ఇక, 'డాక్యమెంటరీ' రాజకీయాలు.. బీఆర్ ఎస్, కాంగ్రెస్‌లు రెడీ!
ఈ డాక్యుమెంటరీకి తెలంగాణ చిత్రసీమకు చెందిన ప్రముఖ దర్శకుడు నిర్విరామంగా కృషి చేస్తున్నారు.
By: Tupaki Desk | 21 Oct 2023 4:30 PM GMTఔను.. ఎంత పండిస్తే.. అన్ని ఓట్లు. ఇదీ ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సెంటిమెంట్లపై అన్ని పార్టీలూ పెట్టుకున్న ఆశలు. అది ఏ రూపంలో ఉన్నా.. తమకు మేలు చేస్తే చాలనే భావనతోనే పార్టీలు అడుగులు ముందుకు వేస్తున్నాయి. అధికార పార్టీ బీఆర్ ఎస్ నుంచి అధికారం కోరుకునే బీజేపీ, కాంగ్రెస్ వరకు.. అన్ని పార్టీలదీ ఇదే దారి. ఈ క్రమంలో 10 ఏళ్ల కిందట ఏం జరిగిందనే విషయంపై బీఆర్ ఎస్ నేతలు ఏకంగా ప్రత్యేక డాక్యమెంటరీని రిలీజ్ చేయాలని భావిస్తున్నారు.
ఈ డాక్యుమెంటరీకి తెలంగాణ చిత్రసీమకు చెందిన ప్రముఖ దర్శకుడు నిర్విరామంగా కృషి చేస్తున్నారు. ఇప్పటికే రెండు కాపీలు రెడీ అయ్యాయని, వీటిలో ఒక దానిని సీఎం కేసీఆర్ ఓకే చేస్తే.. వెంటనే సోషల్ మీడియాలో దానిని ప్రచారం చేసేందుకు రెడీగా ఉన్నారు. నాటి విషయాల్లో ప్రధానంగా కేసీఆర్ ఆమరణ దీక్షకు దిగడం, విద్యార్థులను ఓదార్చడం, శ్రమ దానం, తెలంగాణ ఉద్యమంపై కాంగ్రెస్ నేతల పరాచికాలు.. కేంద్రాన్ని బతిమాలుతూ.. కేసీఆర్ చేసిన రాజీనామాలు వంటివి ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది.
అంటే మొత్తంగా.. కేసీఆర్ సెంట్రిక్‌గానే ఈ డాక్యుమెంటరీ ఉండనుంది. దీనిని ప్రజల్లోకి తీసుకువెళ్లి.. వారిలో సెంటిమెంటును రాజేసే ప్రయత్నం చేయనున్నారన్న మాట. ఇక, కాంగ్రెస్ విషయానికి వస్తే.. బీఆర్ ఎస్ డాక్యుమెంటరీపై ఉప్పందుకున్న కాంగ్రెస్ పార్టీ తన వంతుగా కౌంటర్ డాక్యుమెంటరీని రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నట్టు గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి. దీనిలో కేసీఆర్‌ను నెగిటివ్‌గా చూపించే ప్రయత్నం, అదేసమయంలో సోనియాను హైలెట్‌చేస్తూ.. కాంగ్రెస్ లేకపోతే.. తెలంగాణ వచ్చేది కాదన్న విషయాన్ని ప్రస్తావించనున్నారు.
తెలంగాణ వస్తే.. ఎస్సీని ముఖ్యమంత్రిని చేస్తానన్న కేసీఆర్ డైలాగులను, నీళ్లు-నిధులు-నియామకాల వాదనను కూడా ప్రజల్లోకి కాంగ్రెస్ డాక్యుమెంటరీ రూపంలో తీసుకురానుంది. అదేసమయంలో ఈ పదేళ్లలో రైతులు, విద్యార్థులు చేసుకున్న ఆత్మహత్యలు, సర్కారు ఉదాసీనత, కేంద్రంపై అప్పుడోమాట.. ఇప్పుడో మాట..అన్నట్టుగా కేసీఆర్ వ్యవహరిస్తుండడం వంటి కీలక విషయాలపై దృష్టి పెట్టింది. ఒకవైపు ఎన్నిక లప్రచారంలో వీటిని అస్త్రంగా మార్చుకుని.. మరోవైపు.. చిన్న చిన్న డాక్యమెంటరీలుగా మార్చి.. ప్రజల్లోకి తీసుకువెళ్లడం ద్వారా వారిని తమవైపు తిప్పుకొనే ప్రయత్నంలో కాంగ్రెస్ ఉంది. మరి ఈ డాక్యుమెంటరీ రాజకీయాలు ఏమేరకు సక్సెస్ అవుతాయో చూడాలి.