అప్పుడు రష్మిక వీడియో.. ఇప్పుడు ఈ సీఎం వీడియో!
వారు బెట్టింగ్, గేమింగ్ యాప్ లకు ప్రచారం చేస్తున్నట్లు మార్ఫింగ్ చేశారు.
By: Tupaki Desk | 11 March 2024 7:54 AM GMTఅంతకంతకూ టెక్నాలజీ రంగంలో వస్తున్న నూతన మార్పులు ప్రజలకు మేలు చేస్తున్నా కీడు కూడా అంతే స్థాయిలో జరుగుతోంది. ముఖ్యంగా డీప్ ఫేక్ టెక్నాలజీని ఉపయోగించుకుని ప్రముఖులను వీడియోల రూపంలో సైబర్ నేరగాళ్లు అభాసుపాలు చేస్తున్నారు. ఇలాగే ఇటీవల ప్రముఖ నటీమణులు రష్మిక, కాజోల్ డీప్ ఫేక్ వీడియోలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. వీరిద్దరి వీడియోలను అసభ్యంగా నేరగాళ్లు మార్చారు. అలాగే ప్రముఖ క్రీడాకారులు సచిన్ టెండ్కూలర్, విరాట్ కోహ్లీ డీప్ ఫేక్ వీడియోలు సైతం వైరల్ అయ్యాయి. వారు బెట్టింగ్, గేమింగ్ యాప్ లకు ప్రచారం చేస్తున్నట్లు మార్ఫింగ్ చేశారు.
ప్రముఖ సినీ నటి రష్మిక డీప్ ఫేక్ వీడియోపై దేశస్థాయిలో దుమారం రేగడం, దీనిపై ప్రముఖులు తీవ్ర ఆందోళన వెలిబుచ్చడం తెలిసిన సంగతి తెలిసిందే. రష్మిక డీప్ ఫేక్ వీడియోను చేసిన వ్యక్తిని గుంటూరులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మార్ఫింగ్ వీడియోలపై ప్రముఖుల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. అయినా సరే ఈ అరాచకానికి అడ్డుకట్ట పడటం లేదు. ఇప్పుడు తాజాగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ డీప్ ఫేక్ బారిన పడ్డారు.
తాజాగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ డీప్ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో డయాబెటిక్ ఔషధానికి ఆయన ప్రచారం చేస్తున్నట్లు అందులో ఉండటం గమనార్హం.
మధుమేహ బాధితులు ఔషధాన్ని కొనుగోలు చేయాలంటూ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రోత్సహిస్తున్నట్లు కేటుగాళ్లు ఈ వీడియోను రూపొందించారు. ఓ న్యూస్ ఛానల్ క్లిప్ లో యోగి మాడ్లాడుతున్నట్టు దీన్ని మార్చారు.
41 సెకన్ల నిడివితో యోగి ఆదిత్యనాథ్ డీప్ ఫేక్ వీడియో ఉంది. ఫిబ్రవరి 26న దీన్ని ‘గ్రేస్ గర్షియా’ అనే అకౌంట్ నుంచి ఫేస్ బుక్ లో అప్ లోడ్ చేశారు. ఈ వీడియోను 225000 మంది చూశారు. ఈ వీడియోకి షేర్లు సైతం వందల్లో వచ్చాయి. ‘‘భారతదేశంలో మధుమేహం జయించబడింది. మధుమేహానికి వీడ్కోలు చెప్పండి’’ అని యోగి ఆదిత్యనాథ్ చెప్పినట్టుగా ఆ వీడియోలో ఉంది.
ఈ నేపథ్యంలో హజ్రత్ గంజ్ ఎస్సై మహమ్మద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైబర్ క్రై ం పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు తీవ్ర ముప్పుగా మారుతున్న డీప్ ఫేక్ వంటివాటి కట్టడికి చర్యలు తీసుకుంటామని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ ఇటీవల వెల్లడించారు. తప్పుడు సమాచారాన్ని గుర్తించి వెంటనే తొలగించాలని సామాజిక మాధ్యమ సంస్థల ప్రతినిధులను ఇప్పటికే కేంద్రం ఆదేశించింది.