ఎక్కడా రీ పోలింగ్ లేదు.. తెలుగు రాష్ట్రాల చెరిగిపోని రికార్డు
ఎన్నికలంటే రాజకీయ పార్టీల దూకుడు.. ప్రత్యర్థులు కాస్త శత్రువులుగా ఉన్నచోట దుందుడుకు చర్యలు జరుగుతుంటాయి.
By: Tupaki Desk | 14 May 2024 11:03 AM GMTఎన్నికలంటే రాజకీయ పార్టీల దూకుడు.. ప్రత్యర్థులు కాస్త శత్రువులుగా ఉన్నచోట దుందుడుకు చర్యలు జరుగుతుంటాయి. దాడులు-ప్రతిదాడులు.. రెచ్చగొట్టుకోవడాలు.. రాళ్లు రువ్వుకోవడాలు ఇలాంటివి కొన్ని నియోజకవర్గాల్లో అతికొన్నిచోట్ల ఉంటాయి. అందుకే ఎన్నికల సంఘం పోలింగ్ కేంద్రాల వారీగా కేటగిరీలు ఇస్తుంటుంది. సమస్యాత్మకం, అత్యంత సమస్యాత్మకం అంటూ వర్గీకరిస్తుంది.
అంతా ప్రశాంతం
తెలంగాణలో నవంబరు 30న అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. వాస్తవానికి తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడూ లోక్ సభ-అసెంబ్లీ ఎన్నికలు కలిసే జరుగుతాయి. ఉమ్మడి ఏపీలో ఉన్నప్పుడూ అంతే. అయితే, 2018లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముందస్తుకు వెళ్లడంతో 2019 నుంచి తెలంగాణలో లోక్ సభకు అసెంబ్లీకి విడివిడిగా పోలింగ్ జరుగుతోంది. ఇక నవంబరు 30న తెలంగాణలో జరిగిన పోలింగ్ అంతా ప్రశాంతంగా ముగిసింది. మూడు పార్టీలు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పోటీ పడినప్పటికీ చెదురమదురు సంఘటనలు మినహా ఎక్కడా రీ పోలింగ్ జరపాల్సిన అవసరమే రాలేదు. ప్రస్తుత లోక్ సభ ఎన్నికల్లోనూ తెలంగాణలో స్వల్ప ఘటనలు కూడా నమోదు కాలేదు. ప్రజలు తమ సమస్యలు పరిష్కారం కాలేదని ఎన్నికలకు బహిష్కరించడం మినహా ఇతరత్రా సమస్యలు ఎదురపడలేదు. అంటే.. తెలంగాణలో విడిగా జరిగినా, అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు సాఫీగా జరిగిపోయాయి.
హాట్ హాట్ ఏపీలోనూ..
ఏపీలో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు కలిసే జరిగాయి. 2019లో తరహాలోనే కొంత ఉద్రిక్తత నెలకొంది. అయితే, ఎక్కడా రీ పోలింగ్ జరపాల్సిన స్థాయిలో మాత్రం సంఘటనలు జరగలేదు. అంతేకాదు.. రాష్ట్రంలోని కొన్నిచోట్ల రాత్రి 2 గంటల వరకూ పోలింగ్ కొనసాగిందని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్‌కుమార్ మీనా వెల్లడించారు. సోమవారం రాత్రి 12 గంటల వరకు దాదాపు 78.25శాతం పోలింగ్ నమోదైందని తెలిపారు. 1.2 శాతం పోస్టల్ బ్యాలెట్‌తో కలిపి మొత్తం 79.4శాతం ఓటింగ్ నమోదయ్యే అవకాశం ఉందని చెప్పారు. సుమారు 81 శాతం పోలింగ్ నమోదవ్వొచ్చని అంచనా వేస్తున్నామని తెలిపారు. కాగా, ఏపీలో 2019 ఎన్నికల్లో 79.2శాతం పోలింగ్ నమోదైంది.
ఎన్నికల సంఘమా భేష్..
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలను అత్యంత సజావుగా నిర్వహించడంలో ఎన్నికల సంఘం అత్యంత విజయవంతం అయింది. పక్కా ఏర్పాట్లు, సునిశితమైన నిఘా, అవసరమైతే అధికారులపై చర్యలు తీసుకోవడం వంటి చర్యలతో యంత్రాంగాన్ని ఎన్నికల సంఘం పూర్తి నియంత్రణలో తీసుకుంది. దీంతోనే ఎన్నికల సంఘం పనితీరుకు ప్రశంసలు దక్కుతున్నాయి. కాగా, అన్నిటికి మించయి అత్యంత ఒత్తిడి వాతావరణంలోనూ పోలీసుల పనితీరు భేష్ అనిపించింది.