Begin typing your search above and press return to search.

అధ్యక్షుడి కార్యాలయం పైకి చెత్త బెలూన్లు.. ఫోటోలు వైరల్!

ఉత్తర కొరియా, దక్షిణ కొరియాల మధ్య నిత్యం ఉద్రిక్త వాతావరణమే ఉంటుందని చెబుతారు.

By:  Tupaki Desk   |   24 July 2024 7:17 AM GMT
అధ్యక్షుడి కార్యాలయం పైకి చెత్త బెలూన్లు.. ఫోటోలు వైరల్!
X

ఉత్తర కొరియా, దక్షిణ కొరియాల మధ్య నిత్యం ఉద్రిక్త వాతావరణమే ఉంటుందని చెబుతారు. ఈ నేపథ్యంలోనే కొంతకాలంగా ఈ రెండు దేశాల మధ్య "చెత్త బెలూన్ల" ఘర్షణ జరుగుతోంది. తమ ప్రాంతంలోని చెత్తను, ఎలక్ట్రికల్ వేస్ట్ ను బెలూన్స్ లలో నింపి వాటిని ప్రత్యర్థి ప్రాంతం వైపు ఎగరేస్తుంటారు! ఈ నేపథ్యంలో కిమ్ సర్కార్ ఓ అడుగు ముందుకు వేసింది.


అవును.. దాయాదీ దేశాలైన ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య గత కొంతకాలంగా జరుగుతున్న చెత్త బెలూన్ల ఘర్షణ గురించి తెలిసిందే. దక్షిణకొరియా కార్యకర్తలు తమ భూభాగంలో పాంప్లెట్లు పంచుతున్నందుకు ప్రతిగా ఉత్తర కొరియా ఇలా చెత్త బెలూన్లను పంపుతుంటుందని అంటుంటారు. ఉ.కొ.వెర్షన్ కూడా ఇదే అని చెబుతుంటారు.


ఈ క్రమంలోనే గత రెండు మూడు నెలల వ్యవధిలో సుమారు 2వేల బెలూన్లు పంపినట్లు చెబుతున్నారు. ఈ బెలూన్స్ లో వాడిపడేసిన ప్లాస్టిక్ బాటిళ్లు, పాడైన షూలు, కాగితాలతో కూడిన చెత్త తో పటు కొన్ని బెలూన్ లలో మురుగు మట్టి, జంతు విసర్జన కూడా ఉంటుందని చెబుతుంటారు.

సాధారణంగా వీటి దాడి బోర్డర్, బోర్డర్ ప్రాంతంలోని కొంత జనావాస ప్రాంతం, రోడ్ల వరకూ పరిమితమయేది! అయితే తాజాగా ఏకంగా దక్షిణ కొరియా అధ్యక్షుడి కార్యాలయంపైనే ఉత్తర కొరియా చెత్త బెలూన్లను జారవిడిచింది. అయితే... వీటివల్ల ఎలాంటి ప్రమాదమూ జరగలేదని స్థానిక మీడియా వెల్లడించింది.

ఇందులో భాగంగా... తాజాగా అధ్యక్షుడి ఆఫీస్ వద్ద పడిన బెలూన్ల వల్ల ఎలాంటి ప్రమాదం జరగలేదని.. ముందు జాగ్రత్త చర్యగా పీపీఈ కిట్లు ధరించిన సిబ్బంది ఆ చెత్తను తొలగించారని.. అవి సియోల్ ఉత్తరం వైపు ఎగురుతున్నాయని.. అందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని దక్షిణ కొరియా జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఓ ప్రకటనలో హెచ్చరించారు.

మరోపక్క కిమ్ చేస్తున్న ఈ కవ్వింపు చర్యలపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఇలాంటి చర్యలు అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమేనని, తమ ప్రజల భద్రతకు ముప్పు కలిగించేవేనని దక్షిణ కొరియా సైన్యం ఇప్పటికే వెల్లడించింది. వీటివల్ల ఎదురయ్యే పర్యవసానాలన్నింటికీ కిమ్ దే బాధ్యత అని పేర్కొంది.