ఇప్పుడిక ‘వసంత’ పయనమెటు?
2019 ఎన్నికల్లో ఆయన టీడీపీ అభ్యర్థి దేవినేని ఉమామహేశ్వరరావుపై విజయం సాధించారు
By: Tupaki Desk | 3 Feb 2024 4:40 AM GMTఉమ్మడి కృష్ణా జిల్లాలో కీలకమైన నియోజకవర్గాల్లో ఒకటి.. మైలవరం. ఇక్కడి నుంచి ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2019 ఎన్నికల్లో ఆయన టీడీపీ అభ్యర్థి దేవినేని ఉమామహేశ్వరరావుపై విజయం సాధించారు. అటు వసంత, ఇటు దేవినేని ఇద్దరూ కమ్మ సామాజికవర్గానికి చెందినవారే.
కాగా వచ్చే ఎన్నికల్లో మైలవరం టిక్కెటును వసంత కృష్ణప్రసాద్ కు కాకుండా సర్నాల తిరుపతిరావుకు కేటాయించారు. ఈయన ప్రస్తుతం జెడ్పీటీసీగా ఉన్నారు. వైసీపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం మైలవరం నియోజకవర్గంలో అంతగా జరగలేదని అంటున్నారు. అందుకే వసంతకు టికెట్ ఇవ్వలేదని అంటున్నారు.
అంతేకాకుండా గత కొన్ని రోజులుగా సంక్షేమ పథకాలు అందిస్తున్నా.. అభివృద్ధి లేదని, ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారని వసంత కృష్ణప్రసాద్ నియోజకవర్గంలో జరుగుతున్న వివిధ కార్యక్రమాల్లో హాట్ కామెంట్స్ చేస్తున్నారు. వీటికి టీడీపీ అనుకూల మీడియాలో మంచి ప్రాధాన్యత లభిస్తోంది. దీంతో వసంత కృష్ణప్రసాద్ కు సీటు నిరాకరించారనే చర్చ జరుగుతోంది.
ఈ నేపథ్యంలో వసంత కృష్ణప్రసాద్ టీడీపీలో చేరతారనే టాక్ నడుస్తోంది. మైలవరం లేదా జగ్గయ్యపేట నుంచి టీడీపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తారని తెలుస్తోంది. లేదంటే విజయవాడ పార్లమెంటు స్థానానికి కూడా ఆయనను అభ్యర్థిగా ప్రకటించవచ్చని అంటున్నారు. ప్రస్తుతం మైలవరం టీడీపీ ఇంచార్జిగా దేవినేని ఉమామహేశ్వరరావు ఉన్నారు.
వసంత కృష్ణప్రసాద్ కు మైలవరం అసెంబ్లీ సీటును ఇస్తే దేవినేని ఉమా విజయవాడ ఎంపీగా పోటీ చేయొచ్చని అంటున్నారు. ఒకవేళ దేవినేని ఉమానే మైలవరం నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తే వసంత కృష్ణప్రసాద్ ను జగ్గయ్యపేట అసెంబ్లీ స్థానం నుంచి లేదా విజయవాడ ఎంపీ స్థానం నుంచి పోటీ చేయించవచ్చని టాక్ నడుస్తోంది.
మరోవైపు వసంత కృష్ణప్రసాద్ కు మైలవరం సీటు ఇవ్వకపోతే తనకు ఆ సీటు ఇవ్వాలని వైసీపీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే జ్యేష్ట రమేశ్ బాబు అధిష్టానాన్ని కోరుతూ వచ్చారు. మన మైలవరం – మన నాయకత్వం పేరుతో ఆయన ఇప్పటికే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే వైసీపీ అధినేత జగన్.. జ్యేష్ట రమేశ్ బాబుకు సైతం టికెట్ ఇవ్వలేదు. దీంతో జ్యేష్ట రమేశ్ కూడా పార్టీ మారతారనే ప్రచారం జోరుగా జరుగుతోంది.