పిల్లలకు ఇంటర్-సెక్స్ సర్జరీ... కేంద్రానికి సుప్రీం నోటీసులు!
ఈ అంశంలో అభిప్రాయం తెలపాలంటూ కేంద్రం, అడిషినల్ సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.
By: Tupaki Desk | 8 April 2024 12:10 PM GMTపిల్లలకు ఇంటర్-సెక్స్ సర్జరీని నిషేధించాలని.. ఇంటర్-సెక్స్ పిల్లల హక్కులను గుర్తిస్త్గూ కేంద్రచట్టం ఆవశ్యకతను లేవనెత్తుతూ సోమవారం సుప్రీకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఇందులో భాగంగా... పిల్లలకు మైనారిటీ తీరి మేజర్లు అయ్యేవరకూ ఇంటర్-సెక్స్ పిల్లలకు చేసే సెక్స్ రీ అసైన్మెంట్ సర్జరీలను అరికట్టడానికి ఆదేశాలు ఇవ్వాలని ఆ పిల్ లో కోరారు.
ఈ పిల్ లో పిటిషనర్ లేవనెత్తిన కీలక ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే... అనేక రాష్ట్రాల్లో శిశువుల తల్లితండ్రుల సమ్మతితోనే లింగ నిర్ధారణ శస్త్రచికిత్సలు జరుగుతున్నాయని చెప్పడం! ఈ నేపథ్యంలో... కేవలం తమిళనాడు రాష్ట్రంలో పిల్లలకు సమాచారం ఇచ్చే వయసు వచ్చే వరకూ ఇటువంటి శస్త్రచికిత్సలను మద్రాసు హైకోర్టు నిషేదించిన విషయాన్ని గుర్తు చేశారు.
పిల్లల ప్రమేయం లేకుండా వారిని మగ లేదా ఆడగా మార్చడానికి ఆపరేషన్లు చేయడం శిక్షార్హమని పిటిషనర్ పేర్కొన్నారు. ఇలా పిల్లలకు ఇంటర్ సెక్స్ సర్జరీలు నిషేదించాలంటూ దాఖలైన పిటిషన్ ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ అంశంలో అభిప్రాయం తెలపాలంటూ కేంద్రం, అడిషినల్ సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.
ఇదే క్రమంలో... సమ్మతించలేని చిన్న పిల్లలపై ఈ శస్త్రచికిత్సల మానసిక ప్రభావం గురించి ఇంటర్ సెక్స్ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో... 2015లో ఇంటర్ సెక్స్ పిల్లలపై అనవసరమైన శస్త్రచికిత్సలను నిషేధించిన మొదటి దేశం మాల్టా కాగా... జర్మనీ, గ్రీస్, ఐస్ లాండ్, స్పెయిన్, పోర్చుగల్ తో సహా అనేక ఇతర దేశాలు తదుపరి సంవత్సరాల్లో దీనిని అనుసరించాయి.
ఇదే విషయంపై గతంలో స్పందించిన ఐక్యరాజ్య సమితి... ప్రపంచవ్యాప్తంగా సుమారుఇ 1.7 శాతం మంది పిల్లలు మగ, ఆడ అనే సాధారణ నిర్వచనాలకు సరిపోని లింగ లక్షణాలతో జన్మించారని తెలిపింది. ఇంటర్ సెక్స్ పిల్లలకు పదేపదే శస్త్రచికిత్సలు, చికిత్స చేయడం ద్వారా శాశ్వత వంధ్యత్వం, జీవితకాల నొప్పి, లైంగిక అనుభూతిని కోల్పోవడం, మానసిక బాధలకు కారణమవుతాయని వెల్లడించింది!