కాలానికి గాలం వేస్తోన్న కిమ్.. ఇంప్రెషన్ మార్చాలనా?
అవును... గతంలో కిమ్ గురించి మీడియాలో వచ్చే కథనాలు అతనిలోని నియంతను కళ్లకు కట్టినట్లు చూపించేవి.
By: Tupaki Desk | 11 Aug 2024 3:30 PM GMTఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదనే చెప్పాలి. అతడి నియంతృత్వ పాలన గురించి కథలు కథలుగా చెబుతుంటారు. తన దేశంలోని ప్రజలు ఏమి తినాలి, ఏమి వినాలి, ఏమి చూడాలి, ఏమి ధరించాలితో పాటు ఏ హెయిర్ స్టైల్ మెయింటైన్ చేయాలో కూడా కిమ్ నిర్ణయిస్తారు. ఇక ఇంటర్నెట్, సోషల్ మీడియా అనే విషయాలు ఆ దేశ ప్రజలకు అందని ద్రాక్షలు!
ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఈ జనరేషన్ కు కూడా నియంతలు ఎలా ఉంటారనే విషయాన్ని వీలైనంత స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు కిమ్. ఈ నేపథ్యంలో తాజాగా కిమ్ తనకున్న ఆ పేరును మార్చుకోవాలని, తనలోనూ మంచి పాలకుడు ఉన్నాడని చూపించుకోవాలని పరితపిస్తున్నట్లున్నాడనే చర్చ ఇప్పుడు ఇంటర్నేషనల్ మీడియా సర్కిల్స్ లో మొదలైందని అంటున్నారు.
అవును... గతంలో కిమ్ గురించి మీడియాలో వచ్చే కథనాలు అతనిలోని నియంతను కళ్లకు కట్టినట్లు చూపించేవి. సొంత మామను కూడా కిమ్ చంపించాడని.. తనకు అడ్డు తిరగనవసరం లేదు, అలాంటి ఆలోచనలు చేస్తున్నారని అనిపించినా చాలు వాళ్లకు ఆయుస్సు మూడినట్లేనని.. పైగా, ఆకలితో ఉన్న కుక్కలకు వీరిని ఆహారంగా వేసే స్థాయి ఆలోచనలు కిమ్ సొంతం అని చెబుతుంటారు.
కట్ చేస్తే... ఇటీవల గత కొన్ని రోజులుగా మీడియాలో కిమ్ గురించి వస్తోన్న కథనాలు అందుకు పూర్తి విభిన్నంగా ఉంటున్నాయి. ప్రజల కష్ట సుఖాల గురించి కిమ్ తెగ ఆలొచిస్తున్నాడని.. ఇటీవల వరదలు వచ్చి దేశ ప్రజలు ఇబ్బందులు పడుతుంటే హెలీకాప్టర్ లో కాకుండా నడుములోతు నీళ్లలో కారులో ప్రయాణిస్తూ ప్రజల పరిస్థితిని తెలుసుకునే ప్రయత్నం చేశారని.. దగ్గరుండి సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్నారని వార్తలు వచ్చాయి.
ఇందులో భాగంగా వరద నీటిలో ఉన్న బాధితుల్ని పడవల్లో వెళ్లి పరామర్శించడం, చిన్న పిల్లలకు ఆహారం అందించడం వంటి పనులు చేశారు. వీటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. దీంతో... తనను తాను ఓ మానవత్వం ఉన్న మనిషిగా, ప్రజా శ్రేయస్సు కోరే పాలకుడిగా అభివర్ణించాలనే ప్రయత్నం కిమ్ సీరియస్ గా చేస్తున్నారని అంటున్నారు.
అంతర్జాతీయ వ్యవహారాలు చూసే జర్నలిస్టులు ఇటీవల కాలంలో ఉత్తర కొరియా నుంచి వస్తున్న ఈ వ్యవహారాలకు ఆశ్చర్యపోతున్నారని అంటున్నారు. ఈ సందర్భంగా... ‘మీరు మారి పోయారు కిమ్.. మీరు మారి పోయారు’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
మరోపక్క... తాజాగా దక్షిణ కొరియాపై మరోసారి చెత్త బెలూన్లు తాజాగా వచ్చి పడ్డాయి. దీంతో.. తన దేశం వరకూ మంచి వాడినే కానీ, దాయాదీ దేశం విషయంలో మాత్రం కాదని కూడా కిమ్ చెప్పే ప్రయత్నం చేస్తున్నాట్లున్నారనే చర్చా మొదలైంది. ఇదే క్రమంలో... కొన్ని రోజుల క్రితం తన సొంత నానమ్మ బంగ్లాపైకి బుల్డోజర్లు పంపించి, నామ రూపాలు లేకుండా భూస్థాపితం చేసిన సంగతి తెలిసిందే.