వాలంటీర్లు వద్దు కానీ...ఈసీ కీలక ఆదేశాలు....!
ఎన్నికల వేళ వారు అధికార పార్టీకి ఎంతగానో ఉపయోగపడతారు అని వైసీపీ ధీమాగా ఉంటే విపక్షాలు ఆ విషయంలోనే కంగారు పడుతున్నారు.
By: Tupaki Desk | 15 Feb 2024 1:30 AM GMTఏపీలో వాలంటీర్ల వ్యవస్థ అతి పెద్ద వ్యవస్థగా ఉంది. దాదాపుగా రెండున్నర లక్షలకు పైగా వాలంటీర్లు ఏపీ అంతా ఉన్నారు. వారే వైసీపీకి అతి పెద్ద సైన్యం. ఎన్నికల వేళ వారు అధికార పార్టీకి ఎంతగానో ఉపయోగపడతారు అని వైసీపీ ధీమాగా ఉంటే విపక్షాలు ఆ విషయంలోనే కంగారు పడుతున్నారు.
వాలంటీర్లను ఎట్టి పరిస్థితులలోనూ ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉంచాలని కోరుతూ వస్తోంది. ఇపుడు కేంద్ర ఎన్నికల సంఘం కూడా అదే తేల్చింది. వాలంటీర్లను ఎన్నికల విధులలోకి ఎట్టి పరిస్థితులలోనూ తీసుకోవద్దు అని ఈసీ కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి సూచించింది.
ఎన్నికల విధులకు పూర్తిగా వాలంటీర్లను దూరంగా పెట్టాలని స్పష్టంగా చెప్పింది. అయితే కేంద్ర ఎన్నికల సంఘం మరో విషయంలో చూస్తే క్లారిటీ ఇచ్చింది. ఏపీలో లక్షన్నర దాకా ఉన్న సచివాలయ సిబ్బందిని విధులలోకి తీసుకోవచ్చు అని పేర్కొంది. అయితే వీరి విషయంలో కూడా ఒక కండిషన్ పెట్టింది.
సచివాలయంలో రెగ్యులర్ గా పనిచేసే సిబ్బందిని తీసుకున్నా వారికి ఓటర్ల వేలికి ఇంకు పూసే విధులు అప్పగించాలని సూచన చేసింది. అంతకు మించి వారికి ఎలాంటి బాధ్యతలు వద్దు అని స్పష్టం చేసింది. అలా ఏపీవ్యాప్తంగా ఉన్న గ్రాం వార్డు సచివాలయ సిబ్బందికి ఎన్నికల విధులలో కేవలం అతి చిన్న ప్రక్రియ కోసమే వినియోగించాలని పేర్కొనడం విశేషం.
ఇలా ప్రతీ పోలింగ్ స్టేషన్ లోనూ రెగ్యులర్ సచివాలయ సిబ్బంది మాత్రమే ఉండాలని కూడా సూచించింది. కానీ వారు జస్ట్ ఆ ఒక్క పనికే అని కండిషన్ పెట్టేసింది. అదే విధంగా చూసే బీఎల్వోలుగా పనిచేసిన సిబ్బందిని మాత్రం పోలింగ్ విధుల్లోకి తీసుకోవద్దని స్పష్టం చేసింది. బీఎల్వోలకు పోలింగ్ రోజున ఇతర పనులు అప్పగించేలా ఉత్తర్వులు ఇవ్వాలని సీఈవోకు సూచించింది.
వాలంటీర్లు మాత్రం దూరంగా ఉండాల్సిందే అంటూ వారిని కనీసం పోలింగ్ ఏజెంట్ గా కూడా అసలు అనుమతించవద్దు అని చెప్పేసింది. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి వచ్చిన క్లారిటీ అలాగే కండిషన్లు సూచనల నేపధ్యంలో గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి ఎన్నికల విధుల అప్పగింతకు అభ్యంతరం లేదంటూ కలెక్టర్లు, అధికారులకు సీఈవో ఒక కీలకమైన సందేశం పంపించారు.
వాలంటీర్లు అన్న మాటే ఎన్నికల ప్రక్రియ వద్ద అసలు రానీయవద్దు అని కూడా సీఈఓ కలెక్టర్లకు స్పష్టం చేశారు. ఈసీ సూచన నేపథ్యంలో సచివాలయ సిబ్బందికి ఎన్నికల్లో ప్రధాన విధులు మాత్రం అప్పగించవద్దని జిల్లా యంత్రాంగాలకు స్పష్టం చేశారు. అలా వాలంటీర్లను దూరం చేస్తున్నారు. రెగ్యులర్ సచివాల సిబ్బందికి మాత్రం కీలక పోలింగ్ బాధ్యతలు ఏవీ ఇవ్వడంలేదు అని తెలిసిపోతోంది. ఇది ఏపీ రాజకీయాలలో ఒక సంచలనంగానే చూడాల్సి ఉంటుంది. దీని మీద అధికార ప్రతిపక్షాల రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది.