జోగయ్య పిల్ పై జగన్ కు నోటీసులు... ట్రిపుల్ ఆర్ పిల్ "నాట్ బిఫోర్ మీ"!
ఆస్తుల కేసులకు సంబంధించి హరిరామ జోగయ్య తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 8 Nov 2023 6:45 AMప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో కేసులు, పిటిషన్లు, విచారణలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే ఏపీ టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టై ప్రస్తుతం మధ్యంతర బెయిల్ పై ఉన్న సంగతి తెలిసిందే. మరోపక్క వరుసగా పలు కేసులు ఇప్పటికే నమోదై ఉన్నాయి. ఇదే సమయంలో బేగంపేట టు జూబ్లీహిల్స్ ర్యాలీకి సంబంధించి రెండు కేసులు తెలంగాణలో నమోదయ్యాయి! ఈ నేపథ్యంలో తాజాగా జగన్ కు హైకోర్టు నోటీసులు ఇచ్చింది!
అవును... ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆస్తుల కేసులకు సంబంధించి హరిరామ జోగయ్య తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... 2024 అసెంబ్లీ ఎన్నికల లోపు జగన్ ఆస్తుల కేసులు తేల్చేలా ఆదేశాలు ఇవ్వాలని ఆ పిటిషన్ లో పేర్కొన్నారు.
ఈ క్రమంలో పిల్ గా పరిగణించేందుకు రిజిస్ట్రీ పేర్కొన్న అభ్యంతరాలపై విచారణ జరిగింది. ఈ క్రమంలో జోగయ్య తరపు న్యాయవాది పోలిశెట్టి రాధాకృష్ణ వాదనలతో తెలంగాణ హైకోర్టు ఏకీభవించింది. ఇందులో భాగంగా ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా పరిగణించేందుకు న్యాయస్థానం అంగీకారం తెలిపింది. ఇదే సమయలో... హరిరామజోగయ్య పిల్ కు నెంబరు కేటాయించాలని రిజిస్ట్రీకి హైకోర్టు ఆదేశించింది.
ఈ పిటిషన్ ను జస్టీస్ అలోక్ ఆరాధే, జస్టీస్ ఎన్.వి. శ్రావణ్ కుమార్ ధర్మాసనం విచారించింది. ఈ నేపథ్యంలో... ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, సీబీఐ, సీబీఐ కోర్టుకు తెలంగాణ హైకోర్టు నోటీసులు పంపించింది.
కాగా... జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ కోర్టులో కేసుల విచారణ వేగంగా పూర్తయ్యేలా ఆదేశించాలంటూ ఇటీవల హరిరామజోగయ్య పిల్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. 2024లో జరిగే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లోపు ఈ కేసులను తేల్చేలా ఆదేశాలివ్వాలని ఆయన పేర్కొన్నారు. ఈ సమయంలో ఆ పిల్ లోని కొన్ని సవరణల అనంతరం కోర్టు ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించింది.
ఏపీ హైకోర్టులో రఘురామ పిల్... “నాట్ బిఫోర్ మీ”!
ఆ సంగతి అలా ఉంటే... మరోపక్క ఏపీ హైకోర్టులో వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిల్ పై నేడు విచారణ జరిగింది. సీఎం జగన్.. ఆయన బందువులకు, వివిధ కంపెనీలకు రూ.కోట్లలో లబ్ధి చేకూరేలా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుందని, ఆ పాలసీలపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని కోరుతూ రఘురామ కృష్ణంరాజు పిల్ వేశారు. అయితే... దీనిపై "నాట్ బిఫోర్ మీ" అంటూ విచారణ నుంచి జస్టిస్ రఘునందనరావు తప్పుకొన్నారు. ఈ నేపథ్యంలో ఈ పిల్ వేరే బెంచ్ వద్ద విచారణకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని సీజే బెంచ్ రిజిస్ట్రీని ఆదేశించింది!