలిస్తున్నారట. 34 నెలలుగా సాగుతున్న యుద్ధంలో రష్యా భారీగా సైనికులను కోల్పోయింది. దీంతో బలగాల కొరత ఏర్పడింది. పుతిన్ కోరనప్పటికీ తమ సైనికులను పంపారట కిమ్ జోంగ్ ఉన్. పరిస్థితుల రీత్యా పుతిన్ ఓకే చెప్పారట. అయితే, ప్రతిగా తమకు టెక్నాలజీ ఇవ్వాలని ఉ.కొరియా కోరుతోందట.
20 వేల షిప్పింగ్ కంటైనర్లలో ఆయుధాలను తరలించినట్లు సమాచారం. వీటిలో దాదాపు 60 లక్షల శతఘ్ని గుండ్లు 122 ఎంఎం, 152 ఎంఎం రకాలున్నాయి. 100 హ్వాసంగ్-11 శ్రేణి బాలిస్టిక్ క్షిపణులను రష్యాకు తరలించినట్లు పేర్కొంది. మరోవైపు ఉత్తర కొరియా-రష్యాల మధ్య రైళ్ల రాకపోకలు రికార్డు స్థాయిలో పెరిగాయట. తుమాన్‌గాంగ్-హసన్ రైలు రాకపోకలు మూడు రెట్లు పెరిగాయి. రష్యా వాడుతున్న మందుగుండులో 60 ఉత్తర కొరియా తయారీనే.