Begin typing your search above and press return to search.

యువ‌త వ‌ద్దు.. వృద్ధులే ముద్దు.. ఓవైసీకి హెడేక్ త‌ప్పేలా లేదే!

యువ‌త వ‌ద్దు.. వృద్ధులే ముద్దు.. అంటూ.. ఇద్ద‌రి నుంచి ముగ్గ‌రు సిట్టింగ్ ఎమ్మెల్యేలు.. పార్టీపై ఒత్తిడి పెంచుతున్నారు. అంతేకాదు.. త‌మ‌కు టికెట్ ఇవ్వ‌క‌పోతే.. రెబ‌ల్‌గా పోటీకిరెడీ అంటూ సంకేతాలు పంపించారు.

By:  Tupaki Desk   |   27 Oct 2023 6:26 AM GMT
యువ‌త వ‌ద్దు.. వృద్ధులే ముద్దు.. ఓవైసీకి హెడేక్ త‌ప్పేలా లేదే!
X

ఒక‌వైపు చాలా వ‌ర‌కు పార్టీలు యువ‌త‌కు పెద్ద‌పీట వేస్తున్నాయి. యువ‌త‌ను పెద్ద ఎత్తున ఆక‌ర్షించే ప‌నిచే ప‌ట్టాయి. యువ‌త‌కే ఎక్కువ‌గా టికెట్లు కూడా కేటాయిస్తున్నాయి. ఎందుకంటే.. తెలంగాణఅసెంబ్లీ ఎన్నిక‌ల్లో యువ ఓట‌ర్ల ప్ర‌భావం ఈ సారి ఎక్కువ‌గా ఉండేలా క‌నిపిస్తోంది. దీంతోవారిని ఆక‌ర్షించాలంటే..యువ‌త‌కు ప్రాధాన్యం ఇవ్వ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఈ నేప‌థ్యంలోనే హైద‌రాబాద్‌కు చెందిన ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీ నేతృత్వంలోని ఎంఐఎం పార్టీ కూడా యువ‌త‌కు టికెట్లు ఇవ్వాల‌ని నిర్ణ‌యించింది.

ఈ విష‌యాన్ని గ‌త రెండు నెల‌లుగా ఓవైసీ త‌న పార్టీ నాయ‌కులకు, సిట్టింగ్ ఎమ్మెల్యేల‌కు కూడా చెబుతు న్నారు. ఇత‌ర పార్టీల‌తో స‌మానంగా దూకుడు పెంచాలంటే.. యువ‌త‌కు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంద‌ని ఆయ‌న అంటున్నారు. అయితే.. ఇదే విష‌యం ఇప్పుడు ఎంఐఎంలో చిచ్చు పెడుతోంది. యువ‌త వ‌ద్దు.. వృద్ధులే ముద్దు.. అంటూ.. ఇద్ద‌రి నుంచి ముగ్గ‌రు సిట్టింగ్ ఎమ్మెల్యేలు.. పార్టీపై ఒత్తిడి పెంచుతున్నారు. అంతేకాదు.. త‌మ‌కు టికెట్ ఇవ్వ‌క‌పోతే.. రెబ‌ల్‌గా పోటీకిరెడీ అంటూ సంకేతాలు పంపించారు.

చార్మినార్ స్థానం నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే ముంతాజ్‌ అహ్మద్‌ ఖాన్, యాకుత్‌పురా స్థానం నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే అహ్మద్‌ పాషాఖాద్రీలు వ‌య‌సు రీత్యా వృద్ధులు అయిపోయార‌నే వాద‌న ఉంది. ఈ నేప‌థ్యంలో వారి స్థానాల‌ను యువ‌త‌కు కేటాయించాల‌ని ఓవైసీ భావిస్తున్నారు. అదేవిధంగా నాంపల్లి నుంచి వ‌రుస విజ‌యాలు ద‌క్కించుకున్న ఎమ్మెల్యే జాఫర్‌ హుస్సేన్‌ మేరాజ్ ను యాకుత్‌పురాకు మార్చే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే నాంపల్లి నుంచి మాజీ మేయర్‌ మాజీద్‌ హుస్సేన్‌ను బరిలో దింపాలని నిర్ణ‌యించారు.

ఇదేస‌మ‌యంలో చార్మినార్‌ స్థానం నుంచి అక్బరుద్దీన్ ఓవైసీ కుమారుడు డాక్టర్‌ నూరుద్దీన్ ను కానీ, ఆయ‌న కుమార్తె ఫాతిమాను కానీ ఖ‌రారు చేయాల‌ని ఓవైసీలు నిర్ణ‌యించారు. ఈ నిర్ణ‌యాలే.. పార్టీలో తీవ్ర అసంతృప్తికి దారి తీశాయి. త‌మ టికెట్ల‌ను త‌మ‌కే ఇవ్వాల‌ని.. త‌మ‌ను మార్చేందుకు వీలు లేద‌ని.. సిట్టింగులు ప‌ట్టుబ‌డుతున్న‌ట్టు తెలిసింది. దీంతో జాబితా విష‌యంలో ఓవైసీ త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నారు. వీరిని కాద‌ని అంటే.. మ‌రో వైపు కాంగ్రెస్‌.. రెడీగా ఉంది. ఎంఐఎం అసంతృప్తుల‌ను త‌న‌వైపు తిప్పుకొని.. వారికి టికెట్లు కేటాయించి.. ఓవైసీకి దెబ్బ కొట్టాల‌నే వ్యూహంతో కాంగ్రెస్ ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు స‌మాచారం.