బొత్స మేనల్లుడికి సీటు లేదా...!?
విజయనగరం జిల్లా వైసీపీ ప్రెసిడెంట్, జిల్లా పరిషత్ చైర్మన్ అయిన మజ్జి శ్రీనివాసరావుకు ఈసారి ఎన్నికల్లో పోటీ చేసే చాన్స్ లేదా అన్న చర్చ ఆ పార్టీలో సాగుతోంది.
By: Tupaki Desk | 8 March 2024 2:30 AM GMTవిజయనగరం జిల్లా వైసీపీ ప్రెసిడెంట్, జిల్లా పరిషత్ చైర్మన్ అయిన మజ్జి శ్రీనివాసరావుకు ఈసారి ఎన్నికల్లో పోటీ చేసే చాన్స్ లేదా అన్న చర్చ ఆ పార్టీలో సాగుతోంది. ఆయనకు జగన్ 2019లోనే టికెట్ ఇస్తాను అని చెప్పినా మజ్జి శ్రీను నో అని చెప్పి పార్టీ కోసం పనిచేశారు. ఈసారి ఆయన కచ్చితంగా పోటీ చేస్తారు అని అసెంబ్లీ నుంచి గెలిచి వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే మంత్రి కూడా అవుతారు అని ఆయన అనుచరులు చాలా కాలంగా చెప్పుకుంటూ వస్తున్నారు.
ఇంతకీ ఈ మజ్జి శ్రీనివాసరావు ఎవరు అంటే సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ మేనల్లుడు. బొత్స రాష్ట్ర స్థాయిలో బిజీగా ఉంటే జిల్లా రాజకీయాలను అన్నీ ఆయన చూస్తూ చక్కబెడుతూంటారు. ఒక విధంగా వైసీపీ జిల్లా రాజకీయాల మీద పూర్తి పట్టుని సాధించారు. ఈసారి ఆయనకు అసెంబ్లీ టికెట్ ఇవ్వాలని వైసీపీ హై కమాండ్ భావించినా కూడా బొత్స వర్గం వైపు నుంచి వ్యతిరేకత వచ్చిందని ప్రచారం సాగింది.
దాంతో ఆయనను ఎంపీగా విజయనగరం నుంచి పంపించాలనుకున్నారు. అయితే బొత్స తాను చీపురుపల్లి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ ఎంపీగా తన సతీమణి బొత్స ఝాన్సీని విశాఖ నుంచి పోటీ చేయిస్తున్నారు. దాంతో ఒకే కుటుంబం నుంచి ఇద్దరు ఎంపీలు అన్న ఆలోచనతో ఇపుడు విజయనగరం ఎంపీ నుంచి మజ్జి శ్రీనుని తప్పించారు అని అంటున్నారు.
పార్టీ గెలుపు బాధ్యతలు చూసుకోవాలని ఆయనకు చెప్పారని అంటున్నారు. అందుకే ఆయనకు శ్రీకాకుళం విజయనగరం జిల్లల వైసీపీ డిప్యూటీ రీజనల్ కో ఆర్డినేటర్ పదవిని కూడా ఇచ్చారు అని అంటున్నారు. అందరూ ఎన్నికల్లో పోటీ చేస్తే పార్టీ కోసం పనిచేసేవారు వ్యూహ రచన చేసే వారు ఉండరని భావించి పార్టీ ఆయనకు కీలకమైన బాధ్యతలు అప్పగించింది అని అంటున్నారు.
ఇక వైసీపీ మళ్లీ గెలిస్తే మజ్జి శ్రీనుకు ఎమ్మెల్సీ పదవి ఇస్తారని అంటున్నారు. మరో వైపు చూస్తే సిట్టింగ్ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ ఈసారి అసెంబ్లీకి పోటీ చేయాలని అనుకున్నారు. అయితే ఆయనకే మరోసారి విజయనగరం ఎంపీగా పోటీ బాధ్యతలు అప్పగిస్తారు అని అంటున్నారు.
తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన చంద్రశేఖర్ సామాజిక వర్గ సమీకరణల పరంగా సరైన అభ్యర్ధి. అంతే కాదు అయిదేళ్ల పదవీ కాలంలో ఆయన వివాదాలు లేకుండా వ్యవహరించారు. ఇక ఎంపీగా ఆయనకు అన్ని నియోజకవర్గాలతో పరిచయాలు ఉన్నాయి. దాంతో ఆయన పట్ల వ్యతిరేకత కూడా లేదు కాబట్టి ఎంపీగా మరోసారి చాన్స్ ఇస్తున్నారు అని అంటున్నారు. మొత్తానికి చూసుకుంటే బొత్స మేనల్లుడికి మాత్రం ఈ సారి ఎన్నికలలో పోటీ చేసే అవకాశం లేదు అన్నది వినిపిస్తున్న మాట.