Begin typing your search above and press return to search.

రోజాని పార్టీ ఎందుకు ఆదుకోలేదు...?

వైసీపీలో ఫైర్ బ్రాండ్ గా మంత్రి ఆర్కే రోజా ఉన్నారు. ఆమె అటు టీడీపీని అయినా ఇటు జనసేనను అయినా మీడియా ముందుకు వచ్చి గట్టిగానే విమర్శలు చేస్తారు.

By:  Tupaki Desk   |   5 Oct 2023 1:30 PM GMT
రోజాని పార్టీ ఎందుకు ఆదుకోలేదు...?
X

వైసీపీలో ఫైర్ బ్రాండ్ గా మంత్రి ఆర్కే రోజా ఉన్నారు. ఆమె అటు టీడీపీని అయినా ఇటు జనసేనను అయినా మీడియా ముందుకు వచ్చి గట్టిగానే విమర్శలు చేస్తారు. చంద్రబాబు పవన్ ఎవరైనా సరే ఆమె ధాటీగా మీడియా ముందుకొచ్చి మాట్లాడుతారు. ఆమె చేసే కామెంట్స్ మంట పుట్టించేలా ఉంటాయి.

ఒక విధంగా మొత్తం పాతిక మంది మంత్రులలో తరచూ అటు ప్రభుత్వాన్ని కాసుకొచ్చే రోల్ ని రోజా ప్లే చేస్తూంటారు. చాలా మంది మంత్రులు ఉన్నా ఎన్నికల ఏడాదిలో వైసీపీకి అండగా ఉంటున్న పరిస్థితులు అయితే లేవు. మరి అంతలా రోజా తన నోటి ధాటితో వైసీపీ ప్రభుత్వాన్ని కాసుకొస్తున్నారు.

రోజా ఇపుడే కాదు, ప్రతిపక్షంలో ఉన్నపుడు కూడా వైసీపీ తరఫున వకాలత్ పుచ్చుకుని గట్టిగానే నాటి టీడీపీ ప్రభుత్వాన్ని విమర్శించారు. అందుకు గానూ ఆమె ఒక ఏడాది పాటు సభ నుంచి సస్పెన్షన్ కూడా గురి అయ్యారు. అలా ఆమె కోర్టుల చుట్టూ కూడా తిరిగిన చరిత్ర కూడా ఉంది.

ఒక విధంగా టీడీపీ మినిస్టర్ రోజాను టార్గెట్ చేసింది. అయినా సరే ఆమె చంద్రబాబుని కానీ లోకేష్ ని కానీ ఎక్కడా వదలడంలేదు, వారి మీద డైలీ తీవ్రంగానే కామెంట్స్ చేస్తూ ఉంటారు. ఇక వైసీపీ అధికారంలోకి వచ్చాక మొదటి దఫా రోజాకు మంత్రి పదవి దక్కుతుంది అని అంతా అనుకున్నారు. అయితే సీఎం జగన్ పూర్తి మద్దతుతోనే ఆమె రెండవసారి విస్తరణలో మంత్రి పదవిని దక్కించుకున్నారు. ఆ మంత్రి పదవి అందుకునేందుకు ఆమె ఎన్నో అడ్డంకులు కూడా ఎదుర్కొన్నారు అని ప్రచారంలో ఉన్న మాట.

మినిస్టర్ అయ్యాక రోజా ప్రతీ సందర్భంలోనూ పవన్ కళ్యాణ్ ని, అలాగే చంద్రబాబుని, లోకేష్ ని మొత్తం టీడీపీని ఎక్కడా స్పేర్ చేయకుండా తన వాడి వేడి మాటల తూటాలతో హాట్ కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. అలా ప్రభుత్వం వాయిస్ ని పార్టీ వాయిస్ ని వినిపించి బలోపేతం చేసే పనిలో ఆమె ఉన్నారు.

ఇలాంటి వేళ ఆమె మీద బూతుల దండకం అందుకున్నారు టీడీపీకి చెందిన మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి. బండారు సభ్య సమాజం తలెత్తుకోలేని విధంగా దారుణాతి దారుణంగా విమర్శలు చేశారు. ఆమె మీద ఇప్పటిదాకా ఎవరూ అనని విధంగా తిట్ల పురాణం అందుకున్నారు. ఇంతలా రోజాను అవమానించినా వైసీపీలో మహిళా మంత్రులు కానీ మహిళా ఎమ్మెల్యేలు కానీ నోరు విప్పకపోవడమే ఇక్కడ చర్చగా ముందుకు వస్తోంది.

