Begin typing your search above and press return to search.

తెలంగాణ మంత్రి.. ఏపీలో కాంట్రాక్టులు.. సంస్థకు పొరుగు సర్కారు నోటీసులు!

పనులు దక్కించుకుని ఏడాది దాటినా ఇంకా మొదలు పెట్టకపోవడంతో ఈ చర్యకు దిగింది

By:  Tupaki Desk   |   31 July 2024 7:11 AM GMT
తెలంగాణ మంత్రి.. ఏపీలో కాంట్రాక్టులు.. సంస్థకు పొరుగు సర్కారు నోటీసులు!
X

తెలంగాణకు చెందిన మంత్రి కాంట్రాక్టు సంస్థకు ఏపీ ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. పనులు దక్కించుకుని ఏడాది దాటినా ఇంకా మొదలు పెట్టకపోవడంతో ఈ చర్యకు దిగింది. ఇది పైకి కనిపించేది అయితే.. వెనుక పలు కారణాలు కూడా కనిపిస్తున్నాయి. ఇంతకూ కథమేటింటే.. తెలంగాణ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజకీయాల్లోకి రాకమునుపే పెద్ద కాంట్రాక్టరు అనే సంగతి తెలిసిందే. 2014లో వైసీపీ తరఫున ఖమ్మం నుంచి గెలిచిన ఆయన తర్వాత బీఆర్ఎస్ లో చేరారు. గత ఏడాది జూలైలో కాంగ్రెస్ లోకి వచ్చారు. ఎన్నికల్లో పార్టీ గెలవడంతో మంత్రి కూడా అయ్యారు. కాగా, పొంగులేటి కుటుంబానికి చెందినదే రాఘవ కన్ స్ట్రక్షన్స్. తండ్రి రాఘవరెడ్డి పేరిట దీనిని స్థాపించారు. కాగా.. ఈ సంస్థ ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఉండగా పలు కాంట్రాక్టులు చేపట్టింది. ఏపీ మాజీ సీఎం జగన్ కు పొంగులేటి అత్యంత సన్నిహితులు కూడా. రాఘవ కన్ స్ట్రక్షన్స్ ఏపీలోని తూర్పు విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్‌) పరిధిలో భూగర్భ విద్యుత్‌ లైన్ల ఏర్పాటుకు రూ.1,194 కోట్ల టెండరును దక్కించుకుంది. ఇది జరిగి ఏడాది దాటినా పనులు మొదలుపెట్టలేదు.

వెంటనే పనులు మొదలుపెట్టాలి..

రాఘవ కన్ స్ట్రక్షన్స్ వెంటనే పనులు పెట్టకపోతే చర్యలు తీసుకుంటామంటూ ఏపీ సర్కారు హెచ్చరించింది. పనుల విషయమై ప్రతి నెల డిస్కం అధికారులు నోటీసులిస్తున్నా స్పందన కొరవడడంతో చర్యలు తప్పవని స్పష్టం చేసింది. విద్యుత్తు సంస్థల పునర్వ్యవస్థీకరణ పథకం (ఆర్‌డీఎస్‌ఎస్‌)లో భాగంగా ప్రతిపాదించిన పనులను గడువులోగా పూర్తి చేయకుంటే కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంటు నిలిచిపోతుంది. దీంతో తీవ్రంగానే స్పందించిన ఏపీఈపీడీసీఎల్.. కాస్త కటువుగానే నోటీసులో హెచ్చరించింది.

అంచనాలు పెంచి..

ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఉండగా మొదట రూ.1,194 కోట్లతో భూగర్భ విద్యుత్‌ లైన్లకు, రూ.314 కోట్లతో ఆర్‌ఎంయూల సరఫరాకు టెండర్లు పిలిచారు. ఈ టెండర్‌ విలువ కంటే రూ.343 కోట్లు అంచనాలు పెరిగాయి. అంచనా విలువ కంటే 10 శాతం అధిక మొత్తానికి రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌ బిడ్‌ లో కోట్‌ చేసింది. ఆర్‌డీ ఎస్‌ ఎస్‌ కింద లైన్ల ఏర్పాటుతో పాటు, రింగ్‌ మెయిన్‌ యూనిట్‌ ల సరఫరా కూడా కలిపి రూ.1,165 కోట్లతో 2022లో (2021-22 ఎస్ ఆర్ఆర్- స్టాండర్డ్‌ షెడ్యూల్‌ రేట్లతో) టెండర్లు పిలవగా స్పందన కొరవడింది. 2022-23 ఎస్‌ ఎస్‌ ఆర్‌ రేట్లతో 2023 ఏప్రిల్‌ లో మళ్లీ టెండర్లు పిలిచింది. భూగర్భ లైన్ల పనులకు రాఘవ కన్‌స్ట్రక్షన్స్, షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్‌, మరో రెండు కంపెనీలు బిడ్‌ లు వేశాయి. అయితే, భూగర్భ లైన్ల పనులకే రాఘవ కనస్ట్రక్షన్స్‌ కు రూ.1,285.94 కోట్లను ఏపీ తూర్పు విద్యుత్తు పంపిణీ సంస్థ చెల్లించనుంది. టెండర్‌ ధరపై ఇది రూ.91.94 కోటు అదనం కావడం గమనార్హం. ఆర్‌ఎంయూల కొనుగోలుకు చేయనున్న రూ.314 కోట్ల ఖర్చునూ కలిపితే రూ.1,599.94 కోట్లకు పెరుగుతోంది. అంటే.. 2022 డిసెంబరులో పిలిచిన టెండరు ధరలతో పోలిస్తే ప్రాజెక్టు విలువ 37.33 శాతం (రూ.434.94 కోట్లు) పెరగనుంది.

ప్రభుత్వం మార్పు.. నిర్ణయాల తిరగదోడుతూ

ఏపీలో ప్రభుత్వం మారడంతో పాత సర్కారు నిర్ణయాలను తిరగదోడుతున్న సంగతి తెలిసిందే. అందులోభాగంగా రాఘవ కన్ స్ట్రక్షన్స్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అయితే, రాజకీయాల్లోకి వచ్చాక తెలంగాణ మంత్రి పొంగులేటి ఈ సంస్థ బాధ్యతల నుంచి వైదొలగారా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది. జగన్ సీఎంగా ఉన్నప్పుడు పొంగులేటి నేరుగా వెళ్లి ఆయనను కలిసేవారనే పేరుంది. తాజా పరిణామం పట్ల ఆయన ఏమంటారో చూద్దాం.?