Begin typing your search above and press return to search.

టీడీపీలో లోకేష్ కి టిక్కెట్ లేదా?

ఇంతకూ చంద్రబాబు తీసుకున్న ఆ నిర్ణయం ఏమిటంటే... సీనియర్స్ అయినా, జూనియర్స్ అయినా... కుటుంబంలో ఒక్కరికే టిక్కెట్ ఇవ్వాలని అట. దీంతో సరికొత్త సమస్యలు తెరపైకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది.

By:  Tupaki Desk   |   28 Dec 2023 5:43 AM GMT
టీడీపీలో లోకేష్  కి టిక్కెట్  లేదా?
X

ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీ అధినేత చంద్రబాబుకు సరికొత్త సమస్య వచ్చిపడిందని తెలుస్తుంది. దీంతో ఆయన ఒక్కొక్కరికీ ఒక్కో సమాధనం చెప్పలేక జనరల్ ఒకటే రూల్ తెరపైకి తెచ్చారని.. పార్టీలో సీనియర్లు, జూనియర్లు అనే తారతమ్యాలు ఏమీ లేకుండా అందరికీ ఆ రూల్ వర్తిస్తుందని చెబుతున్నారంట. ఇంతకూ చంద్రబాబు తీసుకున్న ఆ నిర్ణయం ఏమిటంటే... సీనియర్స్ అయినా, జూనియర్స్ అయినా... కుటుంబంలో ఒక్కరికే టిక్కెట్ ఇవ్వాలని అట. దీంతో సరికొత్త సమస్యలు తెరపైకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది.

అవును... టీడీపీలో పలువురు సీనియర్లు చంద్రబాబు వద్ద ఫ్యామిలీ ప్యాకేజ్ ఆప్షన్స్ పెడుతున్నారని అంటున్నారు. పైగా అడిగితే కాదనలేని స్థాయి సీనియర్లు కావడంతో బాబుకు మాచెడ్డ సమస్య వచ్చిపడిందని అంటున్నారంట. ఇందులో ప్రధానంగా... రాప్తాడులో పరిటాల సునీత, ధర్మవరంలో పరిటాల శ్రీరాం కు లోకేష్ టిక్కెట్లు ప్రకటించినప్పటినుంచీ ఈ తరహా రిక్వస్టులు పెరిగిపోతున్నాయని అంటున్నారు. ఈ సమయంలో చంద్రబాబు సింగిల్ పాయింట్ రూల్ అందరికీ తెస్తున్నారని అంటున్నారు.

యువగళం పాదయాత్ర సమయంలో నారా లోకేష్ పలు స్థానాల్లో అభ్యర్థులను కన్ ఫాం చేసేశారు. ఇందులో భాగంగా రాప్తాడులో పరిటాల సునీత, ధర్మవరంలో పరిటాల శ్రీరాం పేర్లు ప్రకటించారు. దీంతో... తమ కుటుంబాల్లో కూడా ఇద్దరిద్దరికి టిక్కెట్లు ఇవ్వాలంటూ పలువురు సీనియర్లు చంద్రబాబు వద్ద క్యూ కట్టారంట. అందులో ఉత్తరాంధ్ర, రాయలసీమ నుంచి పలువురు సీనియర్లు ఉన్నారట.

ఇందులో భాగంగా... తమతో పాటు తమ వారసులు జేసీ వపన్, జేసీ అస్మిత్‌ లకు కూడా టికెట్లు ఇవ్వాలని జేసీ బ్రదర్స్ బాబు ముందు రిక్వస్ట్ పెట్టారని తెలుస్తుంది. ఇదే సమయంలో... తనకు నర్సీపట్నం అసెంబ్లీ టికెట్ ఇవ్వటంతో పాటు.. తన కొడుకు చింతకాయల విజయ్‌ కు మాడుగుల అసెంబ్లీ టికెట్ ఇవ్వాలని పట్టుబడుతున్నారట అయ్యన్న పాత్రుడు. ఇదే సమయంలో ఉత్తరాంధ్ర నుంచి మరో రెండు రిక్వస్టులు తదనుగుణంగా వస్తున్నాయని అంటున్నారు.

పెందుర్తిలో తనకు ఎమ్మెల్యే టిక్కెట్టు ఇవ్వడంతోపాటుగా అదే మాడుగుల నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ తన కొడుకు బండారు అప్పలనాయుడుకు ఇవ్వాల్సిందే అని బండారు సత్యనారాయణమూర్తి పట్టుబడుతున్నారట. ఇదే సమయంలో... ఇక గంటా శ్రీనివాసరావు కొడుకు గంటా రవితేజకు కూడా టికెట్ ఇవ్వాలని పట్టుబడుతున్నట్లు సమాచారం. వీరితో పాటు ఎచ్చెర్లలో తనకు మరోచోట తన కొడుకు రాం మల్లిక్‌ కు టికెట్ ఇవ్వాలని కిమిడి కళా వెంకట్రావు పదేపదే అడుగుతున్నారట.

దీంతో ఒక్కొక్కరికీ ఒక్కో సమాధానం చెప్పలేనని ఫిక్సయిన చంద్రబాబు ఈ దఫా జనసేనకు కూడా సీట్ల సర్దుబాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది గనుక... వచ్చే ఎన్నికల్లో కుటుంబానికి ఒక్క టిక్కెట్ మాత్రమే ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. దీంతో... లోకేష్ కు ఈసారి టిక్కెట్ ఇవ్వడం లేదా అనే గుసగుసలు వినిపిస్తున్నాయని తెలుస్తుంది. కుప్పం నుంచి చంద్రబాబు పోటీ చేసి.. అనంతరం లోకేష్ ను 2014 తరహాలోనే ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేస్తారా అనే చర్చ కూడా మొదలైందని అంటున్నారు.

ఏది ఏమైనా కుటుంబానికి ఒకటే టిక్కెట్టు... అది ఎవరికి ఇవ్వాలనేది వారికి వారే నిర్ణయించుకోవచ్చు అనే స్వేచ్ఛ ఇచ్చారని చెబుతున్న చంద్రబాబు... తన కుటుంబం విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది వేచి చూడాలి.