వైసీపీలో మహిళా శక్తి లేదా అంటే గ్రామ పంచాయతీ నుంచి ఎంపీ దాకా చాలా మంది ఉన్నారు. కార్పోరేటర్ల నుంచి మేయర్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్స్ దాకా ఉన్నారు. అదే విధంగా కీలకమైన బాధ్యతతో ఉన్న వారూ ఉన్నారు. మరి ఇంత మంది మహిళలు వైసీపీలో కీలక స్థానంలో ఉంటే వారు ఎవరూ నోరు విప్పకపోవడం ఏంటి అన్నదే ఇపుడు ఒక ప్రశ్నగా కనిపిస్తోంది.

ఒక విధంగా చూస్తే పార్టీ కోసం రోజా కష్టపడుతున్నారు. విపక్షాల విమర్శలను ధీటుగా ఎదుర్కొంటున్నారు. మరి ఆమెను ప్రతిపక్షాలు విమర్శలు చేస్తూంటే సొంత పార్టీ వారు అందునా మహిళా నాయకులు అండగా ఉండాల్సిన సందర్భం ఇదే కదా అని అంటున్నారు. రోజా అభిమానులు అయితే వైసీపీలో రోజాకు తగినంత మద్దతు లభించలేదని వాపోతున్నారు.

ఆమెది ఒంటరి పోరాటం అయింది అని అంటున్నారు. చాలా మంది మంత్రులు మనకెందుకు అన్నట్లుగా పార్టీని ప్రభుత్వాన్ని విపక్షాలు విమర్శలు చేస్తున్నా పట్టించుకోవడంలేదు. తన దోవలో తాము పోతున్నారు. నిజానికి ఎన్నికల ఏడాదిలోకి వచ్చేశాక డైలాగ్ వార్ స్టార్ట్ అయిపోయాకా విపక్షాలు అన్నీ కట్టకట్టుకుని ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నపుడు దాన్ని డిఫెండ్ చేసుకుంటూ సమర్ధంగా మీడియా ముఖంగా జవాబులు చెప్పాల్సిన బాధ్యత మంత్రుల మీద కీలక నేతల మీద ఉంది.

వైసీపీలో చూస్తే అది పెద్ద లోటుగా కనిపిస్తోంది. ఒక వైపు టీడీపీ పద్ధతి ప్రకారం సోషల్ మీడియా నుంచి మెయిన్ స్ట్రీం మీడియా దాకా విమర్శలు చేస్తూ వస్తోంది. అలాగే ఆ పార్టీకి చెందిన గ్రామ నేత నుంచి చంద్రబాబు వరకూ అంతా ప్రతీ రోజూ ఏదో ఒక విషయం మీద మాట్లాడుతూనే ఉంటారు. ఇక జనసేన నుంచి కూడా అదే తీరున విమర్శల జోరు పెరిగింది. వామపక్షాలు కాంగ్రెస్, ఇతర పార్టీల సంగతి సరే సరి, ఏపీ బీజేపీ నేతలు కూడా ఎక్కువగానే ఈ మధ్య మాట్లాడుతున్నారు.

మరి ఇంత మందికి ప్రభుత్వం నడుపుతున్న వారు సమాధానం చెప్పకపోతే వారు చెప్పినదే జనాలకు చేరిపోతుంది. అలాగే ప్రభుత్వ పెద్దల మీద మంత్రుల మీద ఆరోపణలు చేసినపుడు కూడా తిప్పికొట్టాల్సిన బాధ్యత ఉంది. కానీ వైసీపీలో ఒక స్తబ్దతతో కూడినా వాతావరణం ఉంది. ఒక అంబటి రాంబాబు, ఒక జోగి రమేష్, ఒక ఆర్కే రోజా లేకపోతే పార్టీలో ఒక పేర్ని నాని, ఒక కొడాలి నాని ఇలా వేళ్ళ మీద లెక్క పెట్టే వారే మాట్లాడుతూ ఉంటారు.

ఇక వీరినే విపక్షాలు కూడా గట్టిగా టార్గెట్ చేస్తూ వస్తున్నాయి. మిగిలిన మంత్రులు నాయకులు అంతా మౌనమే భాష అన్నట్లుగా ఉంటున్నారు. వారికి విపక్షాలతో పేచీ పూచీ లేదు. ఒక విధంగా సేఫ్ గేమ్ పాలిటిక్స్ చేస్తున్నారు. మరి అన్నింటికీ తెగించి పార్టీ కోసం ప్రభుత్వం కోసం ముందుకు వచ్చే రోజా లాంటి వారికి కూడా అనుకున్న దన్ను మద్దతు కీలకమైన సందర్భాలలో సైతం ఇవ్వకపోతే వైసీపీ నుంచి ఇక మీదట నోరు తెరచేవారు ఎవరైనా ఉంటారా అన్న ప్రశ్న తలెత్తుతోంది. అధినాయకత్వం కూడా పార్టీలో ఎవరు ఏమిటి అన్నది అంచనా వేయాల్సిన సమయం కూడా ఇదే అంటున్నారు