Begin typing your search above and press return to search.

ఉక్రెయిన్ లోకి ఉత్తర కొరియా సైనికులు.. మూడో ప్రపంచ యుద్దం మాట..

రెండున్నరేళ్లుగా జరుగుతున్న యుద్ధంలో రష్యా ఇప్పటికే పాశ్చాత్యం ప్రపంచం వెలివేసింది.

By:  Tupaki Desk   |   18 Oct 2024 8:00 AM GMT
ఉక్రెయిన్ లోకి ఉత్తర కొరియా సైనికులు.. మూడో ప్రపంచ యుద్దం మాట..
X

ప్రస్తుతం ప్రపంచంలో రెండు యుద్ధాలు జరుగుతున్నాయి. వీటికి అంతం ఎప్పుడు తెలియని పరిస్థితి. అయితే, ఒకటి మాత్రం స్పష్టం. ఇందులో విజేతలు ఎవరూ ఉండరని. మరీ ముఖ్యంగా ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో. రెండున్నరేళ్లుగా జరుగుతున్న యుద్ధంలో రష్యా ఇప్పటికే పాశ్చాత్యం ప్రపంచం వెలివేసింది. ఉక్రెయిన్ ఆర్థికంగా, వసతుల పరంగా తీవ్రంగా నష్టపోయింది. ఇక ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ఎటువైపు వెళ్తుందో చెప్పడం కష్టమే.

రష్యా వెంట ఉన్నది ఆ దేశాలే

ఉక్రెయిన్ పై రష్యా సాగిస్తున్న యుద్ధంలో రష్యా వైపు నిలిచింది కొన్నే దేశాలు.. వీటిలో మొదటిది చైనా. రెండోది ఉత్తర కొరియా. మూడోది ఇరాన్ . మిగతా దేశాలు రష్యా పక్షం వహించినా, వాటిని పెద్దగా పరిగణించాల్సిన పనిలేదు. ఇక రష్యాకు మద్దతుగా ఉక్రెయిన్ లో బెలారస్ తదితర దేశాలకు చెందిన సైనికులు పోరాడారు. అంతెందుకు..? భారతీయులను కూడా ఉద్యోగాల పేరిట తీసుకెళ్లి రష్యా సైన్యంలో పని చేయించుకున్నారు.

ఆ దేశం నుంచి 10 వేలమంది..

ఉక్రెయిన్ రెండు రోజుల్లో చుట్టేస్తామన్న రష్యా రెండున్నరేళ్లుగా యుద్ధం సాగిస్తోంది. వేలాదిమంది సైనికులను కోల్పోయిం. అందుకే ఇతర దేశాల వారిని తీసుకుంటోంది. బలవంతంగా అయినా ఇతర పద్ధతుల్లో అయినా రష్యా తరఫున కొందరు ఇతర దేశాల సైనికులు పోరాడుతున్నారు. కాగా, ఇదే విషయంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ సంచలన ఆరోపణలు చేశారు. ఉత్తర కొరియాకు చెందిన 10 వేల మంది సైనికులు రష్యా తరఫున తమ దేశంలో యుద్ధంలో పాల్గొనేందుకు వస్తున్నారని నాటో ప్రధాన కార్యాలయంలో వ్యాఖ్యానించారు. వీరిలో వ్యూహాత్మక సిబ్బంది, అధికారులు కూడా ఉన్నారని.. చెప్పారు. రష్యా తరఫున ఉక్రెయిన్ లో యుద్ధంలో పాల్గొనేందుకు 10వేల మంది ఉత్తర కొరియా సైనికులు వారి స్వదేశంలో శిక్షణ పొందుతున్నారని తెలిపారు.

మూడో దేశం పాల్గొంటే మూడో ప్రపంచ యుద్ధం

రష్యాతో జరుగుతున్న తమ యుద్ధంలో మూడో దేశం పాల్గొనడం ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందని జెలెన్ స్కీ హెచ్చరించారు. జెలెన్ స్కీ నోటి నుంచి మూడో ప్రపంచ యుద్ధం మాట రావడం బహుశా ఇదే తొలిసారి కావొచ్చేమో. ఇక యూరోపియన్ యూనియన్ నాయకులు, నాటో రక్షణ మంత్రులతో బ్రస్సెల్స్‌ లో సమావేశమైన జెలెన్ స్కీ.. తన ప్రణాళికను అమలుచేస్తే ఏడాదిలోగా యుద్ధం ముగుస్తుందని కూడా చెప్పడం గమనార్హం.

మరి నాటో సభ్యత్వం ఎప్పుడు?

అసలు ఉక్రెయిన్ పై రష్యా సైనిక చర్య అంటూ యుద్ధానికి దిగడానికి మూల కారణం నాటో సభ్యత్వమే. కానీ, రెండున్నరేళ్లయినా ఇది తేలలేదు. ఉక్రెయిన్ కంటే ముందే ఫిన్లాండ్ గత ఏడాది ఏప్రిల్ లో నాటోలో చేరింది. కానీ.. ఉక్రెయిన్ మాత్రం ఇంకా ఎదురుచూస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో జెలెన్ స్కీ మాట్లాడుతూ నాటోలో సభ్యత్వానికి ఉక్రెయిన్‌ కు అర్హతలు ఉన్నాయని పేర్కొన్నారు. కాగా, జెలెన్‌ స్కీ చెప్పినట్లు యుద్ధంలో ఉత్తర కొరియా పాల్గొంటున్నట్లు ఎటువంటి ఆధారాలు లేవని నాటో సెక్రటరీ జనరల్ మార్క్‌ రూట్టే స్పష్టం చేశారు. రష్యాకు ఉత్తర కొరియా ఆయుధాలను సరఫరా చేస్తోందని ఆరోపించారు. నాటోలో ఉక్రెయిన్‌ ను చేర్చుకుంటామని, అయితే అదెప్పుడో చెప్పలేమని పునరుద్ఘాటించారు. నాటోలని 32 దేశాలు రష్యాకు వ్యతిరేకంగా ఉక్రెయిన్ విజయానికి సాయం చేస్తాయని కంటితుడుపు మాటలు చెప్పారు